కలెక్టర్‌పై ఎమ్మెల్యే ఆగ్రహం
తిరువల్లూరు: వరి కొనుగోలు కేంద్రాన్ని తాను రాకముందే ఎలా ప్రారంభిస్తారని ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ జిల్లా కలెక్టర్‌ను ప్రశ్నించారు. తాను ఆలస్యంగా రావడంతో తాను చనిపోయానని భావించారా అంటూ గట్టిగా అడగడం కలకలం సృష్టించింది. తిరువళ్లూరు జిల్లా కదంబత్తూర్ యూనియన్ పుదుమావిలాంగై గ్రామంలో వరి ప్రత్యక్ష కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించే కార్యక్రమం సోమవారం జరిగింది. మంత్రి నాసర్, కలెక్టర్ ప్రతాప్, తిరువళ్లూరు ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్‌తోపాటు పలువురిని వ్యవసాయ శాఖ అధికారులు ఆహ్వానించారు. అయితే ఎమ్మెల్యే కార్యక్రమానికి హాజరు కావడం ఆలస్యం కావడంతో మంత్రి నాసర్, కలెక్టర్ ప్రతాప్ వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మంత్రి ప్రసంగిస్తున్న సమయానికి స్థానిక ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ హాజరయ్యారు. అయితే ఎమ్మెల్యే కనీసం మర్యాద లేని చోట ఎలా ఉండమంటారంటూ కార్యక్రమాన్ని బహిష్కరించి స్టేజీ దిగి కిందకి వెళ్లిపోయారు. కలెక్టర్ ప్రతాప్ ఆయన్ను సముదాయించడానికి ప్రయత్నం చేశారు. ఆగ్రహంతో ఉన్న ఎమ్మెల్యే వెళ్లిపోయారు.


