‘ప్రేమిస్తున్నా’ మూవీ రివ్యూ | Premisthunna Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

‘ప్రేమిస్తున్నా’ మూవీ రివ్యూ

Nov 7 2025 7:18 PM | Updated on Nov 7 2025 8:43 PM

Premisthunna Movie Review And Rating In Telugu

సాత్విక్‌ వర్మ, ప్రీతీ నేహా జంటగా నటించిన తాజా చిత్రం ‘ప్రేమిస్తున్నా’. వరలక్ష్మీ పప్పుల ప్రజెన్స్ లో కనకదుర్గారావు పప్పుల నిర్మించిన ఈ చిత్రానికి భాను దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్రం విడుదల చేసీన టీజర్‌, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమాలోని పాటలకు యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్‌ వచ్చింది. మంచి అంచనాలతో నేడు(నవంబర్‌ 7) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..
హీరో(సాత్విక్‌ వర్మ).. తొలి చూపులోనే హీరోయిన్‌(సాత్విక్‌ వర్మ)తో ప్రేమలో పడిపోతాడు. అందరు ప్రపోజ్‌ చేసినట్లుగా కాకుండా కాస్త వెరైటీగా తన ప్రేమ విషయాన్ని వ్యక్తం చేస్తాడు. ‘నీతో రొమాన్స్‌ చేయాలని ఉంది’ అనే ప్రపోజల్‌ పెడతాడు. హీరోయిన్‌ మాత్రం మనోడి ప్రపోజల్‌ని సిల్లీగా తీసుకొని.. స్నేహితులతో కలిసి కాలేజీకీ వెళ్తుంది. సాత్విక్‌  టైమ్‌ టేబుల్‌ వేసుకొని మరీ ఆమెను ఫాలో అవుతుంటాడు. నాన్నకు తెలిస్తే ఎక్కడ ప్రాబ్లమ్‌ అవుతుందోనని భయపడి.. సాత్విక్‌ అడిగినట్లుగా రొమాన్స్‌కి ఓకే చెబుతుంది.కానీ ఒక కండీషన్‌ పెడుతుంది. అదేంటి? ప్రాణంగా ప్రేమించిన సాత్విక్‌ని ప్రీతీ ఎందుకు దూరం పెట్టింది?  చాలా మంది అమ్మాయిలు ఉన్నా...సాత్విక్‌ ప్రీతీని మాత్రమే ఎందుకు ఇష్టపడ్డాడు? వీరిద్ధరి మధ్య ఏదైనా సంబంధం ఉందా?  ప్రీతి రాకతో సాత్విక్‌ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అమ్మాయి కోసం పిచ్చోడిలా ఎందుకు మారాల్సి వచ్చింది? తనది లస్ట్‌ కాదని నిజమైన ప్రేమ అని నిరూపించుకునేందుకు ఏం చేశాడు? కొడుకుని కాపాడుకునేందుకు తల్లి శారద ఎం చేసింది? భర్తతో లండన్‌ వెళ్లాల్సిన ప్రీతికి చివరి నిమిషంలో తెలిసిన అసలు నిజం ఏంటి? ఇంతకీ సాత్విక్‌ని నిజమైన ప్రేమేనా లేదా వ్యామోహమా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


ఎలా ఉందంటే..
అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒకరిని ప్రేమిస్తున్నారంటే..అందులో కోరిక కూడా ఉంటుంది. లవ్‌ ఉన్న చోట లస్ట్‌ కూడా ఉంటుందని చాటి చెప్పే చిత్రమిది. స్వచ్ఛమైన ప్రేమ అంటే ఎలా ఉంటుందో కాస్త బోల్డ్‌గా చూపించారు దర్శకుడు. సినిమా ప్రారంభంలో హీరోది నిజంగానే కోరిక అనుకుంటాం. అతని ప్రవర్తన చూసి కోపం, అసహ్యం కూడా కలుగుతుంది. కానీ రాను రాను ఇది కూడా ప్రేమలో ఒక భాగమే కదా.. తప్పు ఎందుకు అవుతుందనే భావన కలుగుతుంది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌ దాని చుట్టు అల్లుకున్న సీన్లు..డైలాగులు.. అన్నీ బాగున్నాయి. కథను ముందు వెనక్కీ నడుపుతూ రాసుకున్న స్క్రీన్‌ప్లే కథపై ఆసక్తిని పెంచేలా చేసింది. 

ఒక ఎమోషనల్‌ సీన్‌తో కథను ప్రారంభించాడు దర్శకుడు. ఆ వెంటనే ప్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లి లవ్‌స్టోరీని చూపించాడు. హీరోయిన్‌తో తొలి చూపులోనే ప్రేమలో పడడం.. రొమాన్స్‌ చేయాలని ఉందంటూ వెంటపడడం.. ఎక్కడికి వెళ్తే అక్కడకు వెళ్లడం.. ఎంగిలి తినడం..ఇవన్నీ థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తాయి. అమ్మాయి రొమాన్స్‌ ఒప్పుకోవడంతో కథనంపై మరింత ఆసక్తి పెరుగుతుంది. తర్వాత ఏం జరుగుతుంది? అమ్మాయి ఎందుకు అంతగా అసహ్యయించుకుంది? ఆస్పత్రిలో రొమాన్స్‌ తర్వాత ఏం జరిగిందనేది ముందే చెప్పకుండా..ప్రస్తుతాన్ని, ప్లాష్‌బ్యాక్‌ని మిక్స్‌ చేసి కథను చెబుతూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేశారు. తర్వాత ఒక్కో ట్విస్ట్‌ రివీల్‌ అవుతుంటే..ఫ్యూజులు ఎగిరిపోతాయి.

ఫస్టాఫ్‌ అంతా ఎంటర్‌టైనింగ్‌ సాగితే.. సెకండాఫ్‌ ఎమోషనల్‌గా సాగుతుంది. కొడుకును కాపాడుకునేందుకు తల్లి చేసే ప్రయత్నాలు, అమ్మాయి ప్రేమ కోసం హీరో పడే తాపత్రాయాలు భావోద్వేగానికి లోను చేస్తాయి. ద్వితియార్థంలో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. ప్రీక్లైమాక్స్‌ నుంచి క్లైమాక్స్‌ వరకు కథనం ఎమోషనల్‌గా సాగుతుంది. తనది నిజమైన ప్రేమ అని తెలిసిన తర్వాత హీరో తీసుకునే నిర్ణయం, ఈ క్రమంలో వచ్చే సంబాషణలు అదిరిపోతాయి . అసలైన ప్రేమ అంటే ఏంటి? లవ్‌కి లస్ట్‌కి తేడా ఏంటి? అనేది కళ్లకు కట్టినట్లుగా చూపించారు. క్లైమాక్స్‌ కి ముందు వచ్చే చిన్న చిన్న ట్విస్టులు ఆకట్టుకుంటాయి. ఇప్పటివరకు తెలుగు తెరపై కనిపించని ఓ స్వచ్ఛమైన ప్రేమ కథను కాస్త బోల్డ్‌గా చెప్పారు. నిడివి కాస్త ఎక్కువగా ఉంటుంది కానీ కథకు అవసరం కాబట్టి దాన్ని భరించొచ్చు. యూత్‌తో పాటు లవ్‌లో ఉన్న వారందరికి ఈ సినిమా బాగా నచ్చుతుంది.

ఎవరెలా చేశారంటే..
చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించిన సాత్విక్‌ వర్మ ఇందులో హీరో పాత్రను పోషించాడు. పిచ్చి ప్రేమికుడిగా ఆయన ఫెర్మార్మెన్స్‌ అదరగొట్టేశాడు. ఆయన పాత్ర ప్రవర్తన తీరు అర్జున్‌ రెడ్డి, ఆర్‌ఎక్స్‌ 100 చిత్రాల్లోని హీరో పాత్రలను గుర్తుకు తెస్తుంది. రొమాంటిక్‌తో పాటు ఎమోషనల్‌ సీన్లలోనూ అదరగొట్టేశాడు. ప్రీతీ నేహా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. తెరపై చాలా అందంగా కనిపించడమే కాకుండా..నటనతోనూ ఆకట్టుకుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమే నటించారు. 
సాంకేతికంగా సినిమా బాగుంది. పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. పాటలు అతికించినట్లుగా కాకుండా కథలో భాగంగానే వస్తుంటాయి. సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది. ఎడిటర్‌ పనితీరు బాగుంది.  నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement