
కేజీఎఫ్ సినిమా (KGF Movie)తో కన్నడ సినిమా పేరు మార్మోగిపోయింది. 2018లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లు రాబట్టింది. దీనికి సీక్వెల్‌గా తెరకెక్కిన కేజీఎఫ్ 2 ఏకంగా రూ.1250 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే 'అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు, జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు' అన్న చందంగా ఈ సినిమాను చాలామంది లైట్ తీసుకున్నారట!
ఓ పెద్ద హీరోను అడిగితే..
ఈ విషయాన్ని కేజీఎఫ్, కాంతార నిర్మాతల్లో ఒకరైన చలువె గౌడ (హోంబలే ఫిలింస్ సహ వ్యవస్థాపకుడు) వెల్లడించారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మా కథల్ని ప్రపంచానికి పరిచయం చేయాలన్నదే మా లక్ష్యం. ఉదాహరణకు కాంతార ద్వారా భూతకోల అనే ఆచారాన్ని ప్రపంచానికి తెలియజేశాం. కొన్నేళ్ల క్రితం కేజీఎఫ్ సినిమాలో ఓ పాత్ర కోసం మేము ఓ పెద్ద స్టార్ హీరోను సంప్రదించాం. ఆయనేమన్నారంటే.. కన్నడ సినిమాలు ఎక్కడ ఆడతాయి?అని హేళన చేశారు.
ఇది కదా సక్సెస్ అంటే!
ఆ సమయంలో కర్ణాటక దాటితే కన్నడ చిత్రాల గురించి ఎవరికీ తెలియదన్నట్లుగా ఉండేది పరిస్థితి. కన్నడ ఇండస్ట్రీ అంటే డాక్టర్ రాజ్‌కుమార్.. అంతే తెలుసు. ఇప్పుడా పరిస్థితిలో మార్పు వచ్చింది. మమ్మల్ని హేళన చేసినవారే ఇప్పుడు అవకాశాలిమ్మని అడుగుతున్నారు. ఇది కదా సక్సెస్ అంటే! అని చెప్పుకొచ్చారు. అయితే ఆ స్టార్ హీరో ఎవరన్నది మాత్రం బయటపెట్టలేదు. హోంబలే ఫిలింస్ ప్రస్తుతం కాంతార చాప్టర్ 1 సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తోంది. ఈ మూవీ అక్టోబర్ 1న విడుదల కానుంది. వచ్చే ఏడాది సలార్ 2 సెట్స్‌పైకి వెళ్లనుంది. అలాగే హృతిక్ రోషన్.. ఈ బ్యానర్‌లో ఓ హిందీ మూవీ చేయనున్నాడు.
చదవండి: ఆ హీరోయిన్ మగాడిలా ఉంటుందన్న మృణాల్.. కౌంటరిచ్చిన బిపాసా