
పరస్పరం బేషరతుగా క్షమాపణలు చెప్పుకోవడంతో సీమాన్, నటి విజయలక్ష్మిల వివాదానికి ఎండ్ కార్డ్ పడింది. 'నామ్ తమిళర్ కట్చి' పార్టీ నేత సీమాన్.. తనను వాడుకుని మోసం చేసినట్టుగా దశాబ్దం కాలంగా నటి విజయలక్ష్మి పోరాటం చేస్తోంది. ఈ ఇద్దరి మధ్య వివాదం పోలీసు స్టేషన్లు చుట్టూ తిరిగింది. చివరకు హైకోర్ట్ వరకు చేరింది. ఈ కేసును రద్దు చేయాలని సీమాన్ దాఖలు చేసుకున్న విజ్ఞప్తిని మద్రాసు హైకోర్టు తిరస్కరించింది.
అయితే ఈ ఇద్దరిమధ్య వివాదాన్ని కొలిక్కి తెచ్చే విధంగా పంచాయితీలు సాగాయి. అదే సమయంలో సుప్రీంకోర్టును సీమాన్ ఆశ్రయించారు. ఈ సమయంలో సీమాన్‌పై తాను ఇచ్చిన కేసును వెనక్కు తీసుకుంటున్నట్టు లిఖిత పూర్వకంగా విజయలక్ష్మి పోలీసులకు సమర్పించారు. పెద్దల పంచాయితీతో వివాదం సద్దుమణిగినా, వ్యవహారం కోర్టులో ఉండటంతో విచారణ ఎదుర్కోక తప్పలేదు.
ఎట్టకేలకు సీమాన్, విజయలక్ష్మి పరస్పరం క్షమాపణలు చెప్పుకోవడంతో వివాదం కోర్టులోనూ సమసినట్లయ్యింది. బుధవారం విచారణ సమయంలో ఈ క్షమాపణల ప్రస్తావన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బెంచ్ ముందుకు వచ్చింది. ఇరువురి వాదనల అనంతరం క్షమాపణలను పరస్పరం అంగీకరించిన నేపథ్యంలో కేసును ముగించారు. ఇక మీదట అఫిడవిట్‌లో పేర్కొన్నట్టుగా నడుచుకోవాలని హితవు పలికారు.