
అమ్మ పంపిన ఒక్క ఫొటోతోనే స్కూల్ గర్ల్ నుంచి సడెన్‌గా సిల్వర్‌స్క్రీన్‌పై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత సోషల్ మీడియాలో జోష్ పెంచి, అభిమానుల గుండెల్లో క్వీన్ గా సింహాసనం దక్కించుకుంది. ఆమె మలయాళీ క్యూటీ మాళవికా మనోజ్. ఆమె చెప్పిన విశేషాలు...
→ నా మొదటి సినిమా ‘ప్రకాశన్ పరక్కట్టే’ నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. పదో తరగతి చదువుతున్నప్పుడు అమ్మ నా ఫోటో పంపింది. నేను సెలెక్ట్ అయ్యే వరకు ఆ విషయం నాకు తెలియలేదు.
→ సినిమాలు అసలు నా ప్లాన్స్‌లోనే లేవు. ప్యూర్ యాక్సిడెంట్! చిన్నప్పుడు ఫొటోలు తీయించుకోవటం అంటే చాలా ఇష్టం. మోడల్ అవుదామనే ఆలోచన లేదు కాని, నా ఫొటోలు చూస్తే నాకే నచ్చేది. నేను సిగ్గరిని కూడా. స్కూల్ డ్రామాల్లో ఒక్కసారి కూడా స్టేజ్ మీదకెళ్లలేదు.
→ ప్రకాశన్ పరక్కట్టే టీమ్‌ను కలిసిన తర్వాతే నాలో స్పార్క్ వచ్చింది. సినిమా పూర్తయ్యాక ఫీల్ బాగుంది. అప్పటినుంచే ఈ జర్నీ కంటిన్యూ చేయాలని డిసైడ్ అయ్యాను.
→ ‘జో’ నా కెరీర్‌లో మైలురాయి. థియేటర్స్ కంటే ఓటీటీలో, రీల్స్‌లో చూసి చాలామంది నన్ను ఇష్టపడ్డారు. ఇప్పటికీ చాలామంది, నేను మలయాళీ కాదని, తమిళ అమ్మాయిగానే గుర్తిస్తుంటారు. ఇది ఫన్నీ అయినా, నాకు గర్వకారణం.
→ తెలుగు తెరపై అడుగుపెట్టడం సవాలు. భాషా అడ్డంకి పెద్దది. కాని, ‘ఓ భామ అయ్యో రామా!’ టీమ్, నన్ను ప్రేమతో ముందుకు నెట్టి, ఎంతో ప్రోత్సహించింది.
→ ప్రతి ఒక్కరిలాగే, ‘మా నాన్నే నా మొదటి హీరో’. ఆ తర్వాత మహేష్ బాబు, అల్లు అర్జున్ నా ఫేవరెట్ హీరోస్.
→ అమ్మ డ్యాన్సర్ కాబట్టి, చిన్నప్పటి నుంచే నాట్యంలోనూ శిక్షణ తీసుకున్నాను.
→ సోషల్ మీడియా, నా కెరీర్‌కు కొత్త రెక్కలు ఇచ్చింది. ఒక చిన్న రీల్ కూడా సినిమాకు క్రేజ్ తెస్తుంది. అందుకే, అభిమానులతో కనెక్ట్ అవ్వడానికి, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాను.
→ ప్రస్తుతం మూడు భాషల్లో సినిమాల్లో బిజీగా ఉన్నాను. కొత్త కథలు, కొత్త ప్రతిభలతో ఎదగాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాను.
→ డెసర్ట్స్, స్వీట్స్ అంటే పిచ్చి ఇష్టం. అందులోనూ చాక్లెట్ పేస్ట్రీకి నేను ఎప్పుడూ ‘నో’ చెప్పలేను. అది నా బలహీనత.
→ పెసర పిండి, పెరుగు, కస్తూరి పసుపు కలిపిన ఫేస్ మాస్క్ నా చర్మ సౌందర్య రహస్యాల్లో మొదటిది. ఆ తర్వాత గోరువెచ్చని కొబ్బరి నూనె మసాజ్. ఎక్కువగా సహజసిద్ధమైన ఉత్పత్తులతోనే సౌందర్యాన్ని కాపాడుకుంటాను.
→ ఫ్యాషన్ డిజైనింగ్‌లో నాకు ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. అందుకే సినిమాల్లోనూ ఎక్కువగా నా కాస్ట్యూమ్స్‌ని నేనే డిజైన్ చేస్తాను.
→ ఒక బటన్ నొక్కితే ఎక్కడికైనా తక్షణమే వెళ్లగల పవర్ కావాలన్నది నా కల. ఎందుకంటే, నేనొక పెద్ద ట్రావెల్ లవర్. కాస్త సమయం దొరికినా బ్యాగ్ సర్దేసుకుంటాను.