శోభనం రాత్రి 'హంగామా'.. ఓటీటీ సినిమా తెలుగు రివ్యూ | Modha Rathri Movie Review Telugu | Sakshi
Sakshi News home page

Modha Rathri Telugu Review: ఓటీటీలో సూపర్ కామెడీ మూవీ.. తెలుగు రివ్యూ

Sep 24 2026 3:21 PM | Updated on Sep 24 2026 3:42 PM

Modha Rathri Movie Review Telugu

ఓటీటీలోకి ఎప్పటికప్పుడు రకరకాల జానర్లలో కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. వీటిలో కొన్ని.. జనాలకు రిలేట్ అవుతూనే బాగా నవ్విస్తాయి. అలాంటి ఓ తమిళ చిత్రమే 'మొదరాత్రి'. గత నెలలో 'ఇరుముడి'తో పాటే థియేటర్లలో రిలీజై హిట్ కొట్టింది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది. తెలుగులోనూ అందుబాటులో ఉన్న ఈ మూవీ ఇంతకీ ఎలా ఉంది? అంతలా మెప్పించిందా అనేది రివ్యూలో చూద్దాం.

(ఇదీ చదవండి: నాని 'ప్యారడైజ్'.. ప్రేక్షకులు ఏమంటున్నారు?)

కథేంటి?
మారుతి(రిషికాంత్) దుబాయిలో పనిచేస్తుంటాడు. ఐదేళ్ల క్రితం తన జీవితంలో జరిగిన ఓ సంఘటన కారణంగా పెళ్లంటే విరక్తి వచ్చేసి ఇంటికి రాడు. అయితే ఇతడికి తెలియకుండానే బుజ్జి(అనిష్మా)తో పెద్దలు పెళ్లి ఫిక్స్ చేస్తారు. అబద్ధం చెప్పి ఊరికి రప్పించి పెళ్లి చేసేస్తారు. బుజ్జి మరొకరిని ప్రేమిస్తూ ఉంటుంది. ఇంట్లో బలవంతం చేయడంతో ఈ పెళ్లికి ఒప్పుకొంటుంది. ఇరు కుటుంబాల పెద్దలు.. కొత్త జంటకు శోభనం కోసమని గదిలోకి పంపిస్తారు? మరి లోపలికి వెళ్లిన మారుతి-బుజ్జి ఏం మాట్లాడుకున్నారు? బుజ్జి ప్రియుడి విషయంలో మారుతి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
కథలు కావాలంటే భారీతనం, హంగు, ఆర్బాటాలు ఉండాలని చాలామంది హీరోలు, దర్శకనిర్మాతలు భ్రమపడుతుంటారు. అలాంటి వాళ్లకు షాకిచ్చేలా అప్పుడప్పుడు కొన్ని సినిమాలు వస్తుంటాయి. అలాంటి ఓ మూవీనే 'మొదరాత్రి'. ఇదో తమిళ సినిమా. టైటిల్‌కి తగ్గట్లే పెళ్లి చేసుకున్న దంపతుల మొదటిరోజు అంటే శోభనం రాత్రి ఎలా గడిచింది? అసలు పెళ్లే ఇష్టం లేని వీళ్ల జీవితాల్లో ఎలాంటి ట్విస్టులు చోటుచేసుకున్నాయనేదే ఈ మూవీ.

మొదరాత్రి కథ చాలా సింపుల్. ఓ అమ్మాయి, అబ్బాయి పెళ్లి చేసుకుంటారు. పెద్దలు బలవంతపెడితే ఏడడుగులు వేశారు తప్పితే ఇద్దరికీ ఈ వివాహం ఇష్టం ఉండదు. తనకు ఎలానూ ఇష్టం లేదు కదా కనీసం బుజ్జి అయినా సంతోషంగా ఉండాలనుకునే మారుతి.. ఆమెని ప్రియుడితో వెళ్లిపోయేందుకు సాయం చేస్తాడు. ఆమె వెళ్లిపోయింటే అక్కడితో కథ అయిపోయేది. కానీ అనుకోకుండా జరిగే సంఘటనలు, మారుతి-బుజ్జి కుటుంబ సభ్యుల కారణంగా మొత్తం సీనే మారిపోతుంది.

కథగా చూసుకుంటే చాలా చిన్న లైనే కానీ సిట్చ్యూయేషనల్ కామెడీతో సినిమాని అద్భుతంగా నడిపించారు. మరీ ముఖ్యంగా బుజ్జి ప్రియుడి పాత్ర అయితే దురదృష్టానికి కేరాఫ్ అడ్రస్‌లా ఉంటుంది. ఈమెతో లేచిపోవాలని బైక్‌పై వస్తుంటే చిత్రవిచిత్రాలన్నీ జరుగుతాయి. అవన్నీ ఫుల్ కామెడీగా ఉంటాయి. మరోవైపు మారుతి తల్లి, తండ్రి, చెల్లి, బావ, మేనల్లుడు.. అలానే బుజ్జి తల్లి, చిన్నాన్న, పిన్ని, చెల్లి.. ఇలా లెక్కకు మించి పాత్రలున్నా ప్రతిదీ కూడా మనకు గుర్తుండిపోతుంది. అంతలా ఒక్కో పాత్ర వర్కౌట్ అయింది.

ఇంకా చెప్పాలంటే శోభనం మంచం తయారు చేసే షాపు ఓనర్, మైక్ సెట్ బిగించిన కుర్రాడి పాత్ర, ఊరి చివర ఉండే ఓ సాధు పాత్ర.. ఇలా ఒకటేమిటి అన్నింటిని కథకు కనెక్ట్ చేసిన విధానం ఎంటర్‌టైనింగ్‌గా అనిపిస్తుంది. సరే పెళ్లి, శోభనం, ప్రియుడు తదితర సీన్స్‌తో కామెడీ నడిపించేయడమే కాదు. ఆడపిల్లకు కుటుంబాల్లో ఉండే కట్టుబాట్లు, ఓ కుర్రాడిని ప్రేమించిందని తెలిసి సొంత కూతురినే దరిద్రం అని అనుకోవడం, పెళ్లి చేయాలని మారుతి తల్లిదండ్రులు ఆరాటపడటానికి కారణం.. మైక్ సెట్ బిగించేవాడు తక్కువ కులం అని వాడితో అంటీముట్టనట్లు ఉండటం.. ఇలా చాలా విషయాలు మనల్ని ఆలోచింపజేసేలా చేస్తాయి. బైకుపై తిరగడం, ఎంజాయ్ చేయడమే ప్రేమ అనుకునే యువతకు ఈ సినిమా చూసిన తర్వాత నిజమైన ప్రేమంటే ఏమిటో అర్థమవుతుంది.

ఇందులో ప్రధాన పాత్రలు చేసిన రిషికాంత్, అనిష్మాతో పాటు ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రల్లో జీవించేశారు. ఈ మూవీ చూస్తున్నంతసేపు మనం కూడా వాళ్లింట్లో వాళ్లతో పాటే ఉన్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమాకు దర్శకుడు రాజా కరప్పుసామి.. ఇందులో కథతే టర్నింగ్ పాయింట్ అయిన ప్రియుడి పాత్రలో నటించి అదరగొట్టేశాడు. టెక్నికల్‌గానూ ఈ మూవీకి అన్ని సమంగా కుదిరాయి. కీలకమైన సన్నివేశాల్లో పెళ్లి భజంత్రీలని ఉపయోగించిన విధానం క్రేజీగా అనిపిస్తుంది. ఇది స్ట్రెయిట్ తెలుగు సినిమానే అన్నంత పక్కాగా డబ్బింగ్ కుదిరింది. సెకండాఫ్‌లో కాస్త ల్యాగ్ అనిపిస్తుంది గానీ కుటుంబంతోనూ హాయిగా చూసి మనసారా నవ్వుకోవచ్చు. ఏదైనా కామెడీ మూవీ చూద్దామనుకుంటే దీన్ని అస్సలు మిస్ కావొద్దు.

-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్

(ఇదీ చదవండి: ప్యారడైజ్ సినిమా రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement