పుదుచ్చేరి కోసం భారీ ప్రాజెక్టులు
సాక్షి, చైన్నె: పుదుచ్చేరికి భారీ ప్రాజెక్టులు రానున్నాయని, ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా అన్ని అమల్లోకి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటారని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు. ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించినానంతరం ప్రపథమంగా ఆయన కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో సోమవారం పర్యటించారు. ఆయనకు లెఫ్టినెంట్ గవర్నర్ కై లాష్ నాథన్, సీఎం రంగస్వామితో పాటూ మంత్రులు ఘన స్వాగతం పలికారు. రాజ్ భవన్ నియోజకవర్గం పరిధిలోని కుమర గురు పేటలో కొత్తగా నిర్మించిన 216 ప్లాట్‌లను లబ్ధిదారులకు సీపీ రాధాకృష్ణన్ అందజేశారు. ఈసందర్భంగా ఉప రాష్ట్రపతి ప్రసంగిస్తూ, మనిషి స్వేచ్ఛగా జన్మించాడని పేర్కొన్నారు. అయితే ఇక్కడి తమిళ, ఫ్రెంచ్ నాగరికతను గుర్తు చేస్తూ ప్రధానమంత్రి మోదీ ఐక్యరాజ్యసమితిలో సైతం తమిళ గళాన్ని వినిపించారని వివరించారు. తమిళనాడు ఉన్నతమైన ఆతిథ్యం, ఆప్యాయత, సంస్కృతిని గ్రహించి ఆయన ప్రపంచ వ్యాప్తంగా ఇక్కడి ఖ్యాతిని చాటుతున్నారన్నారు. పుదుచ్చేరిని నాడు, నేడు, ఇప్పుడు, ఎప్పుడు ఫ్రెంచ్ భారతీయ సంస్కృతికి కేంద్రా చూస్తున్నామన్నారు. పుదుచ్చేరి సాంస్కృతిక గొప్పతనం ఎప్పటికీ వికసించే విధంగా పరిరక్షించ బడిందన్నారు. ఇదిపుణ్య భూమి అని పేర్కొంటూ, ఇక్కడి అరబిందో ఆశ్రమం గురించి వివరించారు.
ప్రత్యేక అనుబంధం..
పుదుచ్చేరితో తమిళ కవి భారతీయార్‌కు ఉన్న అనుంబంధాన్ని ప్రస్తావిస్తూ, తాను గతంలో ఇక్కడ గవర్నర్‌గా పనిచేశానని, తాజగా ఉప రాష్ట్రపతిగా ఇక్కడకు వచ్చానని వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీకి తమిళంపై ఉన్న అపార అభిమానం తనను ఉప రాష్ట్రపతిని చేసిందన్నారు. తమిళ సంస్క్కృతి గురించి. తమిళులు, తమిళనాడుకు మరిన్ని స్మార్ట్ సిటీ ప్రాజెక్టులను అందించనున్నారని పేర్కొన్నారు. పుదుచ్చేరిలో అమలు చేయాల్సిన ప్రాజెక్టుల గురించి గవర్నర్ ప్రధానితో మాట్లాడినట్టు తెలిపారు. త్వరలో పుదుచ్చేరికి గొప్ప ప్రాజెక్టులు రాబోతున్నాయి. ప్రధానమంత్రి పుదుచ్చేరికి వస్తారని, ఆ ప్రాజెక్టులు ఆచరణాలోకి వస్తాయని వివరించారు. కార్యక్రమంలో స్పీకర్ ఎన్బళం సెల్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు నమశ్శివాయం, తిరు మురుగన్ తదితరులు పాల్గొన్నారు. కాగా మంగళవారం రామనాథపురంలో ఉపరాష్ట్రపతి పర్యటించనున్నారు. రామేశ్వరంలో జరిగే కాశీ తమిళ సంగమం ఉత్సవాల వేడుకలలో పాల్గొంటారు.


