
అనువు గాని చోట అధికులమనరాదని నాటి తరంలో చెప్పారు. అనువైన చోట అధికులమయ్యే అవకాశాన్ని వదులుకోరాదని నేటి తరం అంటోంది. తెలుగు నటుడు నవీన్ చంద్ర(Naveen Chandra ) నటుడిగా మారి దాదాపు 20ఏళ్లు అవుతోంది. ఎటువంటి సినీమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఈ రంగానికి వచ్చి స్వయం కృషితో తన 2 దశాబ్ధాల ప్రయాణాన్ని కొనసాగించాడు. నిశ్శబ్ధంగా నిలకడగా సాగుతున్న నవీన్ చంద్ర అభినయ యానం కోవిడ్ తర్వాత అనూహ్య మలుపు తిరిగింది. ప్రస్తుతం ఆయన్ను ఓటీటీ సూపర్‌స్టార్‌గా గుర్తించే స్థాయికి చేర్చింది.
సంభవామి యుగే యుగే అనే సినిమా ద్వారా 2006లో తెరంగేట్రం చేసిన నవీన్...ఆ తర్వాత అందాల రాక్షసితో డీసెంట్ సక్సెస్ అందుకున్నాడు. హ్యాండ్సమ్ లుక్‌తో పాటు యాక్టింగ్ స్కిల్స్ కూడా ఉన్న నటుడిగా ఆ సినిమా నవీన్ చంద్రకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే ఆ తర్వాత అతని కెరీర్ ఇక ఊపందుకుంటుంది అనుకున్నా అలా జరగలేదు. విభిన్న చిత్రాల్లో నటించినా..ఈ నటుడి స్థాయిని అమాంతం పెంచే చిత్రాలు మాత్రం రాలేదు. అదే సమయంలో కోవిడ్ తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌కు ఆదరణ అమాంతం పెరిగింది. దాంతో అటు దృష్టి మరల్చిన నవీన్ 2021లో జియో హాట్ స్టార్ లో విడుదలైన పరంపర సిరీస్ లో అవకాశం అందిపుచ్చుకున్నాడు. ఆ తర్వాత మంత్ ఆఫ్ మధు లాంటి నవీన్ చంద్ర సినిమాలు ధియేటర్ కన్నా మిన్నగా ఓటీటీలో చెప్పుకోదగ్గ స్థాయి విజయాలు సాధించాయి. దాంతో ఆయనకు వెబ్ సిరీస్‌లలో అవకాశాలు రావడం మొదలైంది.
అలా వచ్చిన అవకాశాలను తెలివిగా అందిపుచ్చుకున్న నవీన్ ‘ఇన్‌స్పెక్టర్ రిషి‘ సిరీస్ విజయంతో తన స్థానాన్ని మరింతగా సుస్థిరపరచుకున్నాడు. వైవిధ్యాన్ని ఇష్టపడే ఓటీటీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఈ సిరీస్‌లో ఒంటికన్ను కధానాయకుడి పాత్ర పోషించి తన నటనకు నవీన్ మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత తక్కువ థియేటర్లలో విడుదలై ఎప్పుడొచ్చిందో పోయిందో తెలియని ‘ఎలెవెన్‘ ఓటీటీ మీద సూపర్ హిట్ అయింది. అత్యధిక వీక్షకులను అందుకుని రికార్డ్స్ క్రియేట్ చేసింది.
ఇలా వైవిధ్య భరిత పాత్రలతో నవీన్ చంద్ర ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల మీద సక్సెస్ కు అడ్రెస్ గా మారారు. బలమైన స్క్రిప్ట్‌లను ఎంచుకుని, ప్రతిభావంతులైన చిత్రనిర్మాతలతో పనిచేస్తూ ఆయన ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రస్తుతం ఓటీటీలో నవీన్ చంద్ర విజయ విహారం ఆయనకు తమిళ, తెలుగు సినిమా రంగాల్లోనూ అవకాశాలను పెంచుతోంది. ఓటీటీ ప్రేక్షకుల్లో నవీన్ కు ఉన్న పట్టును దృష్టిలో ఉంచుకుని వెండితెర రూపకర్తలు ఆయన కోసం పాత్రలను సృష్టించే పనిలో పడ్డారు. మొత్తంగా చూస్తే అచ్చంగా డిజిటల్ రంగంలో నవీన్ స్థాయిలో రాణిస్తున్న మరో తెలుగు నటుడు లేరనేది నిస్సందేహం.
కొసమెరుపు ఏమిటంటే... ప్రస్తుతం తమిళ, తెలుగు రెండు భాషల ప్రేక్షకుల్ని సమానంగా మెప్పిస్తున్న నవీన్ చంద్ర తల్లిదండ్రుల్లో తండ్రి తమిళనాడుకు, తల్లి తెలంగాణకు చెందిన వారు కావడం విశేషం. జన్మతః హైదరాబాద్ వాసి అయిన నవీన్ చంద్ర తొలి దక్షిణాది ఓటీటీ సూపర్‌స్టార్ గా మారడం తెలుగువారికి గర్వకారణమేనని చెప్పాలి.