800 Review: ‘800’ మూవీ రివ్యూ | Muttiah Muralitharan Biopic 800 Telugu Movie Review And Rating - Sakshi
Sakshi News home page

800 Review: ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌ ‘800’ ఎలా ఉందంటే?

Published Thu, Oct 5 2023 8:56 AM

800 Movie Review: Muttiah Muralitharan Biopic 800 Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: 800 
నటీనటుటు: మధుర్ మిట్టల్, మహిమా నంబియార్, నరేన్ తదితరులు
నిర్మాణ సంస్థ:మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్
నిర్మాత: వివేక్ రంగాచారి 
సమర్పణ:శివలెంక కృష్ణ ప్రసాద్‌
దర్శకత్వం:ఎంఎస్ శ్రీపతి 
సంగీతం: జీబ్రాన్‌
విడుదల తేది: అక్టోబర్‌ 06, 2023

భాషలకు, దేశాలకు అతీతంగా తన ఆటతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్. ఆయన జీవితం ఆధారంగా రూపొందిన సినిమా '800'. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800ల వికెట్లు తీసిన ఏకైక క్రికెటర్ ఆయనే. ఆ రికార్డును గుర్తు చేసేలా టైటిల్ పెట్టారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్‌ 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. స్వయంగా  ముత్తయ్య మురళీధరన్ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనడంతో ‘800’పై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాలతో ఈ నెల 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా కోసం ప్రత్యేక షో వేసింది చిత్ర బృందం. మరి  మురళీధరన్ బయోపిక్‌ ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం. 

‘800’ కథేంటంటే..
ముత్తయ్య మురళీధరన్‌ అంటే 800 వికెట్లు తీసిన ఏకైన క్రికెటర్‌గానే అందరికి తెలుసు.అయితే ఈ 800 వికెట్లు తీయడానికి వెనుక ఆయన పడిన కష్టమేంటి? తమిళనాడు నుంచి వలస వెళ్లి శ్రీలంకలో సెటిల్‌ అయిన మురళీధరన్‌ ఫ్యామిలీ.. అక్కడ ఎలాంటి వివక్షకు గురైంది? వివక్షను, అవమానాలను తట్టుకొని శ్రీలంక జట్టులో చోటు సంపాదించుకున్న మురళీధరన్.. స్టార్‌ క్రికెటర్‌గా ఎదిగిన తర్వాత కూడా ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు.

తొలిసారి ఇంగ్లాండ్‌ టూర్‌కి వెళ్లిన మురళీధరన్‌.. జట్టు నుంచి ఎలా స్థానాన్ని కోల్పోయాడు. ఆస్ట్రేలియా మ్యాచ్‌లో  ‘చకింగ్ ’అవమానాలను ఎలా అధిగమించాడు? తన బౌలింగ్‌పై వచ్చిన ఆరోపణలు తప్పని ఎలా నిరూపించుకున్నాడు? శ్రీలంకలోని ఎల్టీటీఈ సమస్యపై ప్రభాకరన్‌తో ఎలాంటి చర్చలు జరిపాడు? ఆ ఆలోచన ఎలా వచ్చింది? 1000 వికెట్లు తీసే సామర్థ్యం ఉన్నప్పటికీ..ముందుగానే ఎందుకు రిటైర్మెంట్ తీసుకున్నాడు? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే.. ‘800’ సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే.. 
ఓ క్రికెటర్‌ బయోపిక్‌ అంటే..అంతా క్రికెట్‌ గురించి, ఆ ఆటలో ఆయన సాధించిన రికార్డుల గురించి మాత్రమే ఉంటుంది. కానీ ముత్తయ్య మురళీధరన్‌ బయోపిక్‌ ‘800’ అలాంటి చిత్రం కాదు. ఇందులో ఆయన జీవితాన్ని చూపించాడు దర్శకుడు ఎంఎస్‌ శ్రీపతి . చిన్నప్పటి నుంచి మురళీధరన్‌ కుటుంబం పడిన కష్టాలు.. వివక్ష, అవమానాలను తట్టుకొని తన దేశం కోసం ఆడిన తీరు..  500పైగా వికెట్లు తీసిన తర్వాత కూడా తనపై ‘మోసగాడు’అనే విమర్శలు రావడం.. దాని వల్ల మురళీధరన్‌ పడిన మానసిక క్షోభ.. ఒకవైపు తాను ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటునే..800 వికెట్లు తీసిన వైనం.. ఇలా ఒక్కటేమిని.. మురళీధరన్‌ జీవితంలోని ప్రతి కోణాన్ని ఈ చిత్రంలో చూపించారు. 

క్రికెట్‌ ఆట ఎలా పుట్టింది? ఆంగ్లేయులు ఈ ఆటను వివిధ దేశాల్లో ఎలా విస్తరింపజేయారో  తెలియజేస్తూ ‘800’ సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత మురళీధరన్‌ తండ్రి ముత్తయ్య బాల్యాన్ని చూపించి.. కాసేపటికే అసలు కథను ప్రారంభిస్తాడు. మురళీధరన్‌(మధుర్ మిట్టల్) బాల్యం ఎలా గడిచింది?  తమిళులు, సింహాళీయులఘర్షణల మధ్య మురళీధరన్ ప్రయాణం కొనసాగిందనేది  చూపించారు. ఇంగ్లాండ్‌ టూర్‌లో ఆయనకు జట్టు తరపున ఆడే అవకాశం రాకపోవడం..  ఆస్ట్రేలియా మ్యాచ్‌లో అనూహ్యంగా జట్టులో చోటు లభించడం.. ఇక శ్రీలంక జట్టులో చోటు సంపాదించుకున్న తర్వాత సొంత టీం నుంచే ఎలాంటి అవమానాలు ఎదురయ్యాయి అనేది  ఫస్టాఫ్‌లో చూపించారు.

వ్యక్తిగత జీవితంలో మురళీ ఎదుర్కొన్న సమస్యలను, ఎదుగుతున్న క్రమంలో ఆయన తొక్కేయడానికి చేసిన ప్రయత్నాలను సెకండాఫ్‌లో చూపించారు.  ఆస్ట్రైలియాలో చకింగ్‌ ఆరోపణల సమయంలో కెప్టెన్‌ అర్జున రణతుంగ వ్యవహరించిన తీరు హృదయాలను హత్తుకుంటుంది. 1998లో ఇంగ్లాండ్‌ టెస్ట్‌ మ్యాచ్‌లో 16 వీకెట్లు తీసి శ్రీలంకను గెలిపించిన తీరుని అద్భుతంగా చూపించారు. ఆ తర్వాత మురళీ బౌలింగ్‌పై మళ్లీ అనుమానాలు వ్యక్తం చేయడం.. ఆ సమయంలో కెప్టెన్‌ అర్జున రణతుంగ అండగా నిలిచిన తీరు..  ఇవన్నీ బయోపిక్‌లో చక్కగా చూపించారు.  ఎలాంటి సినిమాటిక్‌ లిబర్టీ తీసుకోకుండా నిజంగా మురళీధరన్‌ జీవితంలో ఏం జరిగిందో ఆ విషయాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. సినిమాలో హై ఇచ్చే మూమెంట్స్‌ లేకపోవడం..   స్లో నెరేషన్‌ ఈ సినిమాకు మైనస్‌. క్రికెట్‌ లవర్స్‌కు, మురళీధరన్‌ ఫ్యాన్స్‌కి ‘800’ అయితే  కచ్చితంగా నచ్చుతుంది. 

ఎవరెలా చేశారంటే..
ముత్తయ్య మురళీధరన్‌గా మధుర్‌ మిట్టల్‌ జీవించేశాడు. తెరపై మధుర్‌గా కాకుండా నిజమైన మురళీ ధరన్‌ని చూసినట్లుగానే అనిపిస్తుంది. ఎమోషనల్‌ సన్నివేశాల్లో కూడా అద్భుతంగా నటించాడు. అప్పటి శ్రీలంక్‌ కెప్టెన్‌ అర్జున రణతుంగ పాత్రను పోషించిన నటుడు కూడా తన పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. నిజం చెప్పాలంటే.. ఈ సినిమాలో అర్జున రణతుంగ పాత్ర సెకండ్‌ హీరో అని చెప్పొచ్చు.  మురళీ భార్యగా మహిమ నంబియార్ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. సీనియర్‌ జర్నలిస్ట్‌గా నాజర్‌ తనదైన నటనతో మెప్పించాడు. ఈ సినిమా కథంతా అతని పాత్ర  నెరేట్ చేస్తుంది. మురళీ తల్లిదండ్రులు, నానమ్మ పాత్రలు పోషించిన వారితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పరిధిమేర చక్కగా నటించారు.

 ఇక సాంకెతిక విషయాలకొస్తే.. జీబ్రాన్‌ సంగీతం సినిమాకు ప్లస్‌ పాయింట్‌. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు.  ఆర్డీ రాజశేఖర్ సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి. 
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

.

Rating:
 
Advertisement
 
Advertisement