
బాలీవుడ్ అనగానే చాలామందికి రొమాంటిక్ ఫీల్ గుడ్ మూవీస్ గుర్తొచ్చేవి. కానీ గత కొన్నేళ్లలో చూసుకుంటే ఆ తరహా సినిమాలు తగ్గిపోయాయని చెప్పొచ్చు. అప్పట్ల 'ఆషికి 2' ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇన్నాళ్లకు మళ్లీ అదే మూవీ తీసిన డైరెక్టర్ మోహిత్ సూరి నుంచి 'సయారా' అనే మూవీ వచ్చింది. గత వీకెండ్‌లో థియేటర్లలో రిలీజైంది. నార్త్ యువత అంతా తెగ ఫీలైపోతున్నారు.
(ఇదీ చదవండి: వృత్తిపరంగా ఇబ్బందుల్లో ఉన్నా.. యాంకర్ రష్మీ పోస్ట్)
అంతెందుకు మన స్టార్ హీరో మహేశ్ బాబు, 'పుష్ప 2' డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ సినిమా చూసి ఫిదా అయిపోయారు. ఎంత నచ్చిందో ఏమోగానీ మహేశ్ ట్వీట్ చేయగా.. సుక్కు తన ఇన్ స్టా స్టోరీలో సినిమా అదిరిపోయిందని పోస్ట్ చేశాడు. మరి సినిమా అంత బాగుందా? ఇంతకీ మూవీ కథేంటి? అనేది ఇప్పుడు చూద్దాం.

'సయారా' విషయానికొస్తే.. ప్రేమలో విఫలమైన హీరోయిన్(అనీత్ పడ్డా) ఓ రైటర్. అయితే ఓ అప్ కమింగ్ సింగర్(అహన్ పాండే)ని ప్రేమిస్తుంది. వీళ్లిద్దరి ప్రేమకు దేవుడు పెద్ద అవాంతరం కలిగిస్తాడు. హీరోయిన్‌కి అల్జీమర్స్ వ్యాధి వచ్చి ప్రతిదీ మర్చిపోతూ ఉంటుంది. అలాంటి టైంలో హీరోయిన్ పాత ప్రేమికుడు తిరిగొచ్చి ఆమెని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. మరోవైపు కెరీర్‌లో ఎదగడానికి ఎంతో ప్రయత్నిస్తున్న హీరో.. కెరీర్‌ని కావాలనుకున్నాడా? ప్రేమని కోరుకున్నాడా? అనేది మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: వరలక్ష‍్మికి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన భర్త.. రేటు ఎంతంటే?)

అరే ఈ స్టోరీ లైన్ చూడగానే ఏదో తెలుగు సినిమా గుర్తొస్తుందే అనిపించిందా? అవును మీరు అనుకున్నది నిజమే. స్వయానా ఈ మూవీ తీసిన మోహిత్ సూరి 'ఆషికి 2' ఛాయలతో పాటు తెలుగు సినిమాలైన 'పడిపడి లేచే మనసు', 'అర్జున్ రెడ్డి' ఛాయలు కూడా గట్టిగానే కనిపిస్తాయి. మన ఆడియెన్స్ 'బేబి' రిలీజైనప్పుడు ఎంతలా ఫీలయ్యారో.. ఇప్పుడు నార్త్ ఆడియెన్స్ కూడా అలానే తెగ ఎమోషనల్ అయిపోతున్నారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతానికైతే బాలీవుడ్‌లో 'సయారా' కాస్త గట్టిగానే సౌండ్ చేస్తోంది. ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం ఏంటంటే హీరోహీరోయిన్ ఇద్దరు కొత్తోళ్లే. అహన్ పాండే.. హీరోయిన్ అనన్య పాండేకి అన్నయ్య. అంటే పెదనాన్న కొడుకు. ఇతడు చూడటానికి అందంగా, ఫ్రెష్‌గా ఉన్నాడు. యాక్టింగ్ కూడా బాగానే చేశాడు. హీరోయిన్ అనీత్ పడ్డా కూడా గ్లామరస్‌గా భలే ఉంది. మోహిత్ సూరి ఎప్పటిలానే తనకు అచ్చొచ్చిన లవ్ రొమాంటిక్ జానర్ కథతో అదరగొట్టేశాడు. దానికి తోడు హిందీ ఇండస్ట్రీలోని డ్రై పీరియడ్ కూడా దీనికి కాస్త గట్టిగానే కలిసొచ్చిందని చెప్పొచ్చు. ఈ మూవీకి ఐదుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ ఐదు పాటలు ఇచ్చారు. అవన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. అది ఇంకో ప్లస్. అలా అన్ని ప్లస్సులు కలిసి 'సయారా'ని సూపర్ హిట్ చేసినట్లు కనిపిస్తోంది.
(ఇదీ చదవండి: తల్లి సమాధి దగ్గర మంచు లక్ష‍్మి.. వీడియో)