రవితేజ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ ఇరుముడి. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా రాణిస్తోంది. కేవలం రిలీజైన మూడు రోజుల్లోనే రూ.80 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. దీంతో మూవీ టీమ్ సక్సెస్ సలబ్రేషన్స్ చేసుకుంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు ఇరుముడి టీమ్ అంతా హాజరైంది.
ఈ మూవీలో జబర్దస్త్ కమెడియన్ కొమురం కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంలో నాగులు అనే పాత్రలో కనిపించారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన కొమురం ఎమోషనల్ అయ్యారు. గత 12 ఏళ్లుగా కొమురక్కగా బతుకుతున్న నాగులుగా మార్చిన ఘనత శివ నిర్వాణకే దక్కుతుందన్నారు. ఈ అవకాశమిచ్చిన ఆయనకు తన జీవితాంతం రుణపడి ఉంటానని భావోద్వేగానికి గురయ్యారు. కొమురం మాటలు విన్న డైరెక్టర్ శివ నిర్వాణ సైతం ఎమోషనల్ అయ్యారు.
ఈవెంట్‌లో కొమురం మాట్లాడుతూ..'నన్ను చాలా మంది అవమానపరిచారు. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో నాతో కలిసి ఓకే రూమ్‌లో ఉన్న 15 మంది డైరెక్టర్స్ అయ్యారు. నేను ఎలా నటిస్తానో కూడా వాళ్లకు తెలుసు. కానీ వాళ్లు నాలో నటుడిని మాత్రం గుర్తించలేకపోయారు. శివ నిర్వాణ అన్న ఈ పాత్ర ఎందుకిచ్చారో నాకు తెలియదు. మూడు రోజుల నుంచి నా ఫోన్ మోగుతూనే ఉంది. ఈ రోజు మీ వల్లే కొమురక్క నుంచి నేను నాగులుని అయిపోయా. నేను చచ్చే వరకూ శివ నిర్వాణ అన్నను మర్చిపోతే నేను మనిషినే కాదు' అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
ఇంకా మాట్లాడుతూ..' మొదటి రోజు షూటింగ్‌కు వెళ్లినప్పుడు నాది గే పాత్ర అనుకున్నా. కానీ, రవితేజగారిని కొట్టే ఫైట్ అని తెలిశాక చెమటలు పట్టాయి. ఈ మూవీలో ఆ సీన్ చూసి ఏడు ప్రొడక్షన్ హౌస్‌ల నుంచి ఫోన్ చేశారు. మన ఇండస్ట్రీలో వందమంది హీరోలు ఉంటే.. 100 రకాల ఫ్యాన్స్ ఉంటారు. ఆ 100 రకాల ఫ్యాన్స్ ఇష్టపడే ఏకైక హీరో మన రవితేజనే. నా జీవితంలో బతుకు భరోసా ఇచ్చిన పాత్రే ఈ నాగులు. 12 ఏళ్లుగా కొమురక్క గెటప్‌లో బతుకుతున్నా. ఆ గెటప్ నిజంగా లెజెండ్.. కానీ అది నేను కాదు. అదొక గెటప్ మాత్రమే' అని అన్నారు.
👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


