విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా వస్తోన్న పీరియాడికల్ మూవీ రణబాలి. ఈ చిత్రాన్ని బ్రిటీష్ కాలం నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా దసరా కానుకగా థియేటర్లలో అక్టోబర్ 16న సందడి చేయనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్‌కు హాజరైన డైరెక్టర్ రాహుల్ రణబాలి కథను ఉద్దేశించి మాట్లాడారు.
డైరెక్టర్ రాహుల్ మాట్లాడుతూ..' శ్యామ్ సింగరాయ్ తర్వాత నెక్ట్స్ సినిమా కోసం ఆలోచించే టైమ్‌లో ఓ బుర్రకథ నా ముందుకు వచ్చింది. అది విని నేను షాకయ్యా. ఒక వీరుడి కథ విన్నా. అతనితో దేవుళ్లు మాట్లాడతారు. అప్పుడే ఇలాంటి సినిమా చేయాలని డిసైడ్ అయ్యా. రాయలసీమ చరిత్ర చదివా. కరువు కేవలం రాయలసీమకే కాదు..అన్ని ప్రాంతాల్లో వచ్చింది. ది గ్రేట్ సౌత్ ఇండియన్ మద్రాస్.. కేవలం రెండేళ్లలో కోటిమంది చనిపోయారని వార్త విన్నా. దీనిపై బుక్స్ కూడా చదివా.. ఇది నిజమని తెలిశాకే డిసైడ్ అయ్యా. ఫస్ట్ ఈ కథ రవికి చెప్పగానే ఓకే చేశారు.' అని అన్నారు.
ఈ కథకు ఒక బిగ్ కటౌట్ కావాలనుకున్నానని రాహుల్ తెలిపారు. ఈ పాత్రకు విజయ్ కరెక్ట్ అని నాకు అనిపించిందన్నారు. ఈ జర్నీకి దాదాపు నాలుగు ఏళ్లు పట్టిందన్నారు. కోటిమంది ప్రాణాలు తీసిన ఈ కథ విన్నప్పుడు నాకు కోపం వచ్చిందన్నారు. ఆ కోపం, ఆవేశం నుంచి పుట్టిందే రణబాలి కథ అన్నారు. ఆ పిచ్చి పట్టిన పిశాచులకు దెయ్యం విడిపించడానికి ఆ కసాపురం ఆంజనేయస్వామి ఎదురొస్తే ఎలా ఉంటుందనేదే రణబాలి కథ అని తెలిపారు. కుమారస్వామి యుద్ధానికి వెళ్లేముందు రణబాలి అవతారం ఎత్తుతాడు.. అతన్నే రణబాలి మురుగన్ అంటారు.. అదే ఈ మూవీ టైటిల్‌కు అర్థమన్నారు. ఈ సినిమా కూడా ఒక యుద్ధాన్ని తలపిస్తుందని డైరెక్టర్ వెల్లడించారు.


