
టైటిల్: పరంతు పో..
నటీనటులు: శివ, గ్రేస్ ఆంటోని,, మిథుల్ అంజలి తదితరులు
డైరెక్టర్: రాము
ఓటీటీ: జియో హాట్‌స్టార్
ఓటీటీలు వచ్చాక సినిమాలు చూసే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కంటెంట్ బాగున్న సినిమాలను ఓటీటీ ప్రియులు ఆదరిస్తున్నారు. ముఖ్యంగా చిన్న సినిమాలు థియేటర్లలో అంతగా రాణించలేకపోయినా.. ఓటీటీకి వచ్చేసరికి దూసుకెళ్తున్నాయి. అలాంటి మరో సందేశాత్మక చిత్రమే పరంతు పో. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
అసలు కథేంటంటే..
గోకుల్ (శివ), గ్లోరీ ( గ్రేస్ ఆంటోనీ) లవ్ మ్యారేజ్ చేసుకుని జీవిస్తుంటారు. వీరికి ఓ కుమారుడు జన్మిస్తాడు. వాడి పేరు అన్బుల్(మిథుల్). అసలే ప్రేమ పెళ్లి కావడంతో వీరికి ఇరు కుటుంబాల నుంచి ఎలాంటి మద్దతు లభించదు. ఫ్యామిలీ నడవాలంటే భార్యాభర్తలిద్దరూ తప్పక పని చేయాల్సిన పరిస్థితి. వీళ్లది మిడిల్ క్లాస్ కావడంతో జీవనం సాగించేందుకు చిన్నపాటి బిజినెస్ చేస్తుంటారు. గ్లోరీ బట్టల షాపు రన్ చేస్తుండగా.. గోకుల్ సైతం కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసే పనిలో బిజీగా ఉంటారు.
ఇద్దరు కూడా బిజీగా ఉండడం వల్ల ఈ ఎఫెక్ట్ పిల్లాడిపై పడుతుంది. దీంతో అన్బుల్ ఒక్కడే ఇంట్లో ఉంటూ టీవీకి పరిమితమైపోతాడు. ఒకసారి సడన్‌గా గ్లోరీ బిజినెస్ పనిమీద కోయంబత్తూరు వెళ్తుంది. అప్పుడు పిల్లాడి బాధ్యత తండ్రి గోకుల్ మీదే పడుతుంది. ఇంట్లో కొడుకు అల్లరిని తట్టుకోలేక రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తాడు గోకుల్. ఇంతకీ వాళ్ల ట్రిప్ సజావుగా సాగిందా? ఇంట్లో ఉన్నప్పుడు టీవీ తప్ప మరో ప్రపంచం తెలియని అన్బుల్ ఆ తర్వాత ఎలా మారిపోయాడన్నదే అసలు కథ.
ఎలా ఉందంటే..
ఒక్క మాటలో చెప్పాలంటే నేటి యువ జంటలు చేస్తున్న పొరపాటునే డైరెక్టర్ సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. పెళ్లి తర్వాత జీవనోపాధి కోసం నగరాలకు వచ్చి చేరుతున్న యువ జంటలు.. పనిలో పడి పిల్లలను పట్టించుకోవడం మానేశారు. నగరాల్లో దాదాపు అందరివీ ఒంటరి జీవితాలే. ఎందుకంటే ఇక్కడ ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు. ఎవరి పనిలో వాళ్లుండి ఫుల్ బిజీగా లైఫ్‌ను సాగదీస్తుంటారు. పిల్లలకు టైమ్ కేటాయించడమనేది చాలా అరుదు.
స్కూల్‌కు వెళ్లి వచ్చిన పిల్లాడు.. ఇంట్లో ఎవరు లేకపోతే అతని మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ పాయింట్‌నే ప్రధానంగా చూపిస్తూ కథ రాసుకున్నారు. ఈ జనరేషన్ పిల్లలపై ఆ ప్రభావం ఏంటనేది పరతు పోలో చక్కగా చూపించారు. ఈ కథ మొత్తం చెన్నై చుట్టుపక్కల ప్రాంతాల్లోనే జరుగుతుంది. ఈ కథ ప్రారంభంలో గ్లోరీ, గోకుల్ బిజినెస్‌తో బిజీగా ఉండడం చూపించారు. గ్లోరీ తన బట్టల షాప్ బిజినెస్‌లో పడి పిల్లాడితో ఇంటరాక్షన్ తగ్గిపోతుంది.
దీంతో పిల్లాడి లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోతుంది. స్కూల్‌కి వెళ్లి రావడం, టీవీకి అతుక్కుపోవడం అదే అతని దినచర్యగా మారుతుంది. అలా ఫస్టాఫ్‌లో వారి బిజీ లైఫ్, పిల్లాడి చుట్టూ కథ తిరుగుతుంది. గ్లోరీ తన బిజినెస్ పనిమీద కోయంబత్తూరు వెళ్లడంతో ఇంట్లో పిల్లాడిని కంట్రోల్ చేయలేక తండ్రి గోకుల్ రోడ్ ట్రిప్ కోసం బయలుదేరతాడు. ఆ తర్వాత జరిగే పరిణామాలు కామెడీతో పాటు కొత్త లైఫ్ స్టైల్‌ను పరిచయం చేసే సన్నివేశాలు అంతా రోటీన్‌గానే ఉంటాయి. తండ్రీ, కుమారుల మధ్య వచ్చే సంభాషణలు ఫుల్ కామెడీగా అనిపిస్తాయి.
అయితే ఈ రోడ్ ట్రిప్ మధ్యలో ఎప్పుడో ఐదో క్లాస్ చదివిన అంజలి.. గోకుల్‌ను చూసి వెంటనే గుర్తు పడుతుంది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య జరిగే సంభాషణలు, స్కూల్ లవ్ స్టోరీ చాలా ఫన్నీగా చూపించాడు డైరెక్టర్. ఎప్పుడు ఇంట్లో ఒక్కడే ఉండే అన్బుల్‌కు ట్రిప్‌లో కొత్త దోస్తులు పరిచయమవుతారు. అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ.. కొత్త ఫ్రెండ్స్ తోడు కావడంతో అన్బుల్‌లో ఊహించని మార్పు రావడాన్ని దర్శకుడు చూపించిన విధానం బాగుంది. ట్రిప్ మధ్యలో అన్బుల్ తల్లి గ్లోరీ ఫోన్ చేసి కొడుకు గురించి ఆరా తీయడం, భార్య, భర్తల మధ్య సంభాషణలతో కామెడీ పండించారు డైరెక్టర్.
ఈ కథలో సందేశం ఇస్తూనే ఎంటర్‌టైనింగ్‌తో పాటు పల్లె జీవితాన్ని ఆడియన్స్‌కు పరిచయం చేశాడు. కథనం నెమ్మదిగా సాగినాప్పటికీ.. క్లైమాక్స్ చివరి పదిహేను నిమిషాలు పరుగులు పెట్టించిన తీరు ఆకట్టుకుంది. ఓవరాల్‌గా నేటి జనరేషన్ జాబ్, బిజినెస్ అంటూ పిల్లల్ని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారనే విషయాన్ని తెరపై కళ్లకు కట్టినట్లుగా ఆవిష్కరించాడు. ఈ మూవీ చూసిన తర్వాతనైనా తల్లిదండ్రుల్లో కాస్త మార్పు రావాలని ఆశిద్దాం.
నటీనటుల విషయానికొస్తే శివ, గ్రేస్ ఆంటోనీ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. చిన్న పిల్లాడు మిథుల్ తన పాత్రలో అదరగొట్టేశాడు. అంజలి పాత్ర కొద్దిసేపే కనిపించినా తన నటనతో ఆకట్టుకుంది. సాంకేతికత పరంగా ఫర్వాలేదనిపించేలా ఉంది. లోకేషన్స్, కొండ ప్రాంతాల విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. సినిమా చూస్తున్నంత సేపు నేచురల్ ఫీలింగ్ కలుగుతుంది. నేపథ్య సంగీతం ఫర్వాలేదు.