
ఇక్కడున్న ఫొటోలో మంచి జోష్‌తో ఫుల్ ఖుషీగా కనిపిస్తున్నారు చిరంజీవి, వెంకటేశ్. ఇంతకీ ఈ జోష్‌కి కారణం ఏంటంటే... స్నేహితులను కలవడానికి వెళ్లారు. ప్రతి ఏడాది ‘క్లాస్ ఆఫ్ 80స్’ అంటూ 1980స్‌కి చెందిన నటీనటులందరూ కలిసి, సెలబ్రేట్ చేసుకుంటుంటారు. ఒక్కోసారి ఒక్కో థీమ్, ప్లేస్ ఉంటుంది. ఈసారి రీ యూనియన్‌కి చెన్నై వేదికైంది.
ఇందు కోసమే చిరంజీవి, వెంకటేశ్ శనివారం హైదరాబాద్ నుంచి చెన్నై ప్రయాణం అయ్యారు. ఇదిలా ఉంటే... చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మన శంకర వరప్రసాద్‌గారు’లో ఓ కీలకపాత్రలో వెంకటేశ్ నటించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ వచ్చే వారం ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో చిరంజీవి, వెంకటేశ్‌లపై కీలక సన్నివేశాలను, ఓ సెలబ్రేషన్ సాంగ్‌ను చిత్రీకరించడానికి ప్లాన్ చేశారట.
‘‘చిరంజీవి, వెంకటేశ్‌గార్లను కలిసి సెట్స్‌లో చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని ‘ఎక్స్’లో పేర్కొన్నారు అనిల్ రావిపూడి. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. ఇటు రీ యూనియన్ సెలబ్రేషన్స్ అటు సెట్స్‌లో సెలబ్రేషన్ సాంగ్... ఇలా ఈ నెల చిరంజీవి, వెంకటేశ్‌కు డబుల్ సెలబ్రేషన్స్ అని చెప్పుకోవచ్చు.