
తాము ఎప్పటికీ కార్మికుల పక్షానే ఉంటామని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పట్టు, విడుపులు వదిలిపెట్టి సమస్యను పరిష్కరించుకోవాలని ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులకు సూచించారు. నిర్మాతల సమస్యను కూడా అర్థం చేసుకోవాలని.. మొండి పట్టుదలకు పోతే మీరే నష్టపోతారని తెలిపారు. టాలీవుడ్లో నెలకొన్న సమస్యపై ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులతో మంత్రి కోమటిరెడ్డి సమావేశమయ్యారు.
విడతలవారీగా వేతనాల పెంపుకు అంగీకరించాలని నిర్మాతల మండలికి మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు. రేపు మరోసారి ఫిలిం ఛాంబర్లో కూర్చొని మాట్లాడుకోవాలని సూచించారు. మీరు సమ్మె చేస్తే చిన్న సినిమా నిర్మాతలకు ఇబ్బంది కలుగుతుందని.. మీరు నిర్మాతల మండలి కలిసి కమిటీగా ఏర్పాటు కావాలన్నారు. ఒకే సారి పెంచాలంటే ఎవరికైనా ఇబ్బందేనని.. వెంటనే సమ్మెలు విరమించి పనిలోకి దిగాలని మంత్రి కోరారు. ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
మా పరిస్థితి వివరించాం: ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు
మా పరిస్థితిని మంత్రికి వివరించామని ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు తెలిపారు. పలు అంశాలకు మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. మేము చెప్పిన సమస్యలపై నిర్మాతలతో మంత్రి ఫోన్ చేసి మాట్లాడారని వెల్లడించారు. రేపటి సమావేశానికి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ వస్తానని చెప్పారని.. ఫిల్మ్ ఛాంబర్ భేటీలో సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. రేపటి భేటీలో మా తరపున కమిటీ సభ్యులు హాజరవుతారని తెలిపారు.