
మలయాళ ప్రముఖ నటుడు ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil), కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan), రేవతి పిళై నటించిన రొమాంటిక్ చిత్రం ‘ఓడుం కుతిర చాదుం కుతిర’. మలయాళంలో రొమాంటిక్ కామెడీ చిత్రంగా విజయం సాధించింది. ఈ సినిమాను దర్శకుడు అల్తాఫ్ సలీం తెరకెక్కించగా.. ఆషిక్ ఉస్మాన్ నిర్మించారు. ఆగష్టు 29న విడుదలైన ఈ చిత్రం తాజాగా ఓటీటీ వివరాలను పంచుకున్నారు.
‘నెట్‌ఫ్లిక్స్’ (Netflix) వేదికగా సెప్టెంబర్ 26న ఓటీటీలో విడుదల కానున్నట్లు ఒక పోస్టర్‌ను పంచుకున్నారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీలో స్ట్రీమింగ్ అవుతుందని ఆ సంస్థ వెల్లడించింది. ఈ చిత్రం నవ్వులు పూయిస్తూనే.. ఒక జోడీ మధ్య చిలిపి సరదాలతో ప్రేమకథ కనిపిస్తుంది.

అభి (ఫహాద్ ఫాజిల్), నిధి (కల్యాణి ప్రియదర్శన్) పెళ్లి తంతుతో కథ ప్రారంభం అవుతుంది. అయితే, ఎంగేజ్‌మెంట్ నాడు తమ ఇంటికి గుర్రంపై రాజులా రావాలని అభికి నిధి కండీషన్ పెడుతుంది. దీంతో అభి కూడా గుర్రంపై ఆమె ఇంటికి బయలుదేరుతాడు. ఈ క్రమంలో ఎవరూ ఊహించని విధంగా గుర్రం నుంచి కిందపడుతాడు. ఆ సమయంలో కోమాలోకి వెళతాడు. దీంతో వారి పెళ్లి ఆగిపోతుంది. నిధి కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడంతో ఆమె మరొకరిని వివాహం చేసుకునేందుకు ఒప్పుకుంటుంది. అయితే, సడెన్‌గా అభి పూర్తి ఆరోగ్యంతో తిరిగొస్తాడు. నిధి గురించి తెలుసుకుని కొత్త జీవితం మొదలుపెట్టాలని బెంగళూరు వెళ్లిపోతాడు. అక్కడి నుంచి కథ మరో మలుపు తిరుగుతుంది. అక్కడ ఒక అమ్మాయి అభి జీవితంలోకి వచ్చేస్తుంది. ఫైనల్‌గా అభి జీవితం ఏమౌతుంది..? ఎవరిని పెళ్లి చేసుకుంటాడు..? అనేది చాలా ఫన్నీగా అందరినీ నవ్వించేలా సినిమా ఉంటుంది.