ఒకప్పటి జనరేషన్‌తో పోలిస్తే ఇప్పటి పెళ్లి జీవితం చాలామందికి గందరగోళంగానే ఉంటోంది. సర్దుకుపోవడం అనేది అస్సలు కనిపించట్లేదు. అటు అబ్బాయి గానీ ఇటు అమ్మాయి గానీ ఎవరికి వాళ్లే తగ్గేదే లే అన్నట్లు ఉంటున్నారు. దీంతో లేనిపోని సమస్యలు వస్తున్నాయి. సరిగ్గా ఇదే కాన్సెప్ట్‌తో తీసిన తమిళ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు.
(ఇదీ చదవండి: తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా.. ఓటీటీలో నేరుగా రిలీజ్)
రెండేళ్ల క్రితం 'జో' అనే డబ్బింగ్ మూవీ ఓటీటీలో రిలీజైంది. రియో రాజ్ అనే నటుడు.. ఈ చిత్రంలో హీరోగా నటించాడు. ఇతడి లేటెస్ట్ మూవీ 'ఆన్ పావమ్ పొల్లతత్తు'. అక్టోబరు 31న థియేటర్లలో రిలీజైంది. పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి వసూళ్లు రాబట్టుకుంది. ఇప్పుడు నెలలోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ శుక్రవారం(నవంబరు 28) నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.
ట్రైలర్ బట్టి చూస్తే ఇదో కామెడీ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది. శివ(రియో రాజ్), శక్తి (మాళవిక మనోజ్)ది పెద్దల కుదిర్చిన సంబంధం. పెళ్లయిన కొన్నిరోజులు బాగానే ఉంటుంది. కానీ తర్వాత నుంచి శక్తి.. చీటికిమాటికి అలగడం, ఇంట్లో పనులు చేయకపోవడం చేస్తుంది. దీంతో విడాకులు కోసం వీళ్లిద్దరూ కోర్టుని ఆశ్రయిస్తారు. తర్వాత ఏమైంది? చివరకు శివ-శక్తి పెళ్లి జీవితం గాడిన పడిందా? లేదా అనేది స్టోరీలా అనిపిస్తుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ చూపిస్తూనే ఎంటర్‌టైన్ చేసినట్లున్నారు. కుదిరితే ఓ లుక్కేయండి.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి బోల్డ్ రొమాంటిక్ తెలుగు సినిమా)


