‘లెవన్’ మూవీ రివ్యూ
నవీన్ చంద్ర హీరోగా నటించిన తాజా చిత్రం ‘లెవన్’. సుందర్ సి వద్ద కలకలప్పు 2, వంద రాజవతాన్ వరువేన్, యాక్షన్ వంటి చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన లోకేశ్ అజ్ల్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. AR ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై అజ్మల్ ఖాన్,రేయా హరి నిర్మించిన ఈ చిత్రం నేడు(మే 16) తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.‘లెవన్’ కథేంటంటే.. అరవింద్(నవీన్ చంద్ర) ) ఓ సిన్సియర్ పోలీసాఫీసర్. ఏసీపీ హోదాలో వైజాగ్‌కి ట్రాన్స్ఫర్ అవుతాడు. వచ్చీరావడంతోనే ఓ దొంగతనం కేసును ఈజీగా సాల్వ్ చేస్తాడు. అదే సమయంలో వైజాగ్‌లో వరుస హత్యలు జరుగుతుంటాయి. తొలుత ఈ కేసును ఏసీసీ రంజిత్ కుమార్ (శశాంక్) డీల్ చేస్తాడు. విచారణ మధ్యలోనే అతనికి యాక్సిడెంట్ అవుతుంది. దీంతో ఈ కేసు అరవింద్ చేతికి వస్తుంది. అతనికి సహాయంగా ఎస్సై మనోహర్ ఉంటాడు. వీరిద్దరు కలిసి చేసిన విచారణలో చనిపోయినవారంతా కవలలు అని, ఇద్దరిలో ఒకరిని మాత్రమే చంపుతున్నారని తేలుతుంది. ఈ హత్యలు చేస్తున్న సీరియల్ కిల్లర్ ఎవరు? ఎందుకు చేస్తున్నాడు? ట్విన్స్‌లో ఒకరిని మాత్రమే ఎందుకు చంపుతున్నాడు? వారితో సీరియల్ కిల్లర్‌కు ఉన్న సంబంధం ఏంటి? ఏసీపీ అరవింద్ ఈ కేసును ఎలా డీల్ చేశాడు? చివరకు హంతకుడిని పట్టుకున్నారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. విలన్ క్రైమ్ చేయడం... పోలీసు అయిన హీరో ఆ కిల్లర్‌ని పట్టుకోవడం..అతనికో ప్లాష్ బ్యాక్ స్టోరీ..ఇలా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ల ఫార్మాట్ దాదాపు ఒకేలా ఉంటుంది. దీంట్లో క్రైమ్ జరిగిన తీరు.. వాటి చుట్టు అల్లుకున్న మైండ్ గేమ్, హీరో ఎంత తెలివిగా ఈ కేసును ఛేధించాడనే అంశాలపై సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సినిమాలకు బిగిసడలని స్క్రీన్‌ప్లే అవసరం. ప్రేక్షకుడు ఒక్క క్షణం కూడా తలను పక్కకు తిప్పుకోకుండా ఉత్కంఠ కలిగించే సన్నివేశాలతో కథనాన్ని నడిపించాలి. ‘లెవన్’ ఈ విషయంలో ఇది కొంతవరకు సఫలం అయింది. విలన్ ప్లాట్ రొటీన్‌గా ఉన్న ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కొత్తగా ఉంటుంది. ఈ సినిమాలో వచ్చే ట్విస్టులను ముందుగా డీకోడ్ చేయడం కొంతవరకు కష్టమే. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను రెగ్యులర్‌గా చూసేవాళ్లు విలన్ ఎవరనేది కనిపెట్టినా.. వాళ్ల మైండ్‌తో కూడా గేమ్ ఆడేలా స్క్రీన్‌ప్లే ఉంటుంది. సినిమా ప్రారంభంలో కథనం కాస్త నెమ్మదిగా సాగుతుంది. సీరియల్ కిల్లింగ్ కేసు హీరో చేతికి వచ్చిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. అదే సమయంలో హీరోహీరోయిన్ల మధ్య వచ్చే లవ్ ట్రాక్ ఇరికించినట్లుగా అనిపిస్తుంది. ప్రీఇంటర్వెల్ నుంచి కథనం మరింత ఆసక్తికరంగా సాగుతుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. మధ్యలో వచ్చే ప్లాష్‌బ్యాక్ స్టోరీ హృదయాలను హత్తుకుంటుంది. ఇక చివరిలో వచ్చే ట్విస్టులు అదిరిపోతాయి. ఈ కథకి లెవన్ అనే టైటిల్ ఎందుకు పెట్టారనేదానితో పాటు ప్రతి సీన్‌కి లాజిక్ ఉంటుంది. మొత్తంగా ‘లెవన్’ సినిమా రొటీన్ క్రైమ్ థ్రిల్లర్ కథే అయినా.. కథనం మాత్రం ఆసక్తికరంగా ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. నవీన్ చంద్రకు పోలీసు పాత్రలు చేయడం కొత్త కాదు. ఈ మధ్య ఆయన ఎక్కువ ఇలాంటి పాత్రలే చేశాడు. ఇందులో ఏసీపీ అరవింద్‌గా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆయన బాడీలాంగ్వేజ్, లుక్ నిజమైన పోలీసుల అధికారిని గుర్తు చేసేలా ఉంటుంది. హీరోయిన్ రియా హరి పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో చక్కగా నటించింది. ఎస్సై మనోహర్‌గా దిలీపన్, పోలీసు ఉన్నతాధికారిగా ఆడుకాలం నరేన్, ఏసీపీ రంజిత్ కుమార్‌గా శశాంక్ తమ పాత్రలకు న్యాయం చేశారు. కిరీటీ, రవివర్మతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. డి ఇమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయింది. తనదైన బీజీఎంతో అదరగొట్టేశాడు. పాటలు ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నంతా ఉన్నాయి.