
తమిళగ వెట్రి కళగం నేత విజయ్, జనసేన నేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌లను ఉద్దేశించి సినీ నటుడు ప్రకాష్ రాజ్ విమర్శలు గుప్పించారు. ఓ తమిళ పత్రికలో ప్రకాష్ రాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ముందుగా చైన్నెలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ను ప్రకాష్ రాజ్ కలవడం గమనార్హం. పవన్ కల్యాణ్, విజయ్‌లకు ఇద్దరికీ ప్రజా సమస్యలపై ఏమాత్రం అవగాహన లేదని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు.
టాలీవుడ్ స్టార్ హీరో అయిన చిరంజీవి కుటుంబం నుంచి పవన్ రాజకీయాల్లోకి వచ్చారని, ఆ అభిమానులు మాత్రమే పార్టీ కార్యకర్తలుగా మారారని గుర్తుచేశారు. విజయ్ కూడా తమిళ్‌లో అగ్రహీరో ఆపై ప్రముఖ దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్ కుమారుడు కావడం కలిసొచ్చిందన్నారు. విజయ్‌కు ఎలాంటి గుర్తింపు లేనప్పుడే ఆయన ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. అయితే, పవన్ కొన్నేళ్ల క్రితమే రాజకీయాల్లోకి వస్తే.. విజయ్ మాత్రం ఇప్పుడే సినిమాల నుంచి రాజకీయ ప్రవేశం చేశారన్నారు.
విజయ్, పవన్‌లతో తాను చాలా సినిమాల్లో నటించానని ఆ సమయంలో వారిద్దరిలో ఎవరూ కూడా రాజకీయాల గురించి అస్సలు మాట్లాడింది లేదన్నారు. పవన్ వచ్చి పది సంవత్సరాలు అయిందని ఆయనకు దీర్ఘదృష్టి కానీ, ప్రజా సమస్యలపై అవగాహన కానీ ఉన్నట్లు తాను ఎప్పుడూ గమనించలేదన్నారు. ఆయనలో ఆవేశం తప్పా ఎలాంటి విజన్ లేదు. కాబట్టే రోజుకొక పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేశారన్నారు. మార్పు కోసం అంటూ రాజకీయాలలోకి వస్తున్న వారు తమ ఇమేజ్‌ను పక్కనబెట్టి ప్రజల్లోకి వచ్చి గెలుపును సొంతంగా అందుకోవాలన్నారు. విజయ్‌కు ఉన్న ఇమేజ్ కారణంగా తమిళనాట కొన్ని స్థానాలు దక్కవచ్చన్నారు. గెలుపు వచ్చిన తర్వాత ప్రజల్లో తమ సత్తా ఏంటో వారిద్దరూ నిరూపించుకోవాలని ఆయన సూచించారు. అయితే, వచ్చే ఎన్నికల్లో విజయ్‌కు ఉన్న ఇమేజ్ వల్ల ఆయన పార్టీకి కొన్ని సీట్లు దక్కే అవకాశం ఉందన్నారు.