విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన తాజా చిత్రం 'రణబాలి'. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా వసూళ్లు ఫర్వాలేదనిపించింది. కాగా, ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది.
విడుదల తేదీపై సందేహాలు
'రణబాలి' నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకులను అలరించనుంది. ఈ నెల 13 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ ఇటీవలే అధికారికంగా ప్రకటించినప్పటికీ.. ఆ తర్వాత ఆ పోస్టును తొలగించింది. దీంతో సినిమా ఓటీటీ విడుదల తేదీపై సందేహాలు నెలకొన్నాయి. నెట్‌ఫ్లిక్స్ ప్రకటించిన తేదీనే సినిమా స్ట్రీమింగ్ అవుతుందా? లేక విడుదల తేదీలో మార్పులు ఉంటాయా? అన్నది ఆసక్తికరంగా మారింది. దీనిపై ఓటీటీ సంస్థ నుంచి మరో సారి స్పష్టత రావాల్సి ఉంది.
కథేంటంటే..
1876–78 మధ్యకాలంలో మద్రాసు ప్రెసిడెన్సీలో వచ్చిన భయంకరమైన కరువు నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. మద్రాసుకు కొత్తగా వచ్చిన కమిషనర్(ఆర్నాల్డ్ వోస్లూ)..అధికారులకు కొత్త కండీషన్ పెడతారు. ఇక్కడ పండించిన ప్రతి గింజా బ్రిటన్‌కు వెళ్లాల్సిందేనని ఆదేశిస్తాడు. ఎదురు తిరిగిన వాళ్లను దారుణంగా చంపేస్తాడు. ధాన్యాన్ని దేశం దాటించడానికి రైల్వే పనులు ప్రారంభిస్తాడు. కరువు సృష్టించి.. అక్కడ ప్రజలను పనికి వచ్చేలా చేస్తాడు. ఈ విషయం రాయలసీమ ప్రాంతానికి చెందిన పాలెగాడు సింగనమల బొబ్బిలి రణబాలి (విజయ్ దేవరకొండ) దృష్టికి వెళ్తుంది. భద్రమల్లన్న స్వామి ఆయుష్షుతో పెరిగిన రణబాలి.. బ్రిటీష్ పాలకులకు ఎలా ఎదురుదిరిగాడు? తినడానికి తిండిలేక అతి భయంకరమైన కరువుతో బాధపడుతున్న ప్రజలకు ఎలా అండగా నిలిచాడు? కరువుకు కారణమైన మద్రాసు కమిషనర్‌ని ఎలా అంతం చేశాడు? ఈ కథలో జయమ్మ(రష్మిక) పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
(ఇదీ చదవండి: రిలీజ్‌కి ముందే జాగ్రత్తపడ్డ 'రామాయణ' మేకర్స్)


