
పైలట్ కావాలని కలలు కని, అనుకోకుండా కెమెరా ముందు ల్యాండ్ అయింది! సినిమాల్లో గ్లామర్ కంటే టాలెంట్‌తో స్క్రీన్‌పై మెరుస్తోంది హీరోయిన్ నిత్యా మీనన్ (Nithya Menen). ఆ విషయాలే మీ కోసం...
అలా కెరీర్‌లో..
తెలుగు ప్రేక్షకులు కూడా బాగా దగ్గరైన నటి నిత్యా మీనన్. ‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగు తెరపై చెరగని ముద్ర వేసింది. ఎన్టీఆర్‌తో ‘జనతా గ్యారేజ్’, అల్లు అర్జున్‌తో ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, పవన్ కల్యాణ్‌తో ‘భీమ్లా నాయక్’ వంటి సినిమాలు చేసినా, గ్లామరస్ కమర్షియల్ హీరోయిన్‌గా కాకుండా, మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.
ఉత్తమ నటిగా జాతీయ అవార్డు
మలయాళీ అయినా, పుట్టి పెరిగిందంతా బెంగళూరులోనే. పైలట్ కావాలనేది చిన్ననాటి కల. అయితే ఏవియేషన్ ఫీల్డ్ ఆకర్షణీయంగా లేదని భావించి, మనసు సినిమాలవైపు మళ్లింది. పూణెలోని ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో సినిమాటోగ్రఫీ కోర్సు చేసింది. కానీ డైరెక్టర్ నందిని రెడ్డి పరిచయంతో హీరోయిన్ అయింది. గత ఏడాది ధనుష్‌తో నటించిన ‘తిరు’ సినిమాకు జాతీయ ఉత్తమ నటి అవార్డు సాధించింది.

ఐదు భాషలు మాట్లాడగలదు
నిత్యా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో కూడా అనర్గళంగా మాట్లాడగలదు. ‘సినిమా రంగంలో నటీనటుల, యూనిట్ సభ్యుల అనారోగ్యాలపై చాలామంది పట్టించుకోరు, కాల్షీట్స్ ప్రకారం పనిని పూర్తి చేయాలనుకుంటారు. కానీ, నేను మాత్రం సహచర నటులు, సహవాసుల పట్ల కొద్దిగా అయినా మానవత్వం చూపించాలని నమ్ముతాను’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
పీరియడ్స్ టైంలో అలా..
మిస్కిన్ దర్శకత్వంలో ‘సైకో’ సినిమాలో నటించేటప్పుడు, షూటింగ్ మొదటి రోజే తాను పీరియడ్స్‌లో ఉన్నానని, నొప్పితో బాధపడుతూ మిస్కిన్ దగ్గరకు వెళ్లి చెప్పిందట! ‘మిస్కిన్ ఆ రోజు విశ్రాంతి తీసుకోవాలని చెప్పాడు. అతను అర్థం చేసుకుని ప్రవర్తించిన తీరు మరచిపోలేను’ అని తెలిపింది. దాదాపు ముఫ్పై ఐదు ఏళ్లు పూర్తి చేసుకున్నప్పటికీ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదని చాలామంది అడుగుతుంటారు.
ఎన్నోసార్లు హార్ట్‌బ్రేక్
దీనికి నిత్యా స్పందిస్తూ – ‘చాలాసార్లు హార్ట్ బ్రేక్ అయ్యింది. అందుకే నాకు ఇంకా కొంత టైం కావాలి‘ అని చెప్పింది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే – చిన్నతనంలోనే ‘హనుమాన్’ అనే సినిమాలో బాల నటిగా నటించింది. ఆ సినిమాలో టబు చెల్లెలుగా కనిపిస్తుంది.
చదవండి: అక్కడ సక్సెస్ లేక తెలుగులో సినిమాలు చేశా.. ఆ ఒక్క మూవీతో..రమ్యకృష్ణ స్పీచ్