∙‘లెనిన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పబ్లిసిటీ ట్రెండ్ మారుతోంది. గతంలో సినిమా ఈవెంట్లు కేవలం హైదరాబాద్ నగరానికి మాత్రమే పరిమితం అయ్యేవి. సినిమా ప్రారంభోత్సవాలు, షూటింగ్స్, ఆడియో రిలీజ్‌లు, ప్రెస్‌మీట్స్, సాంగ్ లాంచ్ ఈవెంట్స్, టీజర్ లాంచ్, ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, థ్యాంక్స్ మీట్, సక్సెస్ మీట్... ఇలా సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలన్నీ హైదరాబాద్‌లోనే జరిగేవి. ప్రీ రిలీజ్ ఈవెంట్స్, థ్యాంక్స్ మీట్, బ్లాక్‌బస్టర్ మీట్స్‌కి అయితే ప్రత్యేకించి ఆయా హీరోల అభిమానులు భాగ్యనగరానికి తరలి వచ్చేవారు. ఇప్పుడూ వస్తున్నారు.
అయితే ఇప్పుడు పబ్లిసిటీ ట్రెండ్ చేంజ్ అయింది. సినిమాల ప్రారంభోత్సవాల నుంచి షూటింగ్స్, సాంగ్ లాంచ్ ఈవెంట్స్, ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, థ్యాంక్స్ మీట్స్... ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు తిరుపతి, గుంటూరు, విజయవాడ, వైజాగ్, భీమవరం, రాజమండ్రి, కర్నూలు, అనంతరపురం, వరంగల్... వంటి ప్రాంతాల్లోని ఓపెన్ గ్రౌండ్స్‌తో పాటు థియేటర్స్, కన్వెన్షన్ హాల్స్‌లోనూ జరుగుతున్నాయి.
ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌లలో ఆయా సినిమాల ఈవెంట్లను నిర్వహించడం ద్వారా అక్కడి సినిమా అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై బజ్ పెంచవచ్చన్నది మేకర్స్ ఆలోచన. అదే విధంగా మరికొంత మంది చిత్రయూనిట్స్ అయితే ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల్లో విద్యార్థుల సందడి మధ్య టీజర్ లాంచ్, ట్రైలర్ లాంచ్, సాంగ్స్ లాంచ్ ఈవెంట్స్ నిర్వహించడం కూడా ఈ మధ్య ట్రెండ్‌గా మారింది. ఆ విశేషాలు ఏంటో ఓసారి చూద్దాం.
భీమవరంలో ఇరుముడి...
రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఇరుముడి’. ఈ సినిమాలో ప్రియా భవానీశంకర్ కథానాయికగా నటించగా, బేబీ నక్షత్ర కీలక పాత్ర పోషించారు. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక, మీసాల లక్ష్మణ్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, రమణ భార్గవ్, కిషోర్ కంచెరపాలెం, కార్తీక్ అడుసుమల్లి, మహేశ్ కీలక పాత్రలు పోషించారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి. సిరీస్ ఫిల్మŠస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని ఈ నెల 12న రవితేజ, సినిమా అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలో హీరో రవితేజ మాట్లాడుతూ–‘‘హలో భీమవరం... నాకు భీమవరంతో మంచి అనుబంధం ఉంది. నా జీవితంలో దాదాపు ఎనిమిది నెలల పాటు కేవలం సినిమాలు చూడటానికే భీమవరంలో ఉన్నాను. మా తాతయ్య, నానమ్మ డీఎన్‌ఆర్ కాలేజ్ దగ్గర ఉండేవారు. భీమవరానికి చాలా మంచి వైబ్ ఉంటుంది. మాది భీమవరం అని ఎవరైనా సరే గర్వంగా చెప్పుకుంటారు. ఇక్కడి ఫుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతికి కోడి పందేల్లో కలుద్దాం. ‘ఇరుముడి’ సినిమా ట్రైలర్ మీ అందరికీ నచ్చడం చాలా సంతోషంగా ఉంది... సినిమా కూడా మీకు కచ్చితంగా నచ్చుతుంది. ఈ వైబ్‌ను ఇలాగే కంటిన్యూ చేద్దాం. థ్యాంక్యూ భీమవరం’’ అన్నారు.
డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ–‘‘అందరికీ నమస్కారం. ‘ఇరుముడి’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ భీమవరంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ మా ట్రైలర్ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ట్రైలర్‌లో ఉన్నదానికి పదింతలు సినిమాలో ఉంటుంది. ‘ఇరుముడి’ టైటిల్ ప్రకటించగానే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అద్భుతమైన వైబ్రేషన్ వచ్చింది. ఆ రోజు నుంచి ఈరోజు వరకు అదే వైబ్రేషన్, అదే ప్రేమ చూపిస్తున్నారు.
మీ ప్రేమ నాపై మరింత బాధ్యతను పెంచింది. ‘ఇరుముడి’ కేవలం ఒక సినిమా కాదు... గొప్ప ఎమోషన్’’ అని చెప్పారు. నిర్మాత వై. రవిశంకర్ మాట్లాడుతూ– ‘‘ఇరుముడి’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని భీమవరంలో చేద్దామని అనుకున్నప్పుడు రవితేజగారు వెంటనే ఓకే అన్నారు. ‘ఇరుముడి’ సినిమా చాలా పెద్ద రేంజ్‌కి
వెళ్తుందని నమ్ముతున్నాం. మీరందరూ థియేటర్లలో ‘ఇరుముడి’ సినిమా చూడాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.
తిరుపతిలో లెనిన్
అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం ‘లెనిన్’. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. సునీల్, శివాజీ, బ్రహ్మాజీ ఇతర పాత్రలు పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పీ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా జూలై 10న రిలీజ్ అయింది. కాగా ఈ మూవీ ప్రెస్‌మీట్‌ని విశాఖపట్నంలో నిర్వహించారు. అదే విధంగా జూలై 5న ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో, నిర్మాత అక్కినేని నాగార్జున మాట్లాడుతూ– ‘‘ముందుగా కొండమీద ఉన్న వెంకటేశ్వర స్వామికి భక్తపూర్వక నమస్కారం. ఆయన మనందర్నీ చల్లగా చూడాలి.
లెనిన్ శ్రీరామపురంలో జరిగే కథ అని డైరెక్టర్ నందు చెప్పారు. నాన్నగారు (అక్కినేని నాగేశ్వరరావు) శ్రీరామపురం అనే ఊర్లోనే పుట్టారు. దీంతో నందు చెప్పిన కథ నాకెంతో నచ్చింది. ఈ సినిమాలోని ప్రతీ పాత్రలో రకరకాల కోణాలున్నాయి. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టుల్ని ఎవ్వరూ ఊహించలేరు. ‘లెనిన్’ ఈ రాయలసీమ కథ... సీమ మట్టి కథ.. సీమలో ఉన్న మనుషుల కథ... సీమలో జరుగుతున్న మహాభారతం. అఖిల్ ఇలాంటి కథకు సూట్ అవుతాడా? అని మొదట్లో చాలా భయపడ్డాను. కానీ, సినిమా చూశాక అందరూ ఆశ్చర్యపోయారు. తెరపై అఖిల్ కనిపించలేదు.. లెనిన్ మాత్రమే కనిపించాడు.
లెనిన్ ప్రేమను, పగను ప్రేమిస్తారు.. లెనిన్‌ను ఇంటికి తీసుకువెళ్తారు. మనందరికీ ఆ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ ప్రేక్షక దేవుళ్ల సాక్షిగా చెబుతున్నాను.. మనవాడు (అఖిల్) ‘లెనిన్’తో హిట్ కొడుతున్నాడు’’ అని అన్నారు. అక్కినేని అఖిల్ మాట్లాడుతూ– ‘‘థ్యాంక్యూ తిరుపతి. ఏడు కొండలవాడా.. గోవిందా గోవిందా. రాయలసీమ బిడ్డ అయిన నందు ‘లెనిన్’ లాంటి అద్భుతమైన కథని నాకు చెప్పారు. నా జర్నీ, నా పెయిన్ అంతా కూడా ఈ కథలోనే కనిపించింది. అందుకే నేను వెంటనే ఓకే చెప్పాను’’ అన్నారు.
సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ– ‘‘లెనిన్’ కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు. అఖిల్‌ను నేనే ఎక్కువ ఇబ్బంది పెట్టాను. అఖిల్ ఈసారి ఏ ఒక్కర్నీ కూడా నిరాశపరచడు. ఇంటర్వెల్, చివరి 40 నిమిషాలు మాత్రం ఆడియన్స్ షాక్ అయ్యేలా ఉంటుంది. రెగ్యులర్ ఫార్మాట్‌లా మాత్రం అస్సలు ఉండదు. స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది’’ అన్నారు. భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ– ‘‘హాయ్ తిరుపతి. ఎలా ఉన్నారు. మీ అందరికీ ట్రైలర్ నచ్చిందా?. ‘లెనిన్’లో నేను భారతి అనే పాత్ర చేశాను. ఇలాంటి గొప్ప పాత్రను నాకు ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్. నా కెరీర్‌లో భారతి పాత్ర నిలిచిపోతుంది’’ అన్నారు.
అనంతపురంలో కొరియన్ కనకరాజు...
వరుణ్ తేజ్, రితికా నాయక్ జోడీగా నటించిన చిత్రం ‘కొరియన్ కనకరాజు’. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సునీల్, సత్య, తులసి, మురళీధర్ గౌడ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. యువీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న (శుక్రవారం) విడుదలైంది. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలోని ‘రాసా గుమ్మాడి...’ అంటూ సాగే సెకండ్ సాంగ్‌ని జూలై 19న (ఆదివారం) అనంతపురంలో అభిమానుల సమక్షంలో విడుదల చేశారు. ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, నల్గొండ గద్దర్ పాడారు.
‘రాసా గుమ్మాడి...’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘కొరియన్ కనకరాజు’ చిత్రీకరణ అనంతపురంలోనే జరిగింది. ఇక్కడి కియా కార్ల ఫ్యాక్టరీలోనూ షూటింగ్ చేశాం. అందుకే ‘రాసా గుమ్మాడి...’ పాటను ఇక్కడే రిలీజ్ చేయాలనుకున్నాం. అభిమానుల సమక్షంలో ఇలా పాటను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. మేర్లపాక గాంధీ మాట్లాడుతూ– ‘‘కొరియన్ కనకరాజు’లోని ‘రాసా గుమ్మాడి...’ పాటను అనంతపూరంలో రిలీజ్ చేయాలని వరుణ్‌గారు చెప్పారు. ఇక్కడి బ్యాక్ డ్రాప్‌తోనే ఈ మూవీ చేశాం’’ అన్నారు.
విశాఖపట్నంలో బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్..
‘కొరియన్ కనకరాజు మెగా బాక్సాఫీసు బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్’ ని ఈ నెల 14న(శుక్రవారం) విశాఖపట్నంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘అందరికీ నమస్కారం. వైజాగ్‌లో ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. వైజాగ్‌తో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. సత్యానంద్‌గారి యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో నటనలో శిక్షణ తీసుకున్నాను.
ఈ వేడుకకు విచ్చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు. సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన మెగా ఫ్యాన్స్‌కి, ప్రేక్షకులకు థ్యాంక్స్. మీ అందరికీ మంచి సినిమాలు ఇవ్వాలనే ప్రయత్నంలోనే ఉంటాను. మంచి స్క్రిప్ట్ కుదిరితే ‘కొరియన్ కనకరాజు’ సినిమాకు కొనసాగింపుగా మరో సినిమా చేయడానికి ప్రయత్నిస్తాం’’ అని తెలిపారు. నటుడు సత్య మాట్లాడుతూ–‘‘నేను యాక్టర్ అవ్వాలనే నిర్ణయం వైజాగ్‌లోనే తీసుకున్నాను. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన గాంధీగారికి థ్యాంక్యూ’’ అన్నారు.
హన్మకొండలో నేను రెడీ
హవీష్, కావ్యా థాపర్ జంటగా నటించిన చిత్రం ‘నేను రెడీ’. నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించిన ఈ మూవీలో నర్గీస్ ఫక్రీ స్పెషల్ సాంగ్ చేశారు. బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, గోపరాజు రమణ, హరితేజ, మహతి, రూపా లక్ష్మి, జయవాణి, మాణిక్ రెడ్డి, సత్యనారాయణ, రోహన్ రాయ్ ఇతర పాత్రలు పోషించారు. హార్నిక్స్ ఇండియా ఎల్‌ఎల్‌పీపై కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మించిన ఈ మూవీ విడుదలకు ముస్తాబవుతోంది. మిక్కీ జె. మేయర్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ‘మస్తుగుందిరో యవ్వారం...’ అంటూ సాగే మూడో పాట విడుదల వేడుకని ఈ నెల 13న (గురువారం) హన్మకొండలో నిర్వహించారు.
ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, అనురాగ్ కులకర్ణి, మనీషా ఎరబత్తిని పాడారు. విజయ్ పోలాకి కొరియోగ్రఫీ అందించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, ఈ పాటని విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘మస్తుగుందిరో యవ్వారం...’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌ని హన్మకొండలో నిర్వహించడం ఆనందంగా ఉంది. ఈ చిత్రంలోని పాటలన్నీ అందరికీ నచ్చేలా ఉన్నాయి. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా హన్మకొండలో చేయాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు. హీరో హవీష్ మాట్లాడుతూ– ‘‘హలో వరంగల్. మీరు ఇచ్చిన ఆదరణ మాకు గొప్ప కిక్ ఇచ్చింది. ఈ కిక్ కోసం మళ్లీ మళ్లీ ఇక్కడికి వస్తాం. మా పాటలన్నీ మీకు నచ్చడం చాలా ఆనందంగా ఉంది.
ఈ వేడుకలో మీ రియాక్షన్ చూస్తుంటే సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందని ముందే అర్థమవుతోంది. తప్పకుండా ఈ సినిమాని థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన మాట్లాడుతూ– ‘‘హాయ్ హన్మకొండ... ఈ సాంగ్‌ను పెద్ద హిట్ చేసిన ఆడియన్స్‌కి థ్యాంక్యూ. ‘నేను రెడీ’ని థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలి’’ అన్నారు. కావ్యా థాపర్ మాట్లాడుతూ– ‘‘ఈ వేడుకకి వచ్చిన అందరికీ థ్యాంక్యూ. ఈ సినిమాలోని పాటలన్నింటినీ మీరు చాలా ఎంజాయ్ చేస్తారు’’ అని పేర్కొన్నారు.
పైన పేర్కొన్న సినిమాల ఈవెంట్స్ మాత్రమే కాదు... మరికొన్ని సినిమాల కార్యక్రమాలు కూడా ఇతర ప్రాంతాల్లో జరుపుకున్నాయి. పాన్ ఇండియా ఒరవడి అన్ని భాషల సినిమాలూ అన్ని ప్రాంతాలకు వెళుతున్నాయి కాబట్టి పబ్లి‘సిటీ’ దాటుతోంది’ అని ప్రత్యేకంగా
చెప్పక్కర్లేదు.
కేవలం తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని సినిమాలే కాదు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న కన్నడ, తమిళ్, మలయాళ, బాలీవుడ్ చిత్రాల
ప్రమోషన్స్ ఈవెంట్స్‌ని కూడా భారీ ఎత్తున ఇతర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూలై 18న న్యూఢిల్లీలో ‘రామాయణ’ మూవీ ‘ప్రథమ్ సంకల్ప్’ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించారు. హిందీ చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘రామాయణ’. ఈ సినిమాలో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్, లక్ష్మణుడి పాత్రలో రవి దూబే, దశరథ మహారాజుగా రామానంద్ సాగర్, కైకేయి పాత్రలో శోభన, విశ్వామిత్ర మహర్షిగా అజింక్య దేవ్, ఇంద్రుడిగా కునాల్ కపూర్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు.
నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియో డీఎన్‌ఈజీ, యశ్ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ భాగస్వామ్యంతో నిర్మిస్తున్న ‘రామాయణ: పార్ట్ 1’ ప్రపంచవ్యాప్తంగా ఈ దీపావళికి విడుదల కానుంది. ఈ చిత్రాన్ని అంతర్జాతీయంగా సోనీ పిక్చర్స్, ఉత్తర భారతదేశంలో ధర్మ ప్రొడక్షన్స్ విడుదల చేయనున్నాయి. ఇదిలా ఉంటే... ఈ మూవీ హిందీలో తెరకెక్కినప్పటికీ తొలి ప్రమోషన్ ఈవెంట్‌ని ముంబైలో కాకుండా న్యూఢిల్లీలో చేపట్టడం విశేషం. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా ట్రైలర్ విడుదలకు ముందు న్యూఢిల్లీలో ‘ప్రథమ్ సంకల్ప్’ పేరుతో ఓ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు.
ఈ వేడుకలో నిర్మాత, క్రియేటివ్ ఆర్కిటెక్ట్ నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ–‘‘ రామాయణం కేవలం మన గొప్ప ఇతిహాసాల్లో ఒకటి మాత్రమే కాదు... అది మన జీవన విధానంలో భాగం. మనం ఎలా జీవించాలి? ఎలా పండగలు జరుపుకోవాలి? మన విలువలను తదుపరి తరాలకు ఎలా అందించాలి అనే విషయాలను నేర్పుతుంది’’ అని తెలిపారు. దర్శకుడు నితీష్ తివారీ మాట్లాడుతూ– ‘‘ప్రపంచంలో చెప్పబడిన గొప్ప కథల్లో రామాయణం ఒకటి. దాని గొప్పతనం పరిమాణంలో కాదు... అది ప్రతిబింబించే శాశ్వత విలువల్లో ఉంది. రామాయణాన్ని సంపూర్ణ నిజాయితీతో, ప్రామాణికతతో, అత్యంత గౌరవంతో తెరపై ఆవిష్కరించడం నా బాధ్యతగా భావించాను.
ఈ అద్భుతమైన వారసత్వానికి తగిన గౌరవాన్ని ఇస్తూనే, అత్యున్నత సినీ నైపుణ్యంతో ప్రేక్షకులకు అందించాలని ప్రయత్నించాం. ఈ విజన్‌ను సాకారం చేయడానికి ప్రపంచంలోని అత్యుత్తమ కళాకారులు, సాంకేతిక నిపుణులు, కథకులతో కలిసి పని చేయడం నా జీవితంలో ఒక గొప్ప అనుభవం. ప్రేక్షకులు ఈ సినిమాలో కేవలం విజువల్ స్పెక్టకిల్ మాత్రమే కాకుండా, రామాయణంలోని భావోద్వేగం, మానవత్వం, వేల ఏళ్లుగా దాన్ని చిరస్థాయిగా నిలబెట్టిన ఆత్మను కూడా అనుభూతి చెందుతారని ఆశిస్తున్నాను’’ అని చెప్పారు.
– డేరంగుల జగన్ మోహన్


