పదిహేనేళ్లుగా స్టార్ హీరోయిన్ స్టేటస్ కోసం కష్టపడుతోంది గ్లామర్ బ్యూటీ వాణి భోజన్. 2010లో వచ్చిన తమిళ చిత్రం ఒర్ ఎరవుతో వెండితెరకు పరిచయమైంది. తర్వాత తననెవరూ గుర్తించకపోయేసరికి బుల్లితెరకు షిఫ్ట్ అయింది. ఆహా, మాయ సీరియల్స్ చేసింది. 2013-2018 వరకు ప్రసారమైన దైవమగళ్ సీరియల్‌తో ఆమె కెరీర్ టర్న్ అయిపోయింది. ఇందులో వాణి అందం, నటన చూసి సినిమా అవకాశాలు రావడం మొదలైంది. అలా 2019లో తెలుగులో ఏకైక మూవీ 'మీకు మాత్రమే చెప్తా'లో హీరోయిన్గా చేసింది.
సీన్స్ కట్
ఆ మరుసటి ఏడాది తమిళంలో చేసిన ఓ మై కడవులే పెద్ద విజయం సాధించింది. దీంతో తమిళంలో వరుస సినిమాలు చేసుకుంటూ పోయింది. మహాన్‌లో కీలక పాత్రలో నటించినప్పటికీ చివర్లో ఆమె నటించిన సీన్స్ అన్నీ ఎత్తేశారు. సినిమాలు చేస్తుందే కానీ అనుకున్నంత గుర్తింపయితే రాలేదు. ఆ మధ్యలో తమిళ్ రాకర్స్, సెంగళం, చట్నీ సాంబార్ అని వెబ్ సిరీస్‌లలోనూ యాక్ట్ చేసింది.
వివాదం
వాణి భోజన్.. నటుడు జైతో సహజీవనం చేస్తోందని గతంలో పుకార్లు వచ్చాయి. ఇదంతా తప్పుడు ప్రచారమని వాణి ఖండించింది. కష్టపడి బ్యాంకు లోను తీసుకుని ఇల్లు కట్టుకుంటే సొంత ఇంట్లో కాకుండా ఎవరో ఒకరి ఇంట్లో అతడితో కలిసున్నానని రాయడం చాలా చీప్ అని ఆవేదన వ్యక్తం చేసింది.
కోరిక
సెంగళం అనే వెబ్ సిరీస్‌లో రాజకీయ నాయకురాలి పాత్ర పోషించిన ఈ బ్యూటీకి రాజకీయాలపై ఆసక్తి ఉంది. భవిష్యత్తులో పాలిటిక్స్‌లో అడుగుపెడతానని ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. అలాగే గంగూభాయ్ కథియావాడి వంటి ఉమెన్ సెంట్రిక్ సినిమాలు చేయాలని ఆశపడుతోంది. మరి వాణి భోజన్ (Vani Bhojan)కు అలాంటి ఆఫర్స్ ఎప్పుడొస్తాయో, తెలుగులో మళ్లీ ఎప్పుడు కనిపిస్తుందో చూడాలి!


