లేడీ సూపర్‌స్టార్ నయనతార(Nayanthara ) టాలీవుడ్‌లో మళ్లీ బిజీ అయింది. కొన్నాళ్ల పాటు తెలుగు తెరపై అంతగా కనిపించని నయన్..ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ కొత్త సినిమాలోనూ నయన్ హీరోయిన్‌గా నటించబోతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా(#NBK111) చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలయ్యకు జోడీగా నయనతార నటించబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
నేడు(నవంబర్ 18) నయనతార బర్త్‌డే. ఈ సందర్భంగా ఓ స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో నయనతార పవర్‌ఫుల్ మహారాణి పాత్రలో కనిపించబోతున్నట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. ‘సముద్రమంత ప్రశాంతతను, తుపాను అంత బీభత్సాన్ని తనలో మోసే రాణి మా సామ్రాజ్యంలోకి అడుగుపెట్టనుంది’ అంటూ వీడియోతో ద్వారా చిత్ర యూనిట్ నయనతారకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.
కాగా, బాలయ్యతో నయనతార ఇప్పటికే మూడు సినిమాల్లో నటించింది. తొలుత సింహా చిత్రంలో వీరిద్దరు కలిసి నటించారు. ఆ తర్వాత ‘జై సింహా’, ‘శ్రీరామరాజ్యం’ చిత్రాల్లోనూ ఈ హిట్ జోడీ రిపీట్ అయింది. ఇప్పుడు నాలుగోసారి వెండితెరపై ఈ జంట అలరించబోతుంది. గతంలో మలినేని గోపిచంద్, బాలయ్య కాంబోలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ కావడంతో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది.


