
34 ఏళ్లుగా సినీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన చిత్రం కెప్టెన్ ప్రభాకరన్ (Captain Prabhakaran Movie). దివంగత నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ కాంత్ కథానాయకుడిగా నటించిన 100వ చిత్రం ఇది. ఆర్కే సెల్వమణి కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహించగా రావుత్తర్ ఫిలింస్ సంస్థ నిర్మించింది. రూపిని, రమ్యకష్ణ (Ramya Krishna), శరత్ కుమార్ ,లివింగ్‌స్టన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించారు. 1991 ఏప్రిల్ 14న విడుదలైన ఈ చిత్రం ఘనవిజయాన్ని సాధించింది.
రీరిలీజ్
సుమారు 34 ఏళ్ల తర్వాత కెప్టెన్ ప్రభాకరన్ 4 కే వర్షన్‌లో ఈనెల 22న విడుదలకు సిద్ధమవుతోంది. స్పారో సినిమాస్ సంస్థ అధినేత కార్తీక్ వెంకటేషన్ రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం చిత్ర ఆడియో, ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని చైన్నె, వడపళనిలోని కమల థియేటర్లో భారీ ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటూ దర్శకుడు ఎస్ ఏ.చంద్రశేఖర్, విక్రమన్, నిర్మాత కలైపులి ఎస్. థాను, టీ.శివ, ఆర్వీ. ఉదయ్ కుమార్, పేరరసు, లింగుస్వామి, లియాకత్ అలీఖాన్ సహా పలువురు సినీ ప్రముఖులు అతిథులుగా పాల్గొన్నారు. విజయకాంత్ వారసుడు విజయ్ ప్రభాకరన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సినీరంగంలో వాళ్లే తల్లిదండ్రులు
ఈ సందర్భంగా దర్శకుడు ఎస్.ఏ చంద్రశేఖర్ మాట్లాడుతూ తనకు ఈ సమాజంపై, రాజకీయాలపై ఉన్న కోపాన్ని సినిమాల ద్వారా చూపించడానికి ఒక నటుడు అవసరం అయ్యారన్నారు. ఆయనే విజయకాంత్ అని పేర్కొన్నారు. విజయ్ కాంత్ హీరోగా తాను 18 చిత్రాలు చేసినట్లు పేర్కొన్నారు. చిత్ర దర్శకుడు ఆర్కే సెల్వమణి మాట్లాడుతూ.. సినీ రంగంలో తన తల్లిదండ్రులు అంటే విజయకాంత్, నిర్మాత ఇబ్రహీం రావుత్తర్ మాత్రమేనని తెలిపారు. విజయ కాంత్ నూరు జన్మలకు చేరవలసిన పుణ్యాలను తన వారసుల కోసం సంపాదించి వెళ్లిపోయారన్నారన్నారు.
ఇక్కడ సక్సెస్ లేక తెలుగులో..
నటి రమ్యకృష్ణ మాట్లాడుతూ.. తనకు తమిళంలో సరైన సక్సెస్ రాకపోవడంతో తెలుగు చిత్రాల్లో నటించానని అలాంటి సమయంలో కెప్టెన్ ప్రభాకర్ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని, ఆ చిత్ర విజయం తనకు మరో 10 ఏళ్లపాటు వరుసగా అవకాశాలు వచ్చేలా చేసిందని చెప్పారు. విజయ్ కాంత్ వారసుడు విజయ్ ప్రభాకరన్ మాట్లాడుతూ.. తనకు విజయకాంత్ కొడుకు అనే పేరు మాత్రమే చాలు అన్నారు. కాగా ఇకపై తన తండ్రి నటించిన చిత్రాలను ఏడాదికి ఒకటి రీ రిలీజ్ చేస్తామని చెప్పారు.
చదవండి: పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తే..? పరంతు పో మూవీ చూడాల్సిందే!