'చేసేదేమిలేక శరీరానికి కవర్‌ చుట్టుకున్నా'..సీనియర్ నటి శోభన | Shobana Express Sing Experience With Superstar Rajinukanth | Sakshi
Sakshi News home page

Shobana: ఆ సాంగ్‌ అంటే హీరోయిన్‌ పని అయినట్టే: శోభన

Apr 15 2023 8:36 PM | Updated on Apr 15 2023 10:13 PM

Shobana Express Sing Experience With Superstar Rajinukanth - Sakshi

హీరోయిన్ శోభన అంటే ఇప్పటి తరం గుర్తు పట్టకపోవచ్చు. కానీ ఆ కాలం నాటి సినీ ప్రేక్షకులకు మాత్రం పరిచయం అక్కర్లేని పేరు. 1980 దశకంలో స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. 1986లో అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన విక్రమ్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది శోభన. ఆ తర్వాత విజృంభణ, అజేయుడు, మువ్వగోపాలుడు, అభినందన, రుద్రవీణ, అల్లుడు గారు, రౌడీ గారి పెళ్లాం, రౌడీ అల్లుడు వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది.

తెలుగు, మలయాళం, తమిళ, హిందీ చిత్రాల్లోనూ మెప్పించింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌, మోహన్‌బాబు లాంటి అగ్ర హీరోలతో నటించింది. కేవలం నటిగానే కాదు.. క్లాసికల్‌ డ్యాన్సర్‌గానూ గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభన తన కెరీర్‌ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో  శివ మూవీ సెట్‌లో జరిగిన ఓ విషయాన్ని బయటపెట్టారు.

శోభన మాట్లాడుతూ..'రజనీకాంత్‌తో శివ, దళపతి సినిమాల్లో నటించా. అయితే శివ చిత్రం షూటింగ్‌లో వర్షం పాట చిత్రీకరించడానికి సెట్‌ వేశారు. ఆ విషయం నాకు తప్ప.. అక్కడున్న వారందరికీ  తెలుసు. శరీరం కనిపించేలా ఉన్న ఓ తెల్ల చీర ఇచ్చి నన్ను కట్టుకోమన్నారు. దీంతో వెంటనే కాస్ట్యూమ్‌ బాయ్‌ని పిలిచి.. చీర చాలా పల్చగా ఉంది. ఇంటికెళ్లి.. లోపల ఏదైనా ధరించి దానిపై కట్టుకుని వస్తా అని చెప్పా. అయితే షూట్‌కు ఎక్కువ సమయం లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక చేసేదేమిలేక అక్కడే ఉన్న ఓ టేబుల్‌ కవర్‌ని ఒంటికి చుట్టుకున్నా. దానిపై చీర కట్టుకుని షూట్‌కి రెడీ అయిపోయా. ఆ సాంగ్‌కు డ్యాన్స్‌ చేస్తున్నప్పుడు కవర్‌ సౌండ్‌కు రజనీకాంత్‌ ఇబ్బంది పడ్డారు. ఆరోజు నేను టేబుల్‌ కవర్‌ ధరించానని ఎవరికీ తెలియదు. నాకు తెలిసి రెయిన్‌ సాంగ్స్‌ అంటే హీరోయిన్స్‌ను మర్డర్‌ చేసినట్టే అని నవ్వుతూ.'  అన్నారు.

కాగా.. 1980లోనే ప్రతిభ గల కళాకారిణులలో శోభన ఒకరు. అందం, నటనే కాదు.. నాట్యంలోనూ అద్భుతంగా రాణిస్తోంది. చెన్నైలోని చిదంబరం నాట్య అకాడమీలో శిక్షణ తీసుకున్న ఆమె.. ఇప్పుడు ఎంతో మంది చిన్నారులకు నాట్యం నేర్పిస్తోంది. 1994లో కళార్పణ అనే సంస్థ ఏర్పాటు చేసి భారతనాట్యంలో శిక్షణ ఇస్తుంది. ఆమె ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా నాట్యానికే తన జీవితాన్ని అంకితమిచ్చారు. కాగా.. 2011లో ఓ పాపను దత్తత తీసుకుని పెంచుకుంటోంది శోభన. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement