breaking news
Malavika Manoj
-
ఫేక్ ఫెమినిజం, పెళ్లి జీవితంపై తీసిన కామెడీ సినిమా.. ఓటీటీ రివ్యూ
మీకు ఈ మధ్యే పెళ్లయిందా లేదంటే త్వరలో చేసుకోబోతున్నారా? అయితే ఈ సినిమా మీకోసమే. ఈ కాలంలో వైవాహిక బంధం నిలబడాలంటే ఏం కావాలి? అటు అబ్బాయిలు ఇటు అమ్మాయిలు ఈ విషయంలో ఎలాంటి పొరపాట్లు చేస్తున్నారు? ప్రస్తుత జనరేషన్లో విడాకులు కేసులు ఎందుకు ఎక్కువయ్యాయి తదితర అంశాలతో తీసిన తమిళ కామెడీ మూవీ 'ఆన్ పావమ్ పొల్లతత్తు'. గత నెలలో థియేటర్లలో రిలీజై హిట్ అయింది. ఇప్పుడు హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: అక్రమ సంబంధంపై డార్క్ కామెడీ సినిమా.. ఓటీటీ రివ్యూ)కథేంటి?శివ (రియో రాజ్) సాఫ్ట్వేర్ ఇంజినీర్. పెద్దలు నిశ్చయించడంతో శక్తి(మాళవిక మనోజ్)ని పెళ్లి చేసుకుంటాడు. నెల రోజులు బాగానే ఉంటారు. కానీ తర్వాతే అసలు సమస్యలు మొదలవుతాయి. ఏడాది తిరిగేసరికల్లా కనీసం తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. కోర్టుకి వెళ్తారు. పెళ్లయిన ఏడాదికే శివ-శక్తి.. ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అసలేం జరిగింది? చివరకు వీళ్లిద్దరూ కలిశారా లేదా అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?పెళ్లి జీవితం గురించి ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. వాటిలో ఇదొకటి. ప్రస్తుత జనరేషన్లో వివాహం చేసుకున్న జంటల జీవితం ఎలా ఉంటోంది? వాళ్ల జీవితంలో ఏమేం జరుగుతోంది? లాంటి విషయాలని చాలా రియలస్టిక్‌గా, హాస్యభరితంగా చూపించిన మూవీ ఇది.80, 90ల్లో అయినా ఇప్పటితరంలో అయినా పెళ్లి జీవితం నిలబడాలంటే ప్రేమ, ఒకరినొకరు అర్థం చేసుకోవడం లాంటి చిన్న విషయాలే కావాలి. ఈ పాయింట్‌నే కాస్త కామెడీగా, కాస్త ఎమోషనల్‌గా ఇందులో చూపించారు. ఇప్పటి జనరేషన్.. పెళ్లికి గౌరవం ఇచ్చి, ఎలా కలిసిమెలిసి ఉండాలో క్లైమాక్స్‌లో కోర్టులో వచ్చే సీన్‌తో అద్భుతంగా ప్రెజెంట్ చేశారు.వైవాహిక జీవితంలో ఎవరూ ఎక్కువ కాదు ఎవరూ తక్కువ కాదు. అటు భర్త అయినా ఇటు భార్య అయినా ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసుండాలి. అప్పుడే బంధం బలంగా నిలబడుతుంది. ఈ విషయాన్ని చూపించిన విధానం.. ఊహించే విధంగా ఉన్నప్పటికీ చాలామందికి కనెక్ట్ అవుతుంది. అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూని హైలెట్ చేస్తూ అమ్మాయిలని విలన్‌గా చూపించినట్టు కొన్ని సీన్స్ అనిపిస్తాయి. కానీ ఇద్దరిలోనూ తప్పులున్నాయని చూపించడం సహజంగా అనిపిస్తుంది.అసలైన ఫెమినిజంకి సూడో ఫెమినిజంకి తేడా కూడా కొట్టినట్లు చూపించారు. భార్య భర్తల మధ్య ఇగో (పంతం) అనేది ఎంత ప్రమాదమో? చుట్టుపక్కన ఉన్నోళ్లు.. ఈ గొడవల్లో ఎంతలా పెట్రోల్ పోస్తారనే సీన్స్ కూడా ఆసక్తికరంగా అనిపిస్తాయి. సోషల్ మీడియాలో ఫెమినిజం మైండ్ సెట్‌తో హడావుడి చేసే అమ్మాయి.. ఒకవేళ మన ఇంట్లో ఉంటే పరిస్థితి ఏంటి? పెళ్లికి ముందు చాలామంది కుర్రాళ్లు.. కాబోయే భార్యలకు చాలా ప్రామిస్‌లు చేసేస్తుంటారు కదా. వాటి వల్ల తర్వాత కాలంలో ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది కూడా కామెడీగా చూపించిన విధానం బాగుంది.'ఫెమినిస్ట్ అంటే.. భర్త, పిల్లలతో సంతోషంగా ఉండకూడదా ఏంటి?' అని ఈ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ఇది చాలామంది ఆడపిల్లలు, మహిళలని ఆలోచింపజేస్తుంది. 50-50 అని గొడవపడటం కాకుండా.. 70-30, 30-70 అని అర్థం చేసుకుంటూ తగ్గి నెగ్గి కలిసి జీవించాలి అనే చెప్పే క్లైమాక్స్ అయితే సూపర్ అనిపిస్తుంది.అన్ని ప్లస్సులేనా మైనస్సులు లేవా ఉంటే ఉన్నాయి. సినిమాలో స్టోరీ చాలావరకు ఊహించే విధంగా ఉంటుంది. కామెడీ బాగున్నా రెండు గంటల సినిమానే అయినా చాలాచోట్ల సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. తెలుగు డబ్బింగ్ బాగున్నా సరే పాటల్లో సాహిత్యం అస్సలు అతకలేదు. హీరోహీరోయిన్ రియో రాజ్, మాళవిక మాత్రం సహజంగా నటించారు. ఓవరాల్‌గా ఈ వీకెండ్ ఏదైనా మంచి కామెడీ సినిమా చూద్దామనుకుంటే దీన్ని ట్రై చేయండి. టైమ్ పాస్ అయిపోతుంది.- చందు డొంకాన(ఇదీ చదవండి: ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ మూవీ రివ్యూ) -
ఓటీటీలోకి తమిళ కామెడీ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఒకప్పటి జనరేషన్‌తో పోలిస్తే ఇప్పటి పెళ్లి జీవితం చాలామందికి గందరగోళంగానే ఉంటోంది. సర్దుకుపోవడం అనేది అస్సలు కనిపించట్లేదు. అటు అబ్బాయి గానీ ఇటు అమ్మాయి గానీ ఎవరికి వాళ్లే తగ్గేదే లే అన్నట్లు ఉంటున్నారు. దీంతో లేనిపోని సమస్యలు వస్తున్నాయి. సరిగ్గా ఇదే కాన్సెప్ట్‌తో తీసిన తమిళ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా.. ఓటీటీలో నేరుగా రిలీజ్)రెండేళ్ల క్రితం 'జో' అనే డబ్బింగ్ మూవీ ఓటీటీలో రిలీజైంది. రియో రాజ్ అనే నటుడు.. ఈ చిత్రంలో హీరోగా నటించాడు. ఇతడి లేటెస్ట్ మూవీ 'ఆన్ పావమ్ పొల్లతత్తు'. అక్టోబరు 31న థియేటర్లలో రిలీజైంది. పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి వసూళ్లు రాబట్టుకుంది. ఇప్పుడు నెలలోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ శుక్రవారం(నవంబరు 28) నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.ట్రైలర్ బట్టి చూస్తే ఇదో కామెడీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. శివ(రియో రాజ్), శక్తి (మాళవిక మనోజ్)ది పెద్దల కుదిర్చిన సంబంధం. పెళ్లయిన కొన్నిరోజులు బాగానే ఉంటుంది. కానీ తర్వాత నుంచి శక్తి.. చీటికిమాటికి అలగడం, ఇంట్లో పనులు చేయకపోవడం చేస్తుంది. దీంతో విడాకులు కోసం వీళ్లిద్దరూ కోర్టుని ఆశ్రయిస్తారు. తర్వాత ఏమైంది? చివరకు శివ-శక్తి పెళ్లి జీవితం గాడిన పడిందా? లేదా అనేది స్టోరీలా అనిపిస్తుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ చూపిస్తూనే ఎంటర్టైన్ చేసినట్లున్నారు. కుదిరితే ఓ లుక్కేయండి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బోల్డ్ రొమాంటిక్ తెలుగు సినిమా) -
లాభాలతో పాటు గౌరవాన్ని తెచ్చిపెట్టిన సినిమా
రియోరాజ్, మాళవిక మనోజ్ జంటగా నటించిన తమిళ చిత్రం ఆన్‌పావం పొల్లాదదు (Aan Paavam Pollathathu Movie). ఆర్జే విగ్నేష్కాంత్, షీలా, జెన్సన్ దివాకర్ ముఖ్యపాత్రులు పోషించిన ఈ చిత్రం ద్వారా కలైయరసన్ తంగవేల్ దర్శకుడుగా పరిచయమయ్యారు. డ్రమస్టిక్ ప్రొడక్షన్స్ పతాకంపై వెడిక్కారన్‌పట్టి ఎస్ శక్తివేల్ నిర్మించిన ఈ చిత్రానికి టీకేటీ నందకుమార్, ఎంఎస్కే ఆనంద్ సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ విడుదల చేసింది. బ్లాక్‌షిప్ ఫైండింగ్స్ సంస్థ సహకారంతో రెండు వారాల క్రితం విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో థాంక్స్ గివింగ్ సమావేశాన్ని నిర్వహించారు. ఆర్జే విఘ్నేశ్‌కాంత్ మాట్లాడుతూ.. నిన్నటి జ్ఞాపకాలను మధురంగానూ, నేటి జ్ఞాపకాలను అనుభవాలుగానూ, రేపటి కలలను నిజం చేసేలా తాము నాటిన ఈ విత్తనానికి ఆదరణ తెలిపిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. దర్శకుడు కలైయరసన్ తంగవేల్ మాట్లాడుతూ.. ఈ విజయాన్ని కథా రచయిత శివకుమార్ మురుగేశన్‌తో కలిసి పంచుకుంటున్నానని అన్నారు. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ అందరూ ఒక కుటుంబం మాదిరి పని చేశారన్నారు. తాము ఇంతకుముందు నిర్మించిన కొన్ని చిత్రాలు విమర్శలను ఎదుర్కొన్నా, కమర్షియల్‌గా హిట్ అయ్యాయన్నారు. అయితే ఆన్‌పావం పొల్లాదదు చిత్రం లాభాలు తెచ్చిపెట్టడంతోపాటు తమ గౌరవాన్ని పెంచిందన్నారు. రియోరాజ్ మాట్లాడుతూ ఇకపై కూడా మీకు నచ్చే కథా చిత్రాలనే చేస్తానని అన్నారు. -
అమ్మ పంపిన ఆ ఒక్క ఫోటోతో హీరోయిన్ అయిపోయా : మాళవికా మనోజ్
అమ్మ పంపిన ఒక్క ఫొటోతోనే స్కూల్ గర్ల్ నుంచి సడెన్‌గా సిల్వర్‌స్క్రీన్‌పై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత సోషల్ మీడియాలో జోష్ పెంచి, అభిమానుల గుండెల్లో క్వీన్ గా సింహాసనం దక్కించుకుంది. ఆమె మలయాళీ క్యూటీ మాళవికా మనోజ్. ఆమె చెప్పిన విశేషాలు...→ నా మొదటి సినిమా ‘ప్రకాశన్ పరక్కట్టే’ నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. పదో తరగతి చదువుతున్నప్పుడు అమ్మ నా ఫోటో పంపింది. నేను సెలెక్ట్ అయ్యే వరకు ఆ విషయం నాకు తెలియలేదు.→ సినిమాలు అసలు నా ప్లాన్స్లోనే లేవు. ప్యూర్ యాక్సిడెంట్! చిన్నప్పుడు ఫొటోలు తీయించుకోవటం అంటే చాలా ఇష్టం. మోడల్ అవుదామనే ఆలోచన లేదు కాని, నా ఫొటోలు చూస్తే నాకే నచ్చేది. నేను సిగ్గరిని కూడా. స్కూల్ డ్రామాల్లో ఒక్కసారి కూడా స్టేజ్ మీదకెళ్లలేదు.→ ప్రకాశన్ పరక్కట్టే టీమ్‌ను కలిసిన తర్వాతే నాలో స్పార్క్ వచ్చింది. సినిమా పూర్తయ్యాక ఫీల్ బాగుంది. అప్పటినుంచే ఈ జర్నీ కంటిన్యూ చేయాలని డిసైడ్ అయ్యాను.→ ‘జో’ నా కెరీర్లో మైలురాయి. థియేటర్స్ కంటే ఓటీటీలో, రీల్స్‌లో చూసి చాలామంది నన్ను ఇష్టపడ్డారు. ఇప్పటికీ చాలామంది, నేను మలయాళీ కాదని, తమిళ అమ్మాయిగానే గుర్తిస్తుంటారు. ఇది ఫన్నీ అయినా, నాకు గర్వకారణం.→ తెలుగు తెరపై అడుగుపెట్టడం సవాలు. భాషా అడ్డంకి పెద్దది. కాని, ‘ఓ భామ అయ్యో రామా!’ టీమ్, నన్ను ప్రేమతో ముందుకు నెట్టి, ఎంతో ప్రోత్సహించింది.→ ప్రతి ఒక్కరిలాగే, ‘మా నాన్నే నా మొదటి హీరో’. ఆ తర్వాత మహేష్ బాబు, అల్లు అర్జున్ నా ఫేవరెట్ హీరోస్.→ అమ్మ డ్యాన్సర్ కాబట్టి, చిన్నప్పటి నుంచే నాట్యంలోనూ శిక్షణ తీసుకున్నాను.→ సోషల్ మీడియా, నా కెరీర్‌కు కొత్త రెక్కలు ఇచ్చింది. ఒక చిన్న రీల్ కూడా సినిమాకు క్రేజ్ తెస్తుంది. అందుకే, అభిమానులతో కనెక్ట్ అవ్వడానికి, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాను.→ ప్రస్తుతం మూడు భాషల్లో సినిమాల్లో బిజీగా ఉన్నాను. కొత్త కథలు, కొత్త ప్రతిభలతో ఎదగాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాను.→ డెసర్ట్స్, స్వీట్స్ అంటే పిచ్చి ఇష్టం. అందులోనూ చాక్లెట్ పేస్ట్రీకి నేను ఎప్పుడూ ‘నో’ చెప్పలేను. అది నా బలహీనత.→ పెసర పిండి, పెరుగు, కస్తూరి పసుపు కలిపిన ఫేస్ మాస్క్ నా చర్మ సౌందర్య రహస్యాల్లో మొదటిది. ఆ తర్వాత గోరువెచ్చని కొబ్బరి నూనె మసాజ్. ఎక్కువగా సహజసిద్ధమైన ఉత్పత్తులతోనే సౌందర్యాన్ని కాపాడుకుంటాను.→ ఫ్యాషన్ డిజైనింగ్‌లో నాకు ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. అందుకే సినిమాల్లోనూ ఎక్కువగా నా కాస్ట్యూమ్స్‌ని నేనే డిజైన్ చేస్తాను.→ ఒక బటన్ నొక్కితే ఎక్కడికైనా తక్షణమే వెళ్లగల పవర్ కావాలన్నది నా కల. ఎందుకంటే, నేనొక పెద్ద ట్రావెల్ లవర్. కాస్త సమయం దొరికినా బ్యాగ్ సర్దేసుకుంటాను. -
‘ఓ భామ అయ్యో రామా’ మూవీ రివ్యూ
టైటిల్: ఓ భామ అయ్యో రామనటీనటులు: సుహాస్, మాళవిక మనోజ్, అనిత హంసానందిని, ఆలీ, రవీందర్ విజయ్, బబ్లు పృథ్వీరాజ్, ప్రభాస్ శ్రీను, రఘు కరుమంచి తదితరులునిర్మాణ సంస్థ: వీ ఆర్ట్స్నిర్మాతలు : హరీష్ నల్లరచన, దర్శకత్వం: రామ్ గోదలసంగీతం: రథన్సినిమాటోగ్రఫీ : ఎస్ మణికందన్ఎడిటర్: భవిన్ ఎం షావిడుదల తేది: జులై 11, 2025యంగ్ హీరో సుహాస్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఒకవైపు కాన్సెప్ట్ కథలతో అలరిస్తూనే మరోవైపు కామెడీ చిత్రాలతోనూ నవ్విస్తున్నాడు. ఈ టాలెంటెడ్ హీరో నటించిన తాజా చిత్రం 'ఓ భామ అయ్యో రామ'. మలయాళంలో జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ ఈ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్ బ్యానర్‌పై హరీష్ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో 'ఓ భామ అయ్యో రామ'పై హైప్ క్రియేట్ అయింది. ఓ మోస్తరు అంచనాలతో నేడు(జులై 11) ప్రేక్షకుల ముందకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..రామ్ (సుహాస్) చిన్నప్పుడే తల్లి(అనిత హంసానందిని)చనిపోతుంది. మేనమామ(అలీ)నే అన్ని తానై పెంచుతాడు. పెద్ద చదువుల కోసం పారెన్ వెళ్లాలనేది తన లక్ష్యం. స్నేహితులంతా సినిమాకు వెళ్తే..మనోడు మాత్రం థియేటర్ బయట నుంచే విని.. సినిమా హిట్టో ఫట్టో చెప్పేస్తాడు. మామ, స్నేహితులే ప్రపంచంగా బతుకుతున్న రామ్ జీవితంలోకి అనుకోకుండా సత్యభామ(మాళవిక మనోజ్) వచ్చేస్తుంది. బడా వ్యాపారవేత్త(పృథ్వీరాజ్) ఏకైక కూతురే ఈ సత్యభామ. ఆమెకు ఎవరైనా నచ్చితే.. వారికోసం ఏదైనా చేసేస్తుంది. రామ్‌ని ఇష్టపడమే కాకుండా అతన్ని సినిమా డైరెక్టర్ని చేయాలని ఫిక్సవుతుంది. అతనికి ఇష్టం లేకపోయినా.. స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరిపిస్తుంది. కొన్నాళ్ల తర్వాత మూడేళ్ల వరకు మనం కలువొద్దని కండీషన్ పెట్టి.. అతనికి దూరంగా వెళ్లిపోతుంది. ఆ మూడేళ్లలో రామ్ జీవితం ఎలా మారింది? సత్యభామ.. రామ్‌కి దూరంగా ఎందుకు వెళ్లింది? రామ్ తండ్రి ఎవరు? సినిమాలు అంటేనే నచ్చని రామ్‌ని దర్శకుడిగా చేయాలని సత్యభామ ఎందుకు ప్రయత్నించింది. రామ్ దర్శకుడుగా సక్సెస్ అయ్యాడా లేదా? చివరకు రామ్, సత్యభామ కలిశారా లేదా అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే.. ‘తెలుగు సినిమా అంటే లవ్, ఎమోషన్, డ్రామా.. ఇవన్నీ ఉండాలి’ అని ఓ సీన్లో హీరో సుహాస్ అంటాడు. ఆ డైలాగ్‌కు తగ్గట్టే ఓ భామ అయ్యో రామ సినిమా కథ ఉంది. అయితే వాటిని సరిగా వాడుకోవడంలోనే దర్శకుడు కాస్త తడబడ్డాడు. ఓ యూత్‌ఫుల్ లవ్‌స్టోరీకి మదర్ సెంటిమెంట్‌ని యాడ్ చేసి ఫన్వేలో కథనాన్ని నడించారు. కథగా చూస్తే ఇందులో కొత్తదనం ఏమి ఉండదు. లవ్‌స్టోరీ రొటీన్‌గానే ఉన్నా.. ఎంటర్టైనింగ్గా సాగుతుంది. ఇక ప్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు మాత్రం హృదయాలను హత్తుకుంటాయి. హీరో తల్లి చనిపోయే ఎమోషనల్ సీన్‌తో కథని ప్రారంభం అవుతుంది. హీరోహీరోయిన్ల పరిచయ సన్నివేశం కాస్త కొత్తగా ఉంటుంది. హీరోహీరోయిన్లు కలిసిన తర్వాత కథనం ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. హీరో ఎక్కడ ఉంటే అక్కడికి హీరోయిన్ వెల్లడం.. బయటకు తీసుకెళ్లి.. కథ చెబుతూ విసిగించడం మొదట్లో బాగున్నా.. ప్రతిసారి అలాంటి సీన్లే రిపీట్ కావడం కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ బాగా ప్లాన్ చేశారు. సెకండాఫ్‌లో వచ్చే హీరో మదర్ ఎపిసోడ్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. అలాగే ఫ్రెండ్ పెళ్లి ఎపిసోడ్ కామెడీగా ప్లాన్ చేసినా..అది వర్కౌట్ కాలేదు. ఫస్టాఫ్‌లో హీరోయిన్ చేసే అల్లరి పనులన్నింటికి.. సెకండాఫ్‌లో మంచి జస్టిఫికేషన్ ఉంటుంది. ఇక క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఎలాంటి వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఈ సినిమాను తీర్చిదిద్దారు. అయితే కథను మరింత బలంగా రాసుకొని.. ఫస్టాఫ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకొని ఉంటే.. సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. రామ్ పాత్రలో సుహాస్ ఒదిగిపోయాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లలో చక్కగా నటించాడు. ఇక హీరోయిన్ మాళవిక మనోజ్‌కి ఇది తొలి తెలుగు సినిమా. సత్యభామగా తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆమె పాత్రని తీర్చిదిద్దిన విధానం బాగుంది. కథనం మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. అనిత హంసానందిని చాలా ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించింది. హీరో తల్లిగా పాత్రలో నటించి అందర్ని సర్ప్రైజ్ చేసింది. మదర్ సెంటిమెంట్ సీన్ల ఈ సినిమాకు హైలెట్. ఆలీ, రవీందర్ విజయ్, బబ్లు పృథ్వీరాజ్, ప్రభాస్ శ్రీను, రఘు కరుమంచితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. మణికందన్ సినిమాటోగ్రఫీ సినిమాకి మరో ప్రధాన బలం. ప్రతీ సీన్ తెరపై చాలా రిచ్‌గా చూపించాడు. రథన్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు. బ్రహ్మకడలి ఆర్ట్‌వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. బడ్జెట్ విషయంలో ఎక్కడ తగ్గలేదని సినిమా చూస్తే అర్థం అవుతుంది. హీరో మార్కెట్, కథని మించి ఖర్చు చేశారు. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
టెన్త్ క్లాస్‌కే హీరోయిన్.. స్విమ్మింగ్ రాకపోయినా దూకేసింది (ఫోటోలు)
-
చిత్ర పరిశ్రమలో ఎవరైనా కష్టపడాల్సిందే – మంచు మనోజ్
‘‘ఎటువంటి నేపథ్యం లేకుండా హీరోగా ఎదిగాడు సుహాస్. నెపో కిడ్స్ (బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారు) అయినా సినిమా పరిశ్రమలో కష్టపడాల్సిందే. కష్టపడితేనే విజయం. ఈ విషయాన్ని ఓ నెపో కిడ్‌గా చెబుతున్నాను. తమిళంలో విజయ్ సేతుపతిగారిలా తెలుగులో సుహాస్ అలాంటి స్టారే. ‘ఓ భామ అయ్యో రామ’ మంచి విజయం సాధించాలి’’ అని మంచు మనోజ్ తెలిపారు. సుహాస్, మాళవికా మనోజ్ జంటగా రామ్ గోధల దర్శకత్వం వహించిన చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. హరీష్ నల్ల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకి మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుహాస్ మాట్లాడుతూ– ‘‘ప్రతి అబ్బాయి సక్సెస్ఫుల్ లైఫ్‌లో తల్లి, భార్య... ఇద్దరూ ఎంతో కీలకంగా ఉంటారు. మా సినిమాలో ఆ పాత్రలకు సంబంధించిన భావోద్వేగాలు అందరి హృదయాలను హత్తుకుంటాయి’’ అన్నారు. ‘‘రామ్ కొత్త దర్శకుడిలా కాకుండా ఎంతో అనుభవం ఉన్నవాడిలా తీశారు. సుహాస్ నటన మరో రేంజ్లో ఉంటుంది’’ అని హరీష్ నల్లా తెలిపారు. ‘‘మా చిత్రంలో సుహాస్ ఆల్‌రౌండర్ ప్రతిభ చూపారు’’ అన్నారు రామ్ గోధల. -
'ఓ భామ అయ్యో రామ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
కథ నచ్చితే అలాంటి పాత్ర కూడా చేస్తా : మాళవికా మనోజ్
‘‘గతంలో నేను నటించిన సినిమాల్లో సాధారణంగా ఉండే పల్లెటూరి అమ్మాయి పాత్రలు చేశాను. అయితే ‘ఓ భామ అయ్యో రామ’ చిత్రంలో ఎంతో మోడ్రన్ గా, హైపర్‌గా, ఆటిట్యూడ్‌తో ఉండే సత్యభామ పాత్రలో నటించా.. ఇలాంటి పాత్ర చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అని మాళవికా మనోజ్(Malavika Manoj) తెలిపారు. సుహాస్, మాళవికా మనోజ్ జంటగా రామ్ గోధల దర్శకత్వం వహించిన చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’(Oh Bhama Ayyo Rama). హరీష్ నల్ల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మాళవికా మనోజ్ మాట్లాడుతూ–‘‘నేను తమిళంలో నటించిన ‘జో’లో నా నటన నచ్చడంతో ‘ఓ భామ అయ్యో రామ’కి ఎంపిక చేశారు రామ్ గోధల. నాకు తెలుగు రాకపోయినా.. భావం అర్థం చేసుకుని సత్యభామ పాత్ర చేశాను. సుహాస్ సినిమా కోసం చాలా కష్టపడతాడు. హరీష్‌గారు ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు పెట్టారు. రధన్‌గారు మంచి పాటలిచ్చారు. భాషతో సంబంధం లేకుండా ఈ పాటలు అందరికి నచ్చాయి. ఈ సినిమాలో హరీష్ శంకర్, మారుతిగార్లతో నటించడం సంతోషంగా ఉంది. నాకు చాలా అవకాశాలు వస్తున్నాయి. కానీ, నచ్చిన కథలు మాత్రమే చేస్తున్నాను. గ్లామరస్ రోల్స్ చేయాలా? వద్దా? అనే నిబంధన నాకు లేదు. కథ నచ్చితే చేస్తాను’’ అన్నారు.


