వన్‌ మ్యాన్‌ ఇండస్ట్రీ.. భాగ్యరాజ్‌ ప్రత్యేకలు ఇవే! | K Bhagyaraj Film Journey, Interesting Facts | Sakshi
Sakshi News home page

వన్‌ మ్యాన్‌ ఇండస్ట్రీ.. భాగ్యరాజ్‌ ప్రత్యేకలు ఇవే!

Jun 27 2026 11:12 AM | Updated on Jun 27 2026 12:41 PM

K Bhagyaraj Film Journey, Interesting Facts

తమిళ సినీ పరిశ్రమ మరో దిగ్గజాన్ని కోల్పోయింది. ప్రముఖ నటుడు, దర్శకుడు, కథా రచయిత, స్క్రీన్‌ప్లే నిపుణుడు కే. భాగ్యరాజ్‌ శనివారం కన్నుమూశారు. 73 ఏళ్ల వయసులో గుండెపోటు రాగా.. ఆస్పత్రికి తరలించగా అప్పటికే వైద్యులు ఆయన మృతిని ధ్రువీకరించారు. నటుడిగా, దర్శకుడిగా, రచయితగా నాలుగు దశాబ్దాలకుపైగా తనదైన ముద్ర వేసిన భాగ్యరాజ్‌ మరణంతో దక్షిణాది సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.

దర్శక దిగ్గజం కే. భారతి రాజా శిష్యుడిగా సినీ ప్రయాణం ప్రారంభించిన భాగ్యరాజ్‌.. కొద్ది కాలంలోనే తన ప్రత్యేక శైలితో స్టార్‌ దర్శకుడిగా ఎదిగారు. సాధారణ మధ్యతరగతి కుటుంబాల జీవితం, భార్యాభర్తల బంధం, ప్రేమ, కుటుంబ విలువలను హాస్యంతో మేళవించి చెప్పడంలో ఆయనకు సాటి చాలా అరుదు. అందుకే తమిళ ప్రేక్షకులు ఆయనను కేవలం దర్శకుడిగానే కాదు, "వన్‌ మ్యాన్‌ ఇండస్ట్రీ"గా కూడా అభివర్ణించేవారు. కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం, నటన.. ఇలా ఒక సినిమాకు అవసరమైన దాదాపు అన్ని బాధ్యతలను ఒంటరిగా నిర్వహించి ఎన్నో విజయాలు సాధించారు.

తెరపై నవ్వులు పూయిస్తూనే.. 
భాగ్యరాజ్‌ సినిమాల ప్రత్యేకత కథల్లోనే కాదు.. వాటి వెనుక ఉన్న ఆలోచనల్లో కూడా కనిపించేది. సమాజంలో సున్నితమైన అంశాలను ఎంచుకుని వాటిని వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేసేవారు. కుటుంబ వ్యవస్థ, మహిళల స్థానం, దాంపత్య బంధాలు, మానవ సంబంధాల్లోని సంఘర్షణలను ఆయన తెరపై కొత్త కోణంలో ఆవిష్కరించారు. అప్పట్లో ఆయన చిత్రాల్లోని కొన్ని సన్నివేశాలు, సంభాషణలు తీవ్ర చర్చకు దారితీసినా.. అదే సమయంలో ప్రేక్షకులను ఆలోచింపజేసే శక్తి కూడా వాటికి ఉండేది.

దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా భాగ్యరాజ్‌ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సహజమైన నటన, టైమింగ్‌తో కూడిన కామెడీ, భావోద్వేగ సన్నివేశాల్లోని లోతైన అభినయం ఆయనను ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి. తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకూ ఆయన సుపరిచితమే. ఆయన నటించిన, దర్శకత్వం వహించిన అనేక చిత్రాలు తెలుగులో డబ్‌ కావడమే కాకుండా, కొన్ని సినిమాలు రీమేక్‌ అయ్యి ఘన విజయాలు సాధించాయి. తెలుగులో రీమేక్‌ అయి సూపర్‌ హిట్‌గా నిలిచిన  సుందరకాండ, అబ్బాయిగారు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, రాధా కాళ్యాణం, మాయదారి మొగుడు, ఇల్లాలే నా దేవత లాంటి సినిమాలన్నింటికి ఆయనే కథను అందించాడు.  కొన్నింటికి దర్శకత్వం కూడా వహించాడు. 

కె. భాగ్యరాజ్ కథల్లో విలన్లు ఉండరు. కేవలం పాత్రల మధ్య వచ్చే అపార్థాలు, మానవ సంబంధాలు, మిడిల్ క్లాస్ సెంటిమెంట్ మరియు సున్నితమైన హాస్యం మాత్రమే కథను నడిపిస్తాయి. అందుకే ఆయన కథలు తెలుగు నేటివిటీకి అంత బాగా సెట్ అయ్యి రీమేక్స్‌లో తిరుగులేని విజయాలను అందించాయి
 

కింగ్‌ఆఫ్‌ స్క్రీన్‌ప్లే.. 
స్క్రీన్‌ప్లే రచనలో భాగ్యరాజ్‌ ఒక ప్రత్యేక పాఠశాల. సాధారణ కథనాన్ని కూడా ఆసక్తికర మలుపులు, చురుకైన సంభాషణలు, సహజమైన పాత్రలతో ప్రేక్షకుడిని చివరి వరకు కట్టిపడేసే నైపుణ్యం ఆయన సొంతం. నేటి తరం దర్శకుల్లో కూడా చాలామంది భాగ్యరాజ్‌ను తమకు స్ఫూర్తిగా పేర్కొంటూ ఉంటారు. సినిమాలతో పాటు రచయితగా, పత్రికా సంపాదకుడిగా కూడా ఆయన సేవలందించారు. తమిళ సినీ పరిశ్రమలో ఆయన ఒక సృజనాత్మక శక్తిగా గుర్తింపు పొందారు.

భాగ్యరాజ్‌ నటించిన తెలుగు సినిమాలు
చిలిపి పెళ్లాం (1990)
మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు.. మా ఇంటికొస్తే ఏం తెస్తారు (2004)
మేం వయసుకు వచ్చాం (2012)
డిటెక్టివ్ (2017)
అల్లంత దూరాన (2023)
35 చిన్న కథ కాదు (2024)
కుబేర(2025)

ఇటీవలే ఆయన గురువు భారతి రాజా మృతితో విషాదంలో మునిగిన తమిళ సినీ లోకం.. రెండు వారాలు గడవకముందే భాగ్యరాజ్‌ను కూడా కోల్పోవడం పరిశ్రమను మరింత కలచివేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement