breaking news
Chinna Chinna Aasai Movie
-
'చిన్న చిన్న ఆశై' క్లైమాక్స్‌కి అర్థమేంటి?
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అలా ఈ వారం హాట్స్టార్లోకి వచ్చిన మలయాళ ఫీల్ గుడ్ మూవీ 'చిన్న చిన్న ఆశై'. ఒకప్పటి హీరోయిన్ మధుబాల, ఇంద్రాన్స్ ఇందులో ప్రధాన పాత్రలు చేశారు. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం వారణాసి నేపథ్యంలో సాగే మిడిల్ ఏజ్(ప్రేమ) కథ. ఒంటరితనం, జీవితంలో రెండో అవకాశం, మానవ సంబంధాలు లాంటి ఎమోషనల్ అంశాన్ని ఇందులో సున్నితంగా చూపించారు. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ కంటతడి పెట్టించడంతో పాటు ప్రేక్షకుల్లో చాలా సందేహాలని రేకెత్తించింది. మాధవన్ మాస్టర్, లీలా బంధానికి అసలు అర్థమేంటి? లాంటి ప్రశ్నలు మనసులో ఉండిపోతాయి.(ఇదీ చదవండి: ప్రియుడిని పరిచయం చేసిన తెలుగు సీరియల్ హీరోయిన్)క్లైమాక్స్‌లో ఏం జరిగింది?చివరలో మాధవన్, లీలా ఇద్దరూ గంగా నదిపై ఉన్న పడవలో పడుకుని రాత్రంతా కబుర్లు చెప్పుకొంటారు. కానీ ఇక్కడ ప్రేమ లేదా పెళ్లి గురించి ఎలాంటి మాటలు ఉండవు. రెగ్యులర్ సినిమాల్లో కనిపించే హ్యాపీ ఎండింగ్ కూడా ఉండదు. కానీ ఎన్నో ఏళ్లుగా వెతుకుతున్న అర్థం చేసుకునే మనిషిని కనుగొన్నాననే భావన ఇద్దరిలోనూ కలుగుతుంది. అదే విషయాన్ని దర్శకురాలు చూపించారు. వీళ్లిద్దరి బంధం స్నేహమా, ప్రేమా అనే విషయాన్ని మాత్రం ప్రేక్షకుల ఊహకే వదిలేశారు.'చిన్న చిన్న ఆశై' క్లైమాక్స్‌లో మాధవన్, లీలా ఇద్దరూ.. ఎన్నో ఏళ్లుగా వారిని వెంటాడిన ఒంటరితనం, బాధలు, మనసులోని భారాన్ని నెమ్మదిగా వదిలిపెడతారు. చివరికు ఒకరికొకరు అండగా నిలిచే మనుషులుగా మారతారు. లీలా ఎన్నో ఏళ్లుగా తన మనసులోని కోరికలను పక్కన పెట్టి, పక్కనోళ్ల ఆశలకే ప్రాధాన్యం ఇస్తూ బతుకుతూ ఉంటుంది. అలాంటిది వారణాసిలో మాధవన్ మాస్టర్ని కలిసిన తర్వాత తన జీవితంపై ఆలోచన మారుతుంది. నవ్వడం, చిన్న చిన్న విషయాల్ని ఆస్వాదించడం లాంటి వాటిలో ఆనందాన్ని వెతుక్కోవడం నేర్చుకుంటుంది.చివర్లో ఆమె గతాన్ని మర్చిపోదు కానీ ఆ బాధల్లోనూ ఆనందాన్ని వెతుక్కోవచ్చని తెలుసుకుంటుంది. మరోవైపు మాధవన్ మాస్టర్ పాత్ర ఆసాంతం చిరునవ్వుతో కనిపించినప్పటికీ, మనసులో ఎన్నో ఏళ్ల ఒంటరితనం ఉంటుంది. తన కుమార్తెతో మాట్లాడే సన్నివేశాల్లో అతని అంతర్మథనం స్పష్టంగా కనిపిస్తుంది. లీలను కలిసిన తర్వాత జీవితంలో నిజమైన తోడు ఎప్పుడు వస్తుందో చెప్పలేమని గ్రహిస్తాడు. వయసు పెరిగినా కొత్త బంధాలు ఏర్పడతాయని, జీవితానికి కొత్త అర్థం దొరుకుతుందని తెలుసుకుంటాడు. 'చిన్న చిన్న ఆశై' క్లైమాక్స్‌లో ఎలాంటి కమర్షియల్ హంగులు ఉండవు. అన్ని సమస్యలు ఒక్కసారిగా పరిష్కారమైపోయాయని కూడా చూపించరు. చిన్న చిన్న అనుబంధాలే జీవితాన్ని ఎంత అందంగా మార్చగలవో అని చెప్పే హత్తుకునే ముగింపుతో ఈ చిత్రం ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన ఫీల్ గుడ్ సినిమా.. 'చిన్న చిన్న ఆశై' తెలుగు రివ్యూ) -
ఓటీటీలోకి వచ్చిన ఫీల్ గుడ్ సినిమా.. తెలుగు రివ్యూ
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. వాటిలో ఎక్కువగా థ్రిల్లర్, హారర్, యాక్షన్ జానర్సే ఉంటాయి. కొన్నిసార్లు మాత్రం సున్నితమైన కథతో సాగిపోయే ఫీల్ గుడ్ మూవీస్ రిలీజ్ అవుతుంటాయి. అలాంటి ఓ చిత్రమే 'చిన్న చిన్న ఆశై'. ఒకప్పటి హీరోయిన్ మధుబాల ఇందులో ప్రధాన పాత్ర చేసింది. మలయాళ సీనియర్ నటుడు ఇంద్రాన్స్ (Indrans) మరో ప్రధాన పాత్రధారి. వర్ష వాసుదేవ్ దర్శకురాలు. హాట్‌స్టార్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?తంజావూర్కి చెందిన లీల(మధుబాల) ఓ బృందంతో కలిసి వారణాసి యాత్రకు వస్తుంది. ఉదయం తిరగడానికి బయలుదేరిన కొద్దిసేపటికే టీమ్ నుంచి తప్పిపోతుంది. ఈమె పర్స్, మొబైల్ ఎవరో దొంగిలిస్తారు. దీంతో ఏం చేయాలో తెలీక గంగానది ఒడ్డున కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అలాంటి టైంలో ఈమెకు మాధవన్ మాస్టర్ (ఇంద్రాన్స్) పరిచయమవుతారు. తిరిగి తన బృందం దగ్గరకు చేరేందుకు లీలకు సాయం చేస్తానని అంటాడు. తర్వాత ఏమైంది? రోజంతా కలిసి తిరిగిన లీల-మాధవన్ మాస్టర్ మధ్య ఎలాంటి బంధం ఏర్పడింది? అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?కొన్ని సినిమాల్లో కథ ఉండదు. 'చిన్న చిన్న ఆశై' అలాంటి మూవీనే. అనుకోకుండా కలిసిన ఇద్దరు అపరిచిత వ్యక్తులు, రోజంతా కలిసి మాట్లాడుకుంటూ కాశీ అంతా తిరుగుతారు. ఇదే స్టోరీ. ఏంటి ఇంతేనా? ఇద్దరు మనుషులు మాట్లాడుకోవడం ఒక సినిమానా? అసలు దీన్ని ఎవరు చూస్తారు? ఎందుకు చూడాలి? అని మీకు చాలా సందేహాలు రావొచ్చు. కానీ రెండు గంటలు టైమ్ మీది కాదనుకుని చూస్తే ఓ మంచి ఫీల్ గుడ్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది.డిష్యుం డిష్యుం అంటూ యాక్షన్ సినిమాలు, టెన్షన్‌తో పోయే థ్రిల్లర్ చిత్రాలే కాదు మనసుకు హాయిగా అనిపించే మూవీస్ కూడా అప్పుడప్పుడు చూడాలి. ఇది అలాంటిదే. అలా అని ఇదేదో గొప్ప అద్భుతమైన చిత్రం మాత్రం కాదు. కాకపోతే చూసిన తర్వాత మీ మనసులో కచ్చితంగా నిలిచిపోతుంది. మూవీ, ఇందులోని పాత్రల గురించి ఆలోచించేలా చేస్తుంది.వైవాహిక జీవితంలో గొడ్డు చాకిరీ చేసి అలసిపోయిన లీల.. భర్త చనిపోయిన ఏడాదిన్నరకు కాశీ యాత్రకు వస్తుంది. వచ్చిందనే మాటే గానీ తన బృందంతో కలవదు. నోరు విప్పి ఏం మాట్లాడదు. ప్రతిదానికి భయపడుతూ ఉంటుంది. అలాంటి ఈమె జీవితంలోకి మాధవన్ మాస్టర్ రావడంతో ఏం జరిగింది? ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? ఈమె మనసులోని 'చిన్న చిన్న ఆశలు' ఆయన వల్ల ఎలా నెరవేరాయి? ఈ క్రమంలో మాస్టర్‌పై ఆమె పెంచుకున్నది ఇష్టమా? ప్రేమా? ఆప్యాయతా? అనేది మూవీ చూసి మీరు తెలుసుకోవాలి.జీవితం సమస్యలతో సతమతమైనప్పుడు.. విధి ఒంటరిని చేసినప్పుడు ఏ మనసయినా ప్రశాంతతని కోరుకుంటుంది. స్వచ్ఛమైన మరో మనసు తోడుని కాంక్షిస్తుంది. అలాంటి తోడు అనుకోకుండా కనిపిస్తే ప్రతి చిన్న సంఘటన ఓ అందమైన జ్ఞాపకంలా నిలిచిపోతుంది. ఇలాంటి పరిస్థితులున్న ఇద్దరి మనుషుల కథే ఇది.సినిమాలో చాలా లోతైన భావన ఉంటుంది కానీ దాన్ని చూపించే విధానం సాగదీతలా అనిపిస్తుంది. ఇది మీకు ఓకే అనుకుంటే మూవీ నచ్చేస్తుంది. లీల పాత్రలో మధుబాల, మాధవన్ మాస్టర్‌గా ఇంద్రాన్స్ జీవించేశారు. సినిమా అంతా అలా అలా సాగిపోతూ హాయిగా ఉంటుంది. క్లైమాక్స్ మాత్రం మనసుని బరువెక్కిస్తుంది. మూవీ అయిపోయినా సరే కచ్చితంగా ఆ ట్రాన్స్‌లో ఉండిపోతారు.పేరుకే తెలుగు డబ్బింగ్ అన్నారు గానీ లీల పాత్రకు తమిళ నేపథ్యం పెట్టారు. దీంతో ఈమె చాలావరకు తమిళంలోనే డైలాగ్స్ చెబుతూ ఉంటుంది. ఇవి అర్థం కావాలంటే సబ్ టైటిల్స్ పెట్టుకుని చూడాల్సి ఉంటుంది. ఇది పర్లేదనుకుంటే 'చిన్న చిన్న ఆశై' చూడొచ్చు. అసభ్యకర సన్నివేశాలేం లేవు. కుటుంబంతోనూ కలిసి వీక్షించొచ్చు. అలానే మూవీ అంతా చూసిన తర్వాత కచ్చితంగా కొంతమందికైనా కాశీ వెళ్లి, ఆ ఘాట్స్ అన్ని తిరిగి రావాలని అనిపిస్తుంది!- చందు డొంకాన


