
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ నటించిన ‘సితారే జమీన్ పర్’ (Sitaare Zameen Par) చిత్రం ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. యూట్యూబ్లో రన్ అవుతున్న ఈ సినిమాను చూడాలంటూ రూ. 100 చెల్లించాల్సి ఉంది. పే-పర్-వ్యూ (Pay-per-view) మోడల్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం రెంట్ తాజాగా తగ్గించారు. థియేటర్లో ప్రదర్శన అనంతరం నేరుగా యూట్యూబ్లోనే ఈ మూవీని ఆయన విడుదల చేశారు. హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం వంటి భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంది.
ఇండిపెండెన్స్ డే కానుకగా సితారే జమీన్ పర్ సినిమాను కేవలం రూ. 50లకే చూడొచ్చని నిర్మాణ సంస్థ పేర్కొంది. ఈ చిత్రాన్ని చూడాలని ఆసక్తి ఉంటే యూట్యూబ్‌లో కేవలం రూ. 50 చెల్లిస్తే సరిపోతుంది. అయితే, ఈ ఆఫర్ కేవలం ఆగష్టు 15 నుంచి 17 వరకు మాత్రమే ఉంటుంది. ఇదే విషయాన్ని చెబుతూ ఆమిర్ ఖాన్ ఒక వీడియో విడుదల చేశారు. ఆర్.ఎస్. ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ కామెడీ డ్రామా మూవీ జూన్ 20న థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రం గురించి మహేశ్బాబు ప్రశంసలు కురిపించారు. సితారే జమీన్ పర్ అందరి మనసులు దోచుకుంటోందని ఆయన అన్నారు. ఈ మూవీ మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. అలాగే చప్పట్లు కొట్టేలా చేస్తుందని చెప్పారు. ఈ సినిమా చూశాక కచ్చితంగా చిరునవ్వుతో బయటకు వస్తారని ఆయన అన్నారు.
సితారే జమీన్ పర్ మూవీలో ఆమిర్ ఖాన్, జెనీలియా జంటగా నటించారు. ఆర్‌ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించగా ఆమిర్‌ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆమిర్‌ఖాన్, అపర్ణ పురోహిత్ నిర్మించారు. ఈ చిత్రంలో ఆరోష్ దత్తా, గోపీకృష్ణ వర్మ, సంవిత్ దేశాయ్, వేదాంత్ శర్మ, ఆయుష్ భన్సాలీ, ఆశిష్ పెండ్సే, రిషి షహానీ, రిషబ్‌జైన్ , నమన్ మిశ్రా, సిమ్రాన్ మంగేష్కర్ వంటి వారు కీలకపాత్రల్లో నటించారు.