
రజనీకాంత్ (Rajinikanth) తొలిసారిగా 1975లో వచ్చిన అపూర్వ రాగంగల్ సినిమాలో వెండితెరపై కనిపించారు. అది ఆగస్టు 15న విడుదలైంది. అప్పట్లో ఆయన ఇంత పెద్ద హీరో అవుతారని ఎవరూ కనీసం ఊహించను కూడా లేదు. ఐదు దశాబ్దాల తర్వాత, తలైవా అనేది కేవలం ఒక బిరుదు కాదు, అది ఒక నినాదమైపోయింది. సన్ గ్లాసెస్, ఆ సిగరెట్ స్టైల్స్... ఇంకా పంచ్ డైలాగ్‌లతో పాటు రజనీకాంత్ కెరీర్.. నిర్భయమైన పాత్రల ఎంపికల మీద కూడా నిర్మితమైంది.
విలన్‌గా ఎంట్రీ..
దీని కోసం తన సొంత ఇమేజ్‌ను దెబ్బతీసుకోవడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. ఆయన సమకాలీకుల్లో చాలా మందికి భిన్నంగా.. ఇమేజ్‌కు తోడ్పడే సురక్షితమైన పాత్రలు మాత్రమే పోషించడానికి ఆయన మొదటి నుంచీ నిరాకరిస్తూనే ఉన్నాడు. తన తరంలోని చాలా మంది తారలు రొమాంటిక్ హీరోలుగా అరంగేట్రం చేస్తున్న పరిస్థితుల్లో, రజనీ విలన్‌గా సినిమాల్లోకి అడుగుపెట్టాడు.
మూండ్రు ముడిచ్చు (1976) వంటి ప్రారంభ చిత్రాల్లో విలన్ పాత్రలను పోషించాడు. నిజానికి ప్రేక్షకులు తమ హీరోలను విపరీతంగా ఆరాధించే యుగంలో అది అంత సులభమేం కాదు. అయినా సరే రజనీకాంత్ విలన్‌గా తన బ్రాండ్‌ను సరికొత్తగా నిర్మించుకున్నాడు. నాటి 70's చివర్లో, 80's ప్రారంభంలో రజనీ విలన్, చిన్న చిన్న పాత్రల నుంచి ప్రధాన పాత్రల్లోకి మారారు. అలాగని తెరపై వీరోచిత పాత్రలకే ఆయన పరిమితం కాలేదు.
ఆరిలిరుంతు అరుబతు వారై (1979) వంటి చిత్రాలలో ఆయన కౌమారదశ నుంచి వృధ్ధాప్యం వరకు కష్టపడుతున్న వ్యక్తిగా నటించారు. ఇది ఒక అన్నదాత త్యాగాల గాధను చూపిస్తుంది. ఇది ఇప్పటికీ అతని అత్యంత అద్భుతమైన నటనల్లో ఒకటిగా పరిగణన పొందుతోంది. తమిళ సినిమాలో అతిపెద్ద స్టార్ అయిన తర్వాత కూడా, రజనీ తన ప్రయోగాత్మక పంథాను వదులుకోలేదు. అవర్గల్ (1977) ముల్లుమ్ మలరుమ్ (1978)లలో, ఆయన తన ఇమేజ్‌కు భిన్నమైన పలు పాత్రలు పోషించారు. స్టార్‌డమ్ కు కట్టుబడే హీరోల ఆలోచనలకు భిన్నంగా కొనసాగారు.
కమర్షియల్ సినిమాతో మలుపు...
‘మాస్ హీరో‘ గా రజనీని ఎవరికీ అందనంత ఎత్తులో అమాంతం కూర్చోబెట్టిన సినిమాలు బిల్లా (1980), బాషా (1995), శివాజీ (2007)లు. ఇవి మొత్తంగా భారతీయ వాణిజ్య సినిమాలో మైలురాళ్ళు. కానీ ఈ బ్లాక్‌బస్టర్‌లలో కూడా, ఆయన పాత్రపరమైన తన వైవిధ్యాన్ని ప్రదర్శించాడు. మనసున్న డాన్ పాత్రలో మనస్సాక్షికి లోబడే టెక్ మొగల్ పాత్రలో కనిపించి మెప్పించాడు. 2000ల తర్వాత, రజనీ ఎంథిరన్/రోబో (2010) కాలా (2018) చిత్రాలతో సాహసోపేత పాత్రలకు సై అంటూనే ఉన్నాడు. ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లవుతున్నా.. అభిమానులను అలరించేందుకు మరిన్ని సినిమాలతో ముందుకు వస్తానంటున్నాడు రజనీకాంత్.
చదవండి: రజినీకాంత్ 'కూలీ' సినిమా రివ్యూ