రవితేజ, ప్రియా భవానీ శంకర్ హీరో హీరోయిన్లుగా, బేబీ నక్షత్ర, సాయికుమార్ కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రియా భవానీ శంకర్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో కావేరి అనే గృహిణి పాత్ర చేశాను. భర్త, కుమార్తె... ఈ ఇద్దరే కావేరి ప్రపంచం. పల్లెటూరి యాసలో ఈ సినిమా డైలాగ్స్ చెప్పడం సవాల్‌గా అనిపించింది. ఈ చిత్రంలో ఫాదర్–డాటర్ ఎమోషన్ యూనివర్సల్‌గా అందరికీ కనెక్ట్ అవుతుంది.
ఈ సినిమా ట్రైలర్‌లో ఓ తండ్రి తన కుమార్తెను ఎంత బాధ్యతగా పెంచుతాడో కనిపిస్తుంది. అలాగే కూతురు కూడా ఏం జరిగినా పేరెంట్స్‌తో చెబుతుంటుంది. అలాంటి వాతావరణాన్ని తల్లిదండ్రులు వారి పిల్లలకు కల్పించాలి. ఈ సినిమా చూస్తున్నప్పుడు పిల్లలకు ఏం జరిగినా తమతో షేర్ చేసుకునే కంఫర్ట్‌ను పేరెంట్స్ ఇవ్వాలనే అంశం ఆలోచింపజేసేలా ఉంటుంది. లైఫ్‌లో నేను హ్యాపీ పర్సన్‌ని. అయితే ఇప్పటివరకు ఎక్కువగా సీరియస్ రోల్స్ చేశాను. నాకు మాత్రం మంచి ఫన్ క్యారెక్టర్స్ చేయాలని ఉంది. ప్రేక్షకులను నవ్వించే సినిమా చేయాలని ఉంది. ప్రస్తుతం నాగచైతన్యగారి ‘ధూత 2’లో నటిస్తున్నాను. తమిళంలో చేసిన ‘డిమోంటి కాలనీ 3’ రిలీజ్‌కు రెడీ అవుతోంది’ అని తెలిపారు.


