రియోరాజ్, మాళవిక మనోజ్ జంటగా నటించిన తమిళ చిత్రం ఆన్పావం పొల్లాదదు (Aan Paavam Pollathathu Movie). ఆర్‌జే విగ్నేష్‌కాంత్, షీలా, జెన్సన్ దివాకర్ ముఖ్యపాత్రులు పోషించిన ఈ చిత్రం ద్వారా కలైయరసన్ తంగవేల్ దర్శకుడుగా పరిచయమయ్యారు. డ్రమస్టిక్ ప్రొడక్షన్స్ పతాకంపై వెడిక్కారన్‌పట్టి ఎస్ శక్తివేల్ నిర్మించిన ఈ చిత్రానికి టీకేటీ నందకుమార్, ఎంఎస్‌కే ఆనంద్ సహ నిర్మాతలుగా వ్యవహరించారు.
ఈ చిత్రాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ విడుదల చేసింది. బ్లాక్‌షిప్ ఫైండింగ్స్ సంస్థ సహకారంతో రెండు వారాల క్రితం విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో థాంక్స్ గివింగ్ సమావేశాన్ని నిర్వహించారు. ఆర్‌జే విఘ్నేశ్‌కాంత్ మాట్లాడుతూ.. నిన్నటి జ్ఞాపకాలను మధురంగానూ, నేటి జ్ఞాపకాలను అనుభవాలుగానూ, రేపటి కలలను నిజం చేసేలా తాము నాటిన ఈ విత్తనానికి ఆదరణ తెలిపిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
దర్శకుడు కలైయరసన్ తంగవేల్ మాట్లాడుతూ.. ఈ విజయాన్ని కథా రచయిత శివకుమార్ మురుగేశన్‌తో కలిసి పంచుకుంటున్నానని అన్నారు. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ అందరూ ఒక కుటుంబం మాదిరి పని చేశారన్నారు. తాము ఇంతకుముందు నిర్మించిన కొన్ని చిత్రాలు విమర్శలను ఎదుర్కొన్నా, కమర్షియల్‌గా హిట్ అయ్యాయన్నారు. అయితే ఆన్పావం పొల్లాదదు చిత్రం లాభాలు తెచ్చిపెట్టడంతోపాటు తమ గౌరవాన్ని పెంచిందన్నారు. రియోరాజ్ మాట్లాడుతూ ఇకపై కూడా మీకు నచ్చే కథా చిత్రాలనే చేస్తానని అన్నారు.


