ప్రఖ్యాత నటుడు, ముఖ్యమంత్రిగా తమిళ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి మక్కళ్ తిలగం ఎంజీఆర్. ఈయన బయోపిక్ తీసే సాహసం ఇప్పటివరకు ఎవరూ చేయలేదు. అలాంటిది ఇన్నాళ్లకు ఈయన జీవిత చరిత్ర సినిమాగా రాబోతుంది. పురట్చి తలైవర్ అనే టైటిల్ నిర్ణయించారు. ఎంజీఆర్‌గా జేఎం.బషీర్ నటించనున్నాడు.
ఈ సినిమాలో ఎంజీఆర్ రంగస్థల ప్రయాణం నుంచి, సినీ రంగప్రవేశం, మక్కళ్ తిలగంగా ఎదిగిన తీరు, రాజకీయ రంగప్రవేశం, డీఎంకే నేత అన్నాదురైతో కలిసి పయనం, తర్వాత 1972 అక్టోబరు 17న అన్నాడీఎంకే పార్టీని ప్రారంభించడం, ఎన్నికల్లో పోటీ చేసి ముఖ్యమంత్రిగా భాధ్యతలను చేపట్టడం తదితర అంశాలతో ఈ సినిమా రూపొందనుంది.
ఈ చిత్రాన్ని ఎంజీఆర్ ఎదిగిన, ఆయన రాజకీయ పార్టీని ప్రారంభించిన స్థానిక రామవరం తోటలో అక్టోబర్ 17న పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇందులో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం, చిత్ర నిర్మాణ సంస్థ, నిర్మాత,దర్శకుడు తదితర వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.


