అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. దీని షూటింగ్ ఈ ఏడాది అక్టోబరు వరకు ఉండనుందని తెలుస్తోంది. అంటే థియేటర్లలోకి రావడం దాదాపు వచ్చే ఏడాదే అనమాట. సరే ఈ మూవీ సంగతి పక్కనబెడితే బన్నీ నెక్స్ట్ ఏ దర్శకుడితో పనిచేస్తాడా అనే గందరగోళం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు లిస్టులో మరో పేరు వచ్చింది. స్టోరీ ఏంటనేది కూడా టాక్ నడుస్తోంది.
అట్లీ తర్వాత త్రివిక్రమ్‌తోనే బన్నీ కలిసి పనిచేయబోతున్నాడని కొన్నిరోజుల ముందు రూమర్స్ వచ్చాయి. గతంలో అల్లు అర్జున్ దగ్గరకు వచ్చి, ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లిపోయిన 'గాడ్ ఆఫ్ వార్' అనే స్క్రిప్ట్ మళ్లీ బన్నీ దగ్గరకొచ్చిందని.. ఈ ఏడాదిలో విషయంపై క్లారిటీ రావొచ్చని కొన్ని రోజుల ముందే మాట్లాడుకున్నారు. ఇది నిజమో కాదో అనే సంగతి పక్కనబెడితే కొత్తగా లోకేశ్ కనగరాజ్ పేరు తెరపైకి వచ్చింది.
(ఇదీ చదవండి: అల్లు అర్జున్ భార్యకీ తప్పని ఇబ్బంది.. వీడియో వైరల్)
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో బన్నీ-లోకేశ్ కలిసి ఓ మూవీ చేయబోతున్నారని టాక్ అయితే బయటకొచ్చింది. అయితే గతంలో లోకేశ్ రాసుకున్న 'ఇరుంబక్కు మాయావీ' స్క్రిప్ట్‌నే ఇప్పటి జనరేషన్‌కి తగ్గట్లు మార్పులు చేసి బన్నీతో చేయబోతున్నాడని మాట్లాడుకుంటున్నారు. ఈ స్టోరీ గతంలో సూర్యతో అనుకున్నారు. కానీ కుదర్లేదు. 'కూలీ' టైంలో దీన్ని ఆమిర్ ఖాన్‌తో లోకేశ్ చేయనున్నాడని మాట్లాడుకున్నారు. ఇప్పుడు చూస్తే బన్నీ పేరు తెరపైకి వచ్చింది. నిజమా కాదా అనేది కొన్నిరోజులు ఆగితే క్లారిటీ రావొచ్చు.
ఓ ప్రమాదంలో చేతిని కోల్పోయిన ఓ వ్యక్తికి లోహంతో తయారు చేసిన చేతిని అమర్చుతారు. దీంతో అతడికి ఎలాంటి సూపర్ పవర్స్ వచ్చాయి? తర్వాత ఏమైంది అనేదే 'ఇరుంబక్కు మాయావీ' స్టోరీ లైన్ అని గతంలోనే లోకేశ్ ఓసారి చెప్పాడు. మరి బన్నీతో చేయబోయే ప్రాజెక్ట్ ఇదేనా కాదా అనేది చూడాలి? దీనికి అనిరుధ్ సంగీతమందించే అవకాశముందని కూడా మాట్లాడేసుకుంటున్నారు.
(ఇదీ చదవండి: 'మన శంకర వరప్రసాద్‌గారు' ట్రైలర్ వచ్చేసింది)


