చరిత్రలో ఇలాంటి చిత్రం రాలేదు..! | Kasthuri Raja Talk About Habeebi Movie | Sakshi
Sakshi News home page

చరిత్రలో ఇలాంటి చిత్రం రాలేదు..!

Jun 12 2026 8:51 AM | Updated on Jun 12 2026 10:07 AM

Kasthuri Raja Talk About Habeebi Movie

ప్రేమ, యాక్షన్‌, సెంటిమెంట్‌ వంటి కమర్షియల్‌ అంశాలతో చాలా చిత్రాలు వస్తుంటాయి. అయితే సహజత్వం కూడిన మనసును హత్తుకునే చిత్రాలు చాలా తక్కువగానే వస్తుంటాయి.తాజాగా రూపొందిన అలాంటి చిత్రం హబిబి. ఒక మధ్య తరగతికి చెందిన ఇస్లామిక్‌ కుటుంబం నేపధ్యంలో రూపొందిన చిత్రం ఇది. మూడు తరాలుగా చేనేత వృత్తి నమ్ముకుని అత్యంత సాధారణ జీవితాన్ని అనుభవించే ఆ కుటుంబంలోని ఒక వ్యక్తి డబ్బు సంపాదించాలి, సంతోషంగా జీవించాలని భావించి, కొత్తగా పెళ్లి చేసుకుని భార్యను కూడా వదిలి దుబాయ్‌కి వెళ్తాడు. అక్కడ పలు ఏళ్లు పని చేసే సంపాదించిన డబ్బుతో సొంత ఊరికి తిరిగి వస్తాడు. 

అదే విధంగా తన అన్నయ్య కొడుకును కూడా దుబాయ్‌ కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. అయితే చదువుకునే రోజుల్లోనే సహా విద్యార్థినిపై మనసు పడ్డ అతను ఆమెకు దూరం కావడం ఇష్టం లేక దుబాయ్‌ కి వెళ్లడానికి అయిష్టత వ్యక్తం చేస్తాడు. అయితే కొన్ని కారణాల వల్ల ప్రేయసికి దూరం కావలిసిన పరిస్థితి నెలకొంటుంది. దీంతో అతను కూడా దుబాయ్‌ కి వెళ్తాడు. తిరిగి వచ్చిన తరువాత మరో యువతితో కుటుంబ సభ్యులు పెళ్లి ప్రయత్నాలు చేస్తారు. ఆ పెళ్లి జరిగిందా ? మొదట ప్రేమించిన యువతి ఏమైయ్యింది? వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో అత్యంత సహజత్వంగా రూపొందిన చిత్రం హబిబి. 

ఇస్లామీయ సమాజంలోని ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లలను యధార్థంగా తెరపై ఆవిష్కరించిన ఈ చిత్రానికి మీరా కదిరవన్‌ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. సీనియర్‌ దర్శకుడు కస్తూరి రాజా ప్రధాన పాత్రను పోషించిన ఇందులో నటి మాళవిక మనోజ్‌ మరో ముఖ్య పాత్రను పోషించారు. శ్యామ్‌ సి ఎస్‌.సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని నేశం ఎంటర్‌ టైన్మెంట్‌ ,జీకేఎస్‌ బ్రోస్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలు కలిసి నిర్ణయించాయి.కాగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని రోమియో పిక్చర్స్‌ అధినేత రాహుల్‌ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఇలాంటి చిత్రం గత 110 ఏళ్ల సినీ చరిత్రలో రాలేదని ప్రధాన పాత్రను పోషించిన దర్శకుడు కస్తూరి రాజా పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement