రామన్న భావోద్వేగం
సేలం: సేలం వేదికగా సోమవారం పీఎంకే సర్వసభ్య, రాష్ట్ర కార్యవర్గ భేటీలో తీవ్ర ఉద్వేగంతో సాగింది. పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు కన్నీటి పర్యంతమవుతూ ప్రసంగించారు. అన్బుమణి తనను నిత్యం చంపేస్తున్నాడని, ఇలాంటి కొడుకును కన్నందుకు తీవ్ర మదన పడుతున్నట్టు వ్యాఖ్యలు చేశారు. అతడ్ని ఇక మార్చలేం..మార్చేందుకు మార్గం కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎంకేలో రాందాసు, ఆయన తనయుడు అన్బుమణి మధ్య జరుగుతున్న వార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నికల కమిషన్ ద్వారా పార్టీకి తానే అధ్యక్షుడ్ని అని అన్బుమణి ప్రకటించుకుని ప్రత్యేక శిబిరం పెట్టారు. పార్టీ వ్యవస్థాపకుడు రాందాసు, గౌరవ అధ్యక్షుడు జీకేమణిని ఆ శిబిరం టార్గెట్ చేస్తోంది. సోమవారం సేలం వేదికగా రాందాసు నేతృత్వంలో జరిగిన పీఎంకే సర్వసభ్య, కార్యవర్గం భేటీ తీవ్ర ఉద్వేగానికి దారి తీసింది.
రామన్నకే అధికారం
ఉదయం నుంచి మధ్యాహ్నం ఈ సమావేశం జరిగింది. ఇందులో 27 తీర్మానాలు చేశారు. ఇందులో కూటమిపై నిర్ణయాధికారాన్ని రాందాసుకు అప్పగించారు. పార్టీ అధ్యక్షుడిగా రాందాసును ఎన్నుకున్నారు. పీఎంకేలో కీలక విభాగంగా ఉన్న పసుమై తాగయం అధ్యక్ష పదవిలో ఉన్న సౌమ్య అన్బుమణిని తప్పించి, ఆ పదవిని శ్రీకాంతికి అప్పగించారు. ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీకాంతి తన ప్రసంగంలో అన్బుమణి వెన్నంటి ఉన్న వాళ్లంతా ఆర్‌ఎస్‌ఎస్ బానిసలు అని ధ్వజమెత్తారు. ఈసారి 25 మంది ప్రతినిధులతో ప్రభుత్వంలో రాందాసు నేతృత్వంలోని పీఎంకే కీలక పాత్ర పోషించడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. గౌరవ అధ్యక్షుడు జీకేమణి ప్రసంగిస్తూ అన్బుమణి రూపంలో ఆయన వెన్నంటి ఉన్న వాళ్లకు మున్ముందు అన్ని కష్టాలు, నష్టాలేనని వ్యాఖ్యలు చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే అరుల్ మాట్లాడుతూ ఎన్నికల అనంతరం అన్బుమణి జీరో అని ధ్వజమెత్తారు. 2026లో రాందాసు బలపరిచే వ్యక్తే సీఎం అవుతారని వ్యాఖ్యలు చేశారు. రాందాసు మనవడు సుకుందన్ తన మామ అన్బుమణికి పలు ప్రశ్నలను సంధించారు. తాతయ్యతో కలిసి ఏళ్ల తరబడి పార్టీకి సేవలు అందిస్తున్న తన తమ్ముడు ముకుందన్ పార్టీ యువజన అధ్యక్షుడు కాకూడదా అని ఽప్రశ్నించారు. పదవీ ఆశతో అన్బుమణి వెంపర్లాడుతున్నారని మండి పడ్డారు.
సరిగ్గా పెంచలేదు...
రాందాసు మాట్లాడుతూ పార్టీ కోసం పడ్డ శ్రమను గుర్తు చేస్తూ, కూటమి విషయంపై కొత్త సంవత్సరంలో మంచి నిర్ణయం వెలువడుతుందని వ్యాఖ్యలు చేశారు. తనను గొంతు నులిమి చంపేయాలని పోస్టు పెట్టిన వాడికి అన్బుమణి పదవి ఇవ్వడం బట్టి చూస్తే.. అంటూ మరో మారు ఉద్వేగానికి గురి అయ్యారు. చిల్లర గాళ్లను పెట్టుకుని తనను అవమాన పరచడం భావ్యమా అని ప్రశ్నించారు. ప్రజలే అతడికి గట్టిగాబుద్ధి చెబుతారని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా అన్బుమణి తరపున న్యాయవాది బాలు మీడియాతో మాట్లాడుతూ ఈ సర్వసభ్య భేటీకి అఽధికారిక గుర్తింపు లేదన్నారు.


