
అందమైన ప్రేమకథలకి చక్కని భావోద్వేగాలు జోడించి తనదైన శైలిలో ఆవిష్కరిస్తుంటారు దర్శకుడు మణిరత్నం. ప్రస్తుతం ఆయన ఓ యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయట. ఈ చిత్రంలో హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ హీరోగా, రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటించనున్నారనే వార్తలు కోలీవుడ్‌లో వినిపిస్తున్నాయి.
ఈ కథకి ధ్రువ్, రుక్మిణి సరైన జోడీ అనే ఆలోచనతో వారిని ఎంపిక చేశారని టాక్. సెప్టెంబరులో ఈ సినిమా చిత్రీకరణకు శ్రీకారం చుట్టనున్నారట మణిరత్నం. ఇదిలా ఉంటే... నిఖిల్ హీరోగా నటించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ (2024) సినిమాతో తెలుగుకి పరిచయమయ్యారు రుక్మిణీ వసంత్. ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమాలో నటిస్తున్నారు.