
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి(Mammootty) ఆరోగ్యంపై గతంలో రూమర్స్ వచ్చాయి. ఈ క్రమంలో తన స్నేహితుడు, రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్ ఆ వార్తలు నిజమేనని చెప్పారు. అయితే, ఆందోళన చెందాల్సినంత అనారోగ్య సమస్యలు కాదని చెప్పారు. తాజాగా మమ్ముట్టి పూర్తిగా కోలుకున్నారు. దీంతో మమ్ముట్టి ప్రాణ స్నేహితుడు మోహన్ లాల్ కూడా వారిద్దరూ కలిసి ఉన్న ఒక ఫోటోను పంచుకున్నారు. దానికి లవ్ సింబల్‌ను ఇచ్చి షేర్ చేయడంతో ఫ్యాన్స్ కూడా సంతోషంలో ఉన్నారు.
ఇప్పటికే మమ్ముట్టి పూర్తిగా కోలుకున్నారని త్వరలో మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటారంటూ మలయాళ మీడియాలో వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ మోహన్ లాల్ ఫోటో షేర్ చేయడంతో ఇండస్ట్రీ మొత్తం ఆనందంలో మునిగిపోయింది. అక్కడి నిర్మాతలతో పాటు నటి మంజు వారియర్ కూడా తన ఇన్‌స్టాలో ఓ ఫొటో షేర్ చేశారు. వెల్‌కమ్ బ్యాక్ టైగర్ అంటూ ఆమె ఆనందాన్ని పంచుకున్నారు. ఆయన మేకప్ మ్యాన్ జార్జ్ కూడా మమ్ముట్టి కోలుకున్నట్లు తెలిపారు. అందరి ప్రార్థనలు ఫలించాయని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
మలయాళ ఇండస్ట్రీలో ప్రాణ స్నేహితులు అంటే ఎవరికైనా మోహన్ లాల్, మమ్ముట్టి పేర్లే గుర్తొస్తాయి. మమ్ముట్టి పూర్తిగా కోలుకోవాలని ఈ ఏడాది మార్చిలో శబరిమలలో మోహన్ లాల్ పూజలు జరిపించారు. ఆ సమయంలో మమ్ముట్టి అసలు పేరు మహ్మద్ కుట్టి అని చెప్పడంతో కొంతమంది తప్పుపట్టారు. అలా ఎలా చేస్తారని మోహన్ లాల్‌ను ప్రశ్నించారు. దీంతో ఆయన కూడా సమాధానం చెప్పారు. 'అతని కోసం పూజలు చేస్తే తప్పేంటి..? ఆయన స్వల్ప అనారోగ్యంతో ఉన్నాడు. అందుకే చేపించాను' అంటూ తెలిపారు. తర్వాత వారి స్నేహం పట్ల ఉన్న ప్రేమకు నెటిజన్లు ఫిదా అయ్యారు. అందరికీ దేవుడు ఒక్కడే అంటూ నాడు కామెంట్లు చేశారు. ఇప్పుడు మమ్ముట్టి కోలుకోవడంతో అంతా అయ్యప్ప ఆశీస్సులు అంటూ చెబుతున్నారు.