అరుణ్ గోవిల్ పేరు చెప్పగానే నాటి తరం ప్రేక్షకులకు ‘రామాయణ్’ సీరియల్ గుర్తుకొస్తుంది. అందులో శ్రీ రాముడిగా చక్కని ఆహార్యం, అద్భుతమైన నటనతో అరుణ్ గోవిల్ చెరగని ముద్ర వేసుకున్నారు. అప్పుడు రాముడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ నటుడు ఇప్పుడు రాముడి తండ్రి దశరథుడిగా కనిపించనున్నారు. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ’లో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్నారు.
అయోధ్య రాజు దశరథుడిగా అరుణ్ గోవిల్ కనిపించనున్నారు. ఈ పాత్ర లుక్ పోస్టర్‌ని బుధవారం విడుదల చేశారు. ‘ఒక తరం కోసం ఆయన రాముడికి ప్రాణం పోశారు. ఇప్పుడు ‘రామాయణ’ ప్రపంచంలోకి అయోధ్య రాజుగా తిరిగి వస్తున్నారు. దశరథుడిగా అరుణ్ గోవిల్’ అంటూ ఈ పోస్టర్‌ను షేర్ చేసింది యూనిట్. నమిత్ మల్హోత్రా, యశ్ నిర్మిస్తున్న ‘రామాయణ’ రెండు భాగాలుగా రానుంది. తొలి భాగం ప్రపంచవ్యాప్తంగా 2026 నవంబర్ 5న, రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానున్నాయి. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.


