తప్పులు చేయని మనిషంటూ ఉండడు. కానీ ఆ తప్పులు తెలుసుకుని సరిదిద్దుకున్నవాడే జీవితంలో ముందుకు వెళ్తాడు. బిగ్‌బాస్ షోలోనూ ఇదే వర్తిస్తుంది. అగ్నిపరీక్షలో కల్యాణ్ దూకుడు, అతడిలోని కసి చూసి.. ఇలాంటి కంటెస్టెంట్ కదా బిగ్‌బాస్‌కు కావాల్సింది అనుకునేలా చేశాడు. అతడి ఆట, మాట తీరు చూసి విన్నర్ మెటీరియల్ అని ముందుగానే ఫిక్సయిపోయారు.
అంతా తలకిందులు
కట్ చేస్తే బిగ్‌బాస్ 9కి వచ్చాక పరిస్థితి తలకిందులైంది. పిక్నిక్‌కు వచ్చినట్లు ఓ మూలన కూర్చునేవాడు. ఏదో కరువులో ఉన్నట్లు అమ్మాయిలను ఓరగా చూస్తూ అదే పెద్ద పనిగా పెట్టుకున్నాడు. ఇతడు చేసిన పనులకు మూడోవారం ఎలిమినేట్ అయి వెళ్లిపోయేవాడే! కానీ నాగార్జున చెప్పిన హింట్లను గ్రహించాడు. ఎప్పుడూ ఆడాళ్ల చేతులు రాస్తూ కూర్చోవడమేనా? అని నాగ్ గడ్డి పెట్టడంతో తేరుకున్నాడు. ఇలాగే ఉంటే నీ ఆట ముగిసిపోతుందని వార్నింగ్ ఇవ్వడంతో అలర్ట్ అయ్యాడు.
రూటు మార్చాడు
అప్పటికే వరుసగా కామనర్లు ఎలిమినేట్ అవుతుండటంతో ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాడు. ఆట, మాట, తీరు అన్నీ మార్చుకున్నాడు. అగ్నిపరీక్షలో కనిపించిన కల్యాణ్‌ను తిరిగి చూపించాడు. నాలుగోవారం నుంచి విజృంభించి ఆడాడు. టాస్కులు వస్తే గెలిచేవరకు వేటాడాల్సిందే అన్నంత కసిగా ఆడాడు. అందరితోనూ కలిసిపోయాడు. మనింటి కుర్రాడే అన్నంతగా ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నాడు.
జనాలకు కనెక్ట్..
తనకు ఇష్టమైనవాళ్లు ఎలిమినేట్ అయినా, బాధపడుతున్నా అస్సలు తట్టుకునేవాడు కాదు. వాళ్లకు ఏదైనా బాధ వచ్చిందంటే ఇతడే ఎక్కువ ఏడ్చేవాడు. అలా కల్యాణ్ స్వభావానికి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. ఎన్నో అవమానాలు పడ్డ కల్యాణ్ పడ్డచోటే లేచి నిల్చున్నాడు. ఛీ కొట్టినవారితోనే శెభాష్ అనిపించేలా చేసుకున్నాడు. తనూజతో పోటీపడేవాళ్లే లేరా? అన్న సమయంలో అందరికీ ఓ ఆశాదీపంలా కనిపించాడు.
పారితోషికం ఎంత?
కల్యాణ్ కోసం సోషల్ మీడియాలో బోలెడంత సింపతీ ప్రచారం జరిగింది. సోల్జర్ అని, పేదవాడు అని రకరకాలుగా ప్రచారం చేశారు. అది అతడికి బాగా కలిసొచ్చింది. అయితే హౌస్‌లో మాత్రం అతడెప్పుడూ ఆ కార్డులు బయటకు తీసి వాడుకోవాలని చూడలేదు. కానీ బిగ్‌బాస్ మాత్రం కుదిరినప్పుడల్లా అతడు జవాన్ అని గుర్తు చేశాడు. జై జవాన్ అన్న నినాదం కూడా అతడి విజయంలో కీలక పాత్ర పోషించింది.


