నటుడు కరుణాస్ తన సినీ ప్రయాణంలో ఇప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోయిన ఓ నిర్ణయం గురించి వెల్లడించారు. వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అసురన్’లో తొలుత హీరో పాత్ర కోసం తనను సంప్రదించారని, అయితే తాను ఆ అవకాశాన్ని వదులుకున్నానని చెప్పారు. కథను ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ చేయాలంటే బలమైన హీరో ఇమేజ్ ఉన్న నటుడు అవసరమని తాను భావించడంతో ఈ నిర్ణయం తీసుకున్నానని కరుణాస్ తెలిపారు. ‘అసురన్’ సినిమా తెలుగులో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా 2021లో ‘‘నారప్ప’’ పేరుతో రీమేక్ అయిన విషయం తెలిసిందే.
బిహైండ్‌వుడ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘అసురన్’ సినిమా గురించి కరుణాస్ మాట్లాడుతూ.. “నా కొడుకుతో కలిసి ‘అసురన్’లో నటించాల్సి ఉంది. వెట్రిమారన్ నాతో ఈ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేను కథ చదివి వెంటనే ఆయనతో ‘సర్, ఇందులో హీరో నటిస్తేనే ఇది పనిచేస్తుంది. నేను నటించను’ అని చెప్పాను” అన్నారు.
తనతోనే సినిమాను ముందుకు తీసుకెళ్లడానికి వెట్రిమారన్ సిద్ధంగా ఉన్నారని, అయితే మరింత గుర్తింపు ఉన్న హీరోను ఎంపిక చేసుకోవడం సినిమాకు ప్రయోజనకరంగా ఉంటుందని తాను భావించానని ఆయన గుర్తుచేసుకున్నారు. కరుణాస్ తీసుకున్న నిర్ణయంతో చివరకు ధనుష్ ఆ పాత్రను పోషించే అవకాశం వచ్చింది.
ఎందుకు అలా కోరారంటే..
దర్శకుడితో జరిగిన సంభాషణను కరుణాస్ మరింతగా గుర్తుచేసుకున్నారు. “కథ అద్భుతంగా ఉందని, హీరో ఇమేజ్ ఉన్న వ్యక్తి ప్రధాన పాత్ర పోషిస్తే సినిమా వాణిజ్యపరంగా మరింత బాగా పనిచేస్తుందని చెప్పాను. సినిమా స్వభావాన్ని బట్టి నిర్ణయం తీసుకునే వ్యక్తిని నేను. వెట్రిమారన్ దర్శకత్వం వహిస్తుంటే, అలాంటి అవకాశాన్ని ఎవరు వదులుకుంటారు?” అని అన్నారు. కరుణాస్‌తో సినిమాను ఎలా చేయాలో తనకు తెలుసని దర్శకుడు హామీ ఇచ్చారని, అయినా తాను తీసుకున్న నిర్ణయంలో మార్పు చేయలేదని ఆయన తెలిపారు.
జాతీయ పురస్కారం అందుకున్న ‘అసురన్’
‘అసురన్’ 2019లో విడుదలైంది. ధనుష్, మంజు వారియర్, కెన్ కరుణాస్, పశుపతి నటించారు. సంగీతాన్ని జీవీ ప్రకాశ్ కుమార్ అందించారు. రచయిత పూమణి రాసిన ‘వెక్కై’ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. కథ, నటీనటుల ప్రదర్శనలకు సినిమాకు మంచి ప్రశంసలు లభించాయి. అనంతరం 67వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ పురస్కారాన్ని గెలుచుకుంది.


