ఒక్కడు: చార్మినార్‌ సెట్‌ ఖర్చు, ఫస్ట్‌ అనుకున్న టైటిల్‌ తెలుసా? | Okkadu Clocks 23 Years: Know About Mahesh Babu Movie | Sakshi
Sakshi News home page

Okkadu Movie: మహేశ్‌కు మాస్‌ ఇమేజ్‌ తెచ్చిపెట్టిన సినిమా.. బడ్జెట్‌ ఎంతంటే?

Jan 15 2026 3:34 PM | Updated on Jan 15 2026 3:43 PM

Okkadu Clocks 23 Years: Know About Mahesh Babu Movie

ఈ సంక్రాంతికి బాక్సాఫీస్‌ కళకళలాడుతోంది. చిరంజీవి 'మనశంకర వరప్రసాద్‌గారు', ప్రభాస్‌ 'ది రాజాసాబ్‌', నవీన్‌ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు', రవితేజ 'భర్తమహాశయులకు విజ్ఞప్తి', శర్వానంద్‌ 'నారీనారీ నడుమ మురారి' సినిమాలు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. 

ఇందులో అన్ని సినిమాల కన్నా 'మన శంకర వరప్రసాద్‌గారు' మూవీ కలెక్షన్స్‌ వద్ద ఎక్కువ దూకుడు చూపిస్తోంది. సరిగ్గా 23 ఏళ్ల క్రితం మహేశ్‌బాబు సినిమా కూడా సంక్రాంతి రారాజుగా నిలిచింది. ఆ మూవీ ఏంటో తెలుసా? ఒక్కడు. 2003 జనవరి 15న విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచిన ఆ సినిమా విశేషాలను ఓసారి చూసేద్దాం...

పేపర్‌లో చూసి కథ
చిరంజీవితో గుణశేఖర్‌ తీసిన 'మృగరాజు' బాక్సాఫీస్‌ వద్ద పరాజయం పాలైంది. ఈ మూవీ తర్వాత గుణశేఖర్‌ కసితో తీసిన సినిమా 'ఒక్కడు'. ఒకరోజు పేపర్‌లో బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పుల్లెల గోపీచంద్‌ ఇంటర్వ్యూ చూశాడు. పుల్లెల గోపీచంద్‌ తండ్రికి క్రీడలంటే ఆసక్తి లేదు, అయినా ఎన్నో కష్టాలు పడి ఛాంపియన్‌గా ఎదుగుతాడు. 

మొదట అనుకున్న టైటిల్‌
దాన్ని స్ఫూర్తిగా తీసుకుని కథ రాసుకున్నాడు. అది మహేశ్‌బాబుకు చెప్పగా వెంటనే ఒప్పుకున్నాడు. నిర్మాతగా రామోజీరావును అనుకున్నాడు. కానీ, ఆయన ఆసక్తి చూపకపోయేసరికి ఎమ్మెస్‌ రాజు చెంతకు చేరింది. టైటిల్‌ విషయంలోనే అంతా మల్లగుల్లాలు పడ్డారు. 'అతడే ఆమె సైన్యం' అన్న టైటిల్‌ పెట్టాలనుకున్నారు. కానీ అది ఆల్‌రెడీ ఎవరో రిజిస్టర్‌ చేయడంతో మరొకటి వెతుక్కున్నారు. 

చార్మినార్‌ సెట్‌ కోసం
'కబడ్డీ' అనుకున్నారు, మళ్లీ ఎందుకో వెనక్కు తగ్గారు. చివరకు 'ఒక్కడు' టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. అందరికీ నచ్చేసింది. మహేశ్‌బాబు హీరోగా, భూమిక హీరోయిన్‌గా నటించగా ప్రకాశ్‌రాజ్‌ విలన్‌గా యాక్ట్‌ చేశారు. అప్పట్లోనే భారీ బడ్జెట్‌తో చార్మినార్‌ సెట్‌ వేసి మూవీ తీశారు. ఈ సెట్‌ కోసం దాదాపు రూ.2 కోట్ల మేర ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. పాతబస్తీని, ముఖ్యంగా కర్నూల్‌ కొండారెడ్డి బురుజును సినిమాలో హైలెట్‌ చేసి చూపించారు. 

మాస్‌ & స్టార్‌ ఇమేజ్‌
అలా ఒక్కడు రూ.9 కోట్లతో తీస్తే దాదాపు రూ.40 కోట్లు రాబట్టింది. మహేశ్‌బాబు కెరీర్‌లో తొలిసారి మాస్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. అతడికి స్టార్‌ హీరో ఇమేజ్‌ తెచ్చిపెట్టింది. మణిశర్మ అందించిన పాటలు ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోయాయి. ఈ మూవీ 8 నంది అవార్డులు గెలుచుకుంది. అంతేకాకుండా ఒక్కడు దాదాపు ఎనిమిది భాషల్లో రీమేక్‌ అయింది. ఇప్పటివరకు ఒక్కడు మూవీ ఐదుసార్లు రీరిలీజ్‌ అవడం విశేషం!

 

చదవండి: బక్కచిక్కిపోయిన బుల్లిరాజు.. ఆ కారణం వల్లే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement