నటుడు అల్లు శిరీష్ కొత్త ఏడాదిలో తను ప్రేమించిన ప్రియురాలు నయనికతో ఏడడుగులు వేయబోతున్నాడు. అక్టోబర్‌లో వారిద్దరి నిశ్చితార్థం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా తన పెళ్లి తేదీని శిరీష్ ప్రకటించాడు. 2026 మార్చి 6న తన పెళ్లి జరుగుతుందని ఒక పాటతో చెప్పాడు. అల్లు అయాన్, ఆర్హలతో కలిసి చేసిన ఒక రీల్‌లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు.
సరదాగా ఉన్న ఆ వీడియోలో బాబాయ్ సంగీత్ ఎప్పుడు అంటూ అని వారు అడగ్గా.. మనం దక్షిణాది వాళ్లం కాబట్టి అలాంటి వేడుక ఉండదని శిరీష్ చెప్తాడు. కానీ, పెళ్లి ఎక్కడ జరుగుతుంది అనేది మాత్రం చెప్పలేదు. అల్లు అర్జున్- స్నేహారెడ్డిల వివాహం కూడా 2011 మార్చి 6నే జరిగింది. సెంటిమెంట్‌తో అదే తేదీని శిరీష్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
అల్లు శిరీష్- నయనిక స్నేహం మొదలైన కొద్దిరోజుల్లోనే ప్రేమగా మారింది. 2023లో వరుణ్‌తేజ్- లావణ్యల పెళ్లి సందర్భంగా హీరో నితిన్- షాలిని దంపతులు ఓ పార్టీ ఏర్పాటు చేశారు. అక్కడికి షాలిని బెస్ట్ ఫ్రెండ్ నయనిక కూడా వచ్చింది. ఇటు వరుణ్ తరపున శిరీష్ పార్టీకి హాజరయ్యాడు. అక్కడే శిరీష్- నయనిక చూపులు కలిశాయి, మనసులు కూడా కలుసుకున్నాయి. పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రెండేళ్ల ప్రేమ ఇప్పుడు మూడుముళ్ల బంధంగా మారనుంది.


