రిలీజ్‌కి ముందే 'పెద్ది' కలెక్షన్ల హంగామా | Peddi Movie Pre Sales And Collection | Sakshi
Sakshi News home page

Peddi Movie: విడుదలకు ముందే ఓవర్సీస్‌లో మిలియన్ డాలర్

Jun 3 2026 11:13 AM | Updated on Jun 3 2026 11:25 AM

Peddi Movie Pre Sales And Collection

మరికొన్ని గంటల్లో 'పెద్ది' సినిమా థియేటర్లలోకి రానుంది. ఆంధ్రా, విదేశాల్లో ఇప్పటికే టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేసేయగా తెలంగాణలో మాత్రం ఇంకా సమస్య తీరలేదు. ప్రభుత్వం నుంచి టికెట్ రేట్ల పెంపు కోసం తెలంగాణలో జీవో వచ్చినా గానీ ఆన్‌లైన్‌లో బుకింగ్స్ మాత్రం పూర్తిస్థాయిలో ఓపెన్ అవ్వలేదు. అయినా సరే ప్రీ సేల్స్‌లో మంచి నంబర్లే కనిపిస్తున్నాయి. ఇంతకీ 'పెద్ది'కి ప్రీ సేల్ వసూళ్లు ఎంతొచ్చాయి? తెలంగాణలో సమస్య ఏంటి?

(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమా)

'పెద్ది'కి ఎలాగైనా పర్సంటేజీ ఇవ్వాల్సిందేనని తెలంగాణ ఎగ్జిబిటర్లు కొన్నిరోజుల క్రితం పట్టుబట్టుకుని కూర్చున్నారు. నిర్మాతలు, చిరంజీవి, తెలుగు ఫిలిం ఛాంబర్‌తో వరస చర్చల కారణంగా ఈ వివాదం సద్దుమణిగింది. ఈ క్రమంలోనే మంగళవారం.. టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం వైపు నుంచి జీవో కూడా వచ్చేసింది. అయితే పీవీఆర్ యాజమాన్యంతో అగ్రిమెంట్ విషయంలో ఏదో సమస్య నడుస్తోందని, అందుకే ఇంకా సదరు థియేటర్లలో బుకింగ్స్ ఓపెన్ చేయలేదని తెలుస్తోంది. మిగతా చోట్ల కూడా త్వరలోనే ఓపెన్ చేయనున్నారు.

'పెద్ది' ప్రీ సేల్స్ విషయానికొస్తే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.35 కోట్లకు పైనే వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఉత్తర అమెరికాలో ఇప్పటికే 1.1 మిలియన్ డాలర్లకు పైనే టికెట్ సేల్స్ జరిగినట్లు అధికారికంగా ప్రకటించారు. పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మిగతా దేశాల్లో బుకింగ్స్ పర్లేదనిపించేలా ఉన్నాయి. ప్రస్తుతానికి నంబర్లన్నీ బాగానే ఉన్నాయి గానీ ఈరోజు రాత్రికి పడే ప్రీమియర్లతో టాక్ ఏంటనేది బయటకొస్తుంది. దానిబట్టి బుకింగ్స్‌లో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి.

విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తీసిన 'పెద్ది'లో రామ్ చరణ్ క్రాస్ ఓవర్ అథ్లెట్‌గా కనిపించబోతున్నాడు. అంటే క్రికెట్ ఆడతాడు, కుస్తీ చేస్తాడు, రన్నింగ్ కూడా చేస్తాడు. జాన్వీ కపూర్ హీరోయిన్. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు. బుచ్చిబాబు దర్శకుడు.

(ఇదీ చదవండి: 'పెద్ది' బడ్జెట్ ఎంత? అంచనాలు ఎలా ఉన్నాయి?)

Advertisement
 
Advertisement
Advertisement