పిట్ట కొంచెం...కలెక్షన్స్‌ ఘనం.. ఎత్తు 4అడుగులు కలెక్షన్లు రూ.1900కోట్లు | Jaffer Sadiq Movies Record Collection In Movie Industry | Sakshi
Sakshi News home page

పిట్ట కొంచెం...కలెక్షన్స్‌ ఘనం.. ఎత్తు 4అడుగులు కలెక్షన్లు రూ.1900కోట్లు

Apr 19 2025 10:52 AM | Updated on Apr 19 2025 12:32 PM

Jaffer Sadiq Movies Record Collection In Movie Industry

బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ ఖాన్‌ పరిశ్రమలో కలెక్షన్‌ కింగ్స్‌లో ఒకడు, అతని అనేక చిత్రాలు రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసి నిర్మాతలకు కాసుల పంట పండించాయి . అదే విధంగా గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌ హీరో ప్రభాస్‌ కూడా బాక్సాఫీస్‌ దగ్గర సత్తా చూపిస్తున్నాడు. అయితే వీళ్లెవరూ సాధించని విధంగా ఒక నటుడు నటించిన సినిమాల కలెక్షన్స్‌ ప్రకారం చూస్తే.. గత మూడు సినిమాల ద్వారా రూ.1900 కోట్లు రాబట్టాడు. అజానుబాహుడైన హీరోలకు భిన్నంగా ఈ నటుడి ఎత్తు  కేవలం ఎత్తు 4 అడుగుల 8 అంగుళాలు మాత్రమే..వయస్సు 27 సంవత్సరాలు   అయినప్పటికీ, ఈ దక్షిణ భారత నటుడి గత 3 చిత్రాలు అద్భుతాలు చేశాయి. ఆ నటుడి పేరు జాఫర్‌ సాదిక్‌(Jaffer Sadiq).

జాఫర్‌ సాదిక్‌ 1995 జూలై 4న తమిళనాడులోని ఈరోడ్‌లో జన్మించారు. గత 3 సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించడంతో ఇప్పుడు సౌత్‌ ఇండియాలో పాపులర్‌ స్టార్‌ అయిపోయాడు.  తన కెరీర్‌ను 2020 సంవత్సరంలో ‘పావ కాదగల్‌’ అనే టీవీ సీరియల్‌తో జాఫర్‌  సాదిక్‌ ప్రారంభించాడు. ఈ సీరియల్‌ తో జాఫర్‌ స్టార్‌ అయిపోయాడు. తన మొదటి సీరియల్‌ తోనే వీక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న తర్వాత, జాఫర్‌కు 2022లో ‘విక్రమ్‌’ చిత్రంలో అవకాశం వచ్చింది. కమల్‌ హాసన్, విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన ‘విక్రమ్‌’ చిత్రంలో సాదిక్‌ పాత్ర చాలా బలంగా ప్రేక్షకులకు కనెక్ట్‌ అయింది.  ఈ తమిళ చిత్రం కూడా బాక్సాఫీస్‌ దగ్గర వీరవిహారం చేసి దాదాపు రూ.500 కోట్లు రాబట్టి చరిత్ర సృష్టించింది. విక్రమ్‌ సినిమా తర్వాత, సాదిక్‌ వెందు తనింధతు కాదు అనే చిత్రంలో నటించారు.

దీనితో పాటు, సాదిక్‌ సైతాన్‌ అనే వెబ్‌ సిరీస్‌లో కూడా బలమైన పాత్ర పోషించి  ప్రశంసలు అందుకున్నాడు. దీని తర్వాత,  విడుదలైన ‘జైలర్‌’ చిత్రంలో రజనీకాంత్‌తో జాఫర్‌ సాదిక్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నాడు... ఈ చిత్రం కూడా బాక్సాఫీస్‌ వద్ద చాలా ప్రకంపనలు సృష్టించి రూ. 650 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. రజనీకాంత్‌తో స్క్రీన్‌ను పంచుకున్న తర్వాత, షారుఖ్‌ ఖాన్‌ హీరోగా నటించిన జవాన్‌ చిత్రంలో సాదిక్‌ కూడా తనదైన శైలిలో మెప్పించాడు.  ఆ చిత్రం కూడా బాక్సాఫీస్‌ దగ్గర భీభత్సం సృష్టించింది.  ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. మొత్తంగా చూస్తే జాఫర్‌ సాదిక్‌ గత మూడు సినిమాలు 1900 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. జాఫర్‌ సాదిక్‌ ఎత్తు తక్కువే కావచ్చు, కానీ చాలా తక్కువ టైమ్‌లో, తక్కువ సినిమాలతోనే నటన పరంగా మాత్రం చాలా ఎత్తుకు ఎదిగాడు. ఇంకా బోలెడంత కెరీర్‌ ఉన్న జాఫర్‌...నటనా పరంగా మరిన్ని శిఖరాలు అందుకోవడం తధ్యంగా కనిపిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement