'మంత్ ఆఫ్ మధు' రివ్యూ | Month Of Madhu Telugu Movie Review And Rating - Sakshi
Sakshi News home page

Month Of Madhu Review In Telugu: 'మంత్ ఆఫ్ మధు' రివ్యూ

Published Fri, Oct 6 2023 8:24 AM

Month Of Madhu Movie Review And Rating Telugu - Sakshi

టైటిల్: మంత్ ఆఫ్ మధు
నటీనటులు: స్వాతి, నవీన్ చంద్ర, మంజుల, వైవా హర్ష తదితరులు
మ్యూజిక్: అచ్చు రాజమణి
సినిమాటోగ్రఫీ: రాజీవ్ ధరావత్
డైరెక్టర్: శ్రీకాంత్ నాగోతి
ప్రొడ్యూసర్: యశ్వంత్ ములుకుట్ల
నిడివి: 2h 20m

కథేంటి?
అది వైజాగ్. మధుసూధన్ రావు(నవీన్ చంద్ర) ఉన్న గవర్నమెంట్ ఉద్యోగం పోగొట్టుకుంటాడు. మరోవైపు విడాకుల కేసు పెట్టిన భార్య లేఖ (స్వాతి రెడ్డి).. ఎప్పటికైనా తన దగ్గరకు మళ్ళీ తిరిగి వస్తుందని ఆశతో ఎదురుచూస్తూ ఉంటాడు. ఈ క్రమంలో మద్యానికి బానిస అయిపోతాడు. వీళ్లకు ఫ్లాష్ బ్యాక్ లో ఓ లవ్ స్టోరీ. మరోవైపు మధుమతి(శ్రియ నవిలే).. బంధువుల ఇంట్లో పెళ్లికోసం అమెరికా నుంచి వైజాగ్ వస్తుంది. ఓ సందర్భంలో ఈమెకి హీరో మధు పరిచయం అవుతాడు. మాటల సందర్భంలో అతడి ఫ్లాష్ బ్యాక్ తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఏమైంది? చివరకు మధుసూదన్- లేఖ కలిశారా? లేదా అనేది స్టోరీ.

ఎలా ఉందంటే? మంత్ ఆఫ్ మధు సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. అమెరికా నుంచి ఇండియాకి వచ్చిన మధు అనే ఓ అమ్మాయి.. వైజాగ్ లో నెల రోజుల్లో ఫేస్ చేసిన అనుభవాలే. ఇన్నాళ్లు తమిళ్, మలయాళంలో నేచురల్ సినిమాలు చూసి.. అయ్యో ఇలాంటివి మన తెలుగులో వస్తే బాగున్ను కదా అని చాలామంది అనుకున్నారు. అలాంటి ప్రయత్నమే ఈ సినిమా.

ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే..
బార్ లో మందు తాగుతున్న హీరోని కొందరు వ్యక్తులు ఎలా పడితే అలా చితక్కొట్టే సీన్ తో మూవీ స్టార్ట్ అవుతుంది. కట్ చేస్తే స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. 2003 వైజాగ్ కి చెందిన ఓ కుర్రాడు మధుసూధన్. కాలేజీ చదివే అమ్మాయి లేఖ. ఇద్దరు డీప్ లవ్ లో ఉంటారు. ఏకాంతంగా కలవడం వల్ల ప్రెగ్నెన్సీ వస్తే దాన్ని తీయించుకోవడానికి ఓ క్లినిక్ కి వెళ్తారు. ఆ తర్వాత వీళ్లు, వాళ్ల చుట్టూ ఉండే పాత్రలు పరిచయం చేస్తూ వెళ్ళారు. మరి ఈ కథ కంచికి చేరింది లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. అయితే సినిమాని చాలా నేచురల్ గా తీశారు.

2003 వైజాగ్ పరిస్థితుల్ని చాలా చక్కగా చూపించారు. అయితే సినిమాలో అసలు స్టోరీ ఏంటనేది సినిమా మొదలై చాలాసేపు అయిన ఓ పట్టానా అర్థం కాదు. తెరపై పాత్రలు వస్తుంటాయి, పోతుంటాయి కానీ ఒక్క సీన్ కూడా ఎమోషనల్ గా కనెక్ట్ కాలేకపోతం. భార్య - భర్త, వాళ్ళ మధ్య మనస్పర్ధలు, బాధ, ప్రేమ, విరహం, ఒక్కటి కావాలనే తపన ఇలా చాలా పాయింట్స్ ఉంటాయి. ఇందులో అలాంటివి ఉన్నా సరే వాటిని సరిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. అలానే టైటిల్ రోల్ చేసిన మధు అనే అమ్మాయి పాత్ర, ఆమె మాట్లాడే అమెరికన్ యాక్సెంట్ ఇంగ్లీష్ చిరాకు తెప్పిస్తుంది. సినిమాలో స్వాతి, నవీన్ చంద్ర, మంజుల, వైవా హర్ష తప్ప మరో తెలిసిన ముఖం కనిపించదు!

ఎవరెలా చేశారు?
మధుసూధన్ రావు పాత్ర చేసిన నవీన్ చంద్ర, లేఖ పాత్ర చేసిన స్వాతి బాగానే చేశారు. కానీ వీళ్ళ పాత్రల్లో డెప్త్ మిస్ కావడంతో ఎంత నేచురల్ గా తీసినా అవి తేలిపోయాయి. మహేష్ సోదరి మంజుల ఓ నాలుగైదు సీన్స్ లో కనిపించింది. వైవా హర్ష అక్కడక్కడ కనిపించి కాస్త నవ్వించాడు. మధుమతిగా చేసిన శ్రియ నవిలే.. ఆ పాత్రకి అసలు సూట్ కాలేదనిపించింది. అయితే యోగ టీచర్ వాసుకిగా చేసిన జ్ఞానేశ్వరి మాత్రం చూడ్డానికి చాలా బాగుంది. మిగతా వాళ్లంతా ఓకే అనిపించారు.

టెక్నికల్ టీం విషయానికి వస్తే.. పాటలు పెద్దగా గుర్తుండవ్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. అయితే సినిమాలో రెండు ర్యాప్ సాంగ్స్ ఉంటాయి. అవి సింక్ లేకుండా ఎందుకు పెట్టారో అర్థం కాదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఓవరాల్ గా చెప్పుకుంటే 'మంత్ ఆఫ్ మధు' రెగ్యులర్ ఆడియెన్స్ కి నచ్చడం కష్టమే!
- చందు, సాక్షి వెబ్ డెస్క్

చదవండి: క్రికెటర్‌ ముత్తయ్య మురళీధరన్‌ బయోపిక్‌ 800 మూవీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Rating:
 
Advertisement
 
Advertisement