
టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ సంచలన కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదేనంటూ బాంబు పేల్చారు. అందుకే ఎలాంటి మంచి పనులు చేయలేకపోతున్నామని మాట్లాడారు. సైమా అవార్డుల ప్రెస్మీట్కు హజరైన అరవింద్ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమాలకు 7 జాతీయ అవార్డులు వచ్చాయని.. ఇండస్ట్రీ స్పందించి సత్కరించకముందే సైమా గుర్తించిందని తెలిపారు.
జాతీయ అవార్డులపై సైమా స్పందించి విజేతలను సత్కరించడం అభినందనీయమని అన్నారు. మనకు ఎన్నీ జాతీయ అవార్డులు వచ్చినా టాలీవుడ్ సినీ పరిశ్రమ మాత్రం స్పందించలేదన్నారు. జాతీయ అవార్డులను ఒక పండుగగా జరుపుకోవాల్సిన గొప్ప వేడుక అని అల్లు అరవింద్ వెల్లడించారు.
కాగా.. ఇటీవల ప్రకటించిన 71వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి నిలిచింది. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి, బేబీ మూవీ ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత అవార్డుకు ఎంపికైన డైరెక్టర్ సాయి రాజేశ్, బేబీ సినిమా పాటకు ఉత్తమ సింగర్‌గా పీవీఎన్‌ఎస్ రోహిత్‌ను సైమా టీమ్ సత్కరించింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ, సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా, మంచు లక్ష్మి కూడా పాల్గొన్నారు.