'చిన్న చిన్న ఆశై' క్లైమాక్స్‌కి అర్థమేంటి? | Chinna Chinna Aasai Movie OTT Climax Explained | Sakshi
Sakshi News home page

Chinna Chinna Aasai: 'చిన్న చిన్న ఆశై' క్లైమాక్స్‌కి అర్థమేంటి?

Jul 31 2026 9:07 PM | Updated on Jul 31 2026 9:07 PM

Chinna Chinna Aasai Movie OTT Climax Explained

ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అలా ఈ వారం హాట్‌స్టార్‌లోకి వచ్చిన మలయాళ ఫీల్ గుడ్ మూవీ 'చిన్న చిన్న ఆశై'. ఒకప్పటి హీరోయిన్ మధుబాల, ఇంద్రాన్స్ ఇందులో ప్రధాన పాత్రలు చేశారు. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం వారణాసి నేపథ్యంలో సాగే మిడిల్ ఏజ్(ప్రేమ) కథ. ఒంటరితనం, జీవితంలో రెండో అవకాశం, మానవ సంబంధాలు లాంటి ఎమోషనల్ అంశాన్ని ఇందులో సున్నితంగా చూపించారు. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ కంటతడి పెట్టించడంతో పాటు ప్రేక్షకుల్లో చాలా సందేహాలని రేకెత్తించింది. మాధవన్ మాస్టర్, లీలా బంధానికి అసలు అర్థమేంటి? లాంటి ప్రశ్నలు మనసులో ఉండిపోతాయి.

(ఇదీ చదవండి: ప్రియుడిని పరిచయం చేసిన తెలుగు సీరియల్ హీరోయిన్)

క్లైమాక్స్‌లో ఏం జరిగింది?
చివరలో మాధవన్, లీలా ఇద్దరూ గంగా నదిపై ఉన్న పడవలో పడుకుని రాత్రంతా కబుర్లు చెప్పుకొంటారు. కానీ ఇక్కడ ప్రేమ లేదా పెళ్లి గురించి ఎలాంటి మాటలు ఉండవు. రెగ్యులర్ సినిమాల్లో కనిపించే హ్యాపీ ఎండింగ్‌ కూడా ఉండదు. కానీ ఎన్నో ఏళ్లుగా వెతుకుతున్న అర్థం చేసుకునే మనిషిని కనుగొన్నాననే భావన ఇద్దరిలోనూ కలుగుతుంది. అదే విషయాన్ని దర్శకురాలు చూపించారు. వీళ్లిద్దరి బంధం స్నేహమా, ప్రేమా అనే విషయాన్ని మాత్రం ప్రేక్షకుల ఊహకే వదిలేశారు.

'చిన్న చిన్న ఆశై' క్లైమాక్స్‌లో మాధవన్, లీలా ఇద్దరూ.. ఎన్నో ఏళ్లుగా వారిని వెంటాడిన ఒంటరితనం, బాధలు, మనసులోని భారాన్ని నెమ్మదిగా వదిలిపెడతారు. చివరికు ఒకరికొకరు అండగా నిలిచే మనుషులుగా మారతారు. లీలా ఎన్నో ఏళ్లుగా తన మనసులోని కోరికలను పక్కన పెట్టి, పక్కనోళ్ల ఆశలకే ప్రాధాన్యం ఇస్తూ బతుకుతూ ఉంటుంది. అలాంటిది వారణాసిలో మాధవన్‌ మాస్టర్‌ని కలిసిన తర్వాత తన జీవితంపై ఆలోచన మారుతుంది. నవ్వడం, చిన్న చిన్న విషయాల్ని ఆస్వాదించడం లాంటి వాటిలో ఆనందాన్ని వెతుక్కోవడం నేర్చుకుంటుంది.

చివర్లో ఆమె గతాన్ని మర్చిపోదు కానీ ఆ బాధల్లోనూ ఆనందాన్ని వెతుక్కోవచ్చని తెలుసుకుంటుంది. మరోవైపు మాధవన్ మాస్టర్ పాత్ర ఆసాంతం చిరునవ్వుతో కనిపించినప్పటికీ, మనసులో ఎన్నో ఏళ్ల ఒంటరితనం ఉంటుంది. తన కుమార్తెతో మాట్లాడే సన్నివేశాల్లో అతని అంతర్మథనం స్పష్టంగా కనిపిస్తుంది. లీలను కలిసిన తర్వాత జీవితంలో నిజమైన తోడు ఎప్పుడు వస్తుందో చెప్పలేమని గ్రహిస్తాడు. వయసు పెరిగినా కొత్త బంధాలు ఏర్పడతాయని, జీవితానికి కొత్త అర్థం దొరుకుతుందని తెలుసుకుంటాడు. 'చిన్న చిన్న ఆశై' క్లైమాక్స్‌లో ఎలాంటి కమర్షియల్ హంగులు ఉండవు. అన్ని సమస్యలు ఒక్కసారిగా పరిష్కారమైపోయాయని కూడా చూపించరు. చిన్న చిన్న అనుబంధాలే జీవితాన్ని ఎంత అందంగా మార్చగలవో అని చెప్పే హత్తుకునే ముగింపుతో ఈ చిత్రం ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన ఫీల్ గుడ్ సినిమా.. 'చిన్న చిన్న ఆశై' తెలుగు రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement