
‘‘ఎటువంటి నేపథ్యం లేకుండా హీరోగా ఎదిగాడు సుహాస్. నెపో కిడ్స్ (బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారు) అయినా సినిమా పరిశ్రమలో కష్టపడాల్సిందే. కష్టపడితేనే విజయం. ఈ విషయాన్ని ఓ నెపో కిడ్‌గా చెబుతున్నాను. తమిళంలో విజయ్ సేతుపతిగారిలా తెలుగులో సుహాస్ అలాంటి స్టారే. ‘ఓ భామ అయ్యో రామ’ మంచి విజయం సాధించాలి’’ అని మంచు మనోజ్ తెలిపారు.
సుహాస్, మాళవికా మనోజ్ జంటగా రామ్ గోధల దర్శకత్వం వహించిన చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. హరీష్ నల్ల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకి మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుహాస్ మాట్లాడుతూ– ‘‘ప్రతి అబ్బాయి సక్సెస్‌ఫుల్ లైఫ్‌లో తల్లి, భార్య... ఇద్దరూ ఎంతో కీలకంగా ఉంటారు. మా సినిమాలో ఆ పాత్రలకు సంబంధించిన భావోద్వేగాలు అందరి హృదయాలను హత్తుకుంటాయి’’ అన్నారు. ‘‘రామ్ కొత్త దర్శకుడిలా కాకుండా ఎంతో అనుభవం ఉన్నవాడిలా తీశారు. సుహాస్ నటన మరో రేంజ్‌లో ఉంటుంది’’ అని హరీష్ నల్లా తెలిపారు. ‘‘మా చిత్రంలో సుహాస్ ఆల్‌రౌండర్ ప్రతిభ చూపారు’’ అన్నారు రామ్ గోధల.